Live Breaking News & Updates on Password anantapur

Stay informed with the latest breaking news from Password anantapur on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Password anantapur and stay connected to the pulse of your community

గూడు కట్టిన నిర్లక్ష్యం


గూడు కట్టిన నిర్లక్ష్యం
నెరవేరని పట్టణ ప్రజల సొంతింటి కల
చివరి దశలో నిలిచిపోయిన టిడ్కో గృహాల పనులు
రెండేళ్లుగా నిరీక్షిస్తున్న లబ్ధిదారులు
శిరికి సూర్యనారాయణ, వీరగంధపు శ్రీనివాసరావు
ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగంతో కలిసి
సొంతింటి కల తీరబోతోంది.. పేదోళ్ల ఇళ్లలా కాకుండా మంచి టైల్స్‌, ఖరీదైన సామగ్రితో అందంగా ముస్తాబైన భవనాల్లోకి వెళ్లబోతున్నాం.. అని ఆ లబ్ధిదారులు సంబరపడ్డారు. తమ వాటా సొమ్ము కొంత ముందుగా చెల్లించమంటే అప్పులు తెచ్చి మరీ కట్టారు. గత ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో సకల వసతులతో శరవేగంగా నిర్మాణాలు సాగాయి. ఇంతలో ఎన్నికలొచ్చాయి. ప్రభుత్వం మారింది. రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం దాదాపుగా నిలిచిపోయింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లను వచ్చే నెలలోనే లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 166 ప్రాంతాల్లో నిర్మించిన టి¨డ్కో గృహాల ప్రస్తుత పరిస్థితిపై ‘ఈనాడు, న్యూస్‌టుడే’ ప్రతినిధులు అందిస్తున్న ప్రత్యేక కథనం
పట్టణ పేదలందరికీ 2022 నాటికి సొంతిల్లు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై)ను 2017లో ప్రారంభించింది. దేశంలోని మురికివాడల్లో నివసిస్తున్న 1.80 కోట్ల నిరుపేద కుటుంబాలకు, మురికివాడేతర ప్రాంతాల్లోని మరో 20 లక్షల పేద కుటుంబాలకు ఇళ్లు కట్టించి అందించాలన్నది దీని లక్ష్యం. దీనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాష్ట్రంలోని పుర, నగరపాలక సంస్థల్లో పేదల కోసం పీఎంఏవై- ఎన్టీఆర్‌ నగర్‌ పేరుతో 2,62,216 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతికతను జోడించి విట్రిఫైడ్‌ టైల్‌ ఫ్లోరింగ్‌, వంటగదిలో స్టీల్‌ సింక్‌, గ్రానైట్‌ ప్లాట్‌ఫారం, ట్రాక్‌ కిటికీలతో 15 నెలల్లో పూర్తి చేసేలా నిర్మాణ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేయించింది. అంతర్గత రహదారులు, తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి వ్యవస్థ, వరదనీటి కాలువలు, ఎల్‌ఈడీ వీధిదీపాలు, సామాజిక భవనాలు, ఉద్యానాలు, క్రీడామైదానాలతో కాలనీలను తీర్చిదిద్దేందుకు పనులు చేపట్టారు. 2019 సాధారణ ఎన్నికల నాటికి పలు జిల్లాల్లో సగటున 60-70 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం మారిన తర్వాత పనులు నిలిచిపోయాయి. పథకం పేరు మారినా పనులు ముందుకు సాగలేదు. అప్పటికే అందంగా ముస్తాబైన మూడంతస్తుల భవనాల చుట్టూ ఇప్పుడు ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు మొలిచాయి. పాములకు ఆవాసమవుతున్నాయి. కొన్నిచోట్ల ఇళ్లలో తలుపులు, కిటికీలు, ఎలక్ట్రికల్‌, మరుగుదొడ్లలోని సామగ్రి దొంగల పాలవుతున్నాయి. 18చోట్ల లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసినా రోడ్లు, కాలువలు, తాగునీరు వంటి మౌలిక వసతులు లేవు. అవన్నీ కల్పించాక కబురుపెడతామన్న అధికారులు మళ్లీ ఆ ఊసెత్తకపోవడంతో వీరంతా ఇప్పటికీ అద్దె ఇళ్లల్లోనే బతుకుతున్నారు. అసంపూర్తిగా, నిరుపయోగంగా ఉన్న ఈ గృహాలను కొన్ని జిల్లాల్లో తాత్కాలికంగా కొవిడ్‌ కేంద్రాలుగా మార్చారు.
ఖరీదైన సౌకర్యాలు.. కల్లలైన ఆశలు
కృష్ణా జిల్లా జక్కంపూడిలో రూ.228.38 కోట్లతో 6,576 మంది కోసం నిర్మించిన ఈ ఇళ్లను చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. పేదలు తమ జీవితంలో నిర్మించుకోలేని స్థాయిలో వీటిని కట్టారు. టైల్స్‌ నుంచి వంట గదిలో సింక్‌ వరకు అన్నీ ఖరీదైన వస్తువులే. రహదారులు, కాలువలు, వీధి దీపాలు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ పనులు పూర్తయితే గృహప్రవేశాలు చేసేందుకు లబ్ధిదారులు సిద్ధమయ్యారు. వీటి కోసం రూ.155.35 కోట్లతో ఇంజినీర్లు అంచనాలు కూడా రూపొందించారు. రెండేళ్ల క్రితం పనులు నిలిచిపోవడంతో పేదల కలలు కల్లలయ్యాయి.
ఎక్కడెక్కడ.. ఎలా ఉన్నాయంటే..
ఇళ్ల నిర్మాణం పూర్తయినా మౌలిక  వసతుల్లేని నివాస సముదాయాలు  80 
కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల 80-90% ఇళ్ల నిర్మాణం పూర్తయినా మౌలిక వసతులు కల్పించలేదు.
బిల్లులు సకాలంలో చెల్లించని కారణంగా ఇళ్ల నిర్మాణం నిలిపివేసిన ప్రాంతాలు 60  
అత్యధికంగా కృష్ణా, ప్రకాశం, కర్నూలు, కడప, అనంతపురం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో పనులు నిలిచిపోయాయి.
వర్షాల కారణంగా ఇళ్ల మధ్య నీరు చేరిన ప్రాంతాలు  30 
రహదారులు, కాలువలు ఏర్పాటు చేయకపోవడంతో గుంటూరు, మంగళగిరి, నరసరావుపేట, రేపల్లె, కడపలో చలమారెడ్డిపల్లె, నంద్యాల, ఎమ్మిగనూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వర్షపు నీరు నిలిచిపోతోంది.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినవి 17
అనంతపురం, కృష్ణా, కడప, విశాఖపట్నం, చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో పలుచోట్ల జూదరులకు, మందుబాబులకు పేదల ఇళ్లు అడ్డాగా మారాయి.
ఇళ్లలో నుంచి విలువైన వస్తువులు దొంగల పాలవుతున్న ప్రాంతాలు 11 
నందిగామ, తెనాలి, ఎమ్మిగనూరు, కడపలో సరోజినీనగర్‌, శ్రీకాళహస్తి, మదనపల్లె, నెల్లూరు, గూడూరు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా బోడసకుర్రు, శ్రీకాకుళంలో నిర్మాణం పూర్తయిన, అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లలో నుంచి కిటికీలు, స్విచ్‌బోర్డులు, వైర్లు, ఇతర నిర్మాణ సామగ్రిని దొంగలు ఎత్తుకెళుతున్నారు.
నిర్మాణం పూర్తయిన ఇళ్లను కొవిడ్‌ కేంద్రాలుగా ఉపయోగిస్తున్నవి 16 
గుంటూరు, కర్నూలు జిల్లాలో చెరో నాలుగు, పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాలో చెరో రెండు, శ్రీకాకుళం జిల్లాలో ఒకచోట టిడ్కో ఇళ్లలోనే కొవిడ్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నారు.
మౌలిక సదుపాయాల పనులు ప్రారంభించి అసంపూర్తిగా నిలిపివేసినవి 36
ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయినచోట మౌలిక సదుపాయాల పనులు ప్రారంభించారు. అయితే బిల్లులు చెల్లింపులో జాప్యంతో విజయనగరం, గుంటూరు, తెనాలిలోని చినరావూరు, నెల్లూరు జిల్లాలో కావలి తదితర ప్రాంతాల్లో ఈ పనులు నిలిపివేశారు.
నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించిన ప్రాంతాలు... 30 
కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ పనులను గుత్తేదారు సంస్థలు మళ్లీ ఇటీవల ప్రారంభించాయి. పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తామని టిడ్కో అధికారులు హామీ ఇవ్వడంతో మిగిలిన చిన్నా చితకా పనులు పూర్తి చేస్తున్నారు.
అద్దెలు చెల్లించలేకపోతున్నాం
ఇంటి కోసం 2018లో రూ.25 వేలు కట్టాం. ఇదిగో అదిగో అంటున్నారు తప్ప మూడేళ్లయినా ఇల్లు పూర్తి చేయలేదు. మిషన్‌ కుట్టి చాలీచాలని ఆదాయంతో జీవిస్తున్న నాకు నెలకు రూ.5 వేలు అద్దె చెల్లించడం కష్టమవుతోంది. 
-ఎస్‌.రమాదేవి, విజయవాడ
రూ.50వేలు కట్టాక పేరు లేదన్నారు
సొంతిల్లు లేదు. అద్దె బాధలు తప్పుతాయని అప్పు చేసి రెండు దశల్లో రూ.50,500 చెల్లించాం. అర్హత ఉన్నా లబ్ధిదారుల జాబితాలో నా భార్య పేరు లేదు. పేరు తొలగించడంపై కోర్టును ఆశ్రయిస్తాం.
-పి.రాయప్ప, నరసరావుపేట
ఇల్లు ఇవ్వకుండానే వాయిదాలు వసూలు
ఇల్లు వస్తుందంటే అప్పు చేసి రూ.లక్ష కట్టా. మూడేళ్లయినా అతీగతీ లేదు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం. మా పేర్లతో టిడ్కో వాళ్లు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారని చెబుతున్నారు. వాయిదాల కింద నా  ఖాతా నుంచి రూ.16 వేలు మినహాయించారు.         
-కె.రాణి, చిలకలూరిపేట
వడ్డీలు భారమవుతున్నాయి
మూడు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి రూ.50 వేలు కట్టా. మూడున్నరేళ్లయినా ఇల్లు అప్పగించలేదు. కూలి చేస్తే తప్ప పూటగడవని మేం అప్పుకు వడ్డీలు, ఇంటికి అద్దెకు కట్టలేక చాలా అవస్థలు పడుతున్నాం.
-షేక్‌ వహీదా, గుంటూరు
ఇల్లూ లేదు.. డబ్బు తిరిగివ్వలేదు
ఇంటి కోసం 2018 నవంబరులో రూ.25 వేలు డీడీ తీసి అధికారులకు ఇచ్చాను. ఇల్లు మంజూరైందన్నారు. తరువాత నా భర్త పేరుతో విద్యుత్తు మీటర్‌ ఉన్నందున రద్దు చేస్తున్నట్లు చెప్పారు. మాకు సొంతిల్లు లేదని ఆధారాలు చూపిస్తే పరిశీలిస్తామన్నారు. రెండేళ్లయినా సమాధానం లేదు. ఇల్లయినా కేటాయించాలి.. డబ్బులన్నా తిరిగివ్వాలి.
-పి.రోహిణి, నందిగామ
రెండేళ్ల అద్దె భారం రూ. 2,517 కోట్లు
దాదాపుగా నిర్మాణం పూర్తయిన 2,62,216 ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అప్పగించి ఉంటే పేదలకు రెండేళ్ల అద్దె భారం తగ్గేది. సగటున ఒక్కో కుటుంబం ఇంటి అద్దె నెలకు రూ.4 వేలు అనుకుంటే రెండేళ్లకు రూ.96 వేలు మిగిలేది. ఇళ్లు ఇవ్వకపోవడంతో గత రెండేళ్లలో పేదలు అద్దెల కింద రూ.2,517.27 కోట్లు చెల్లించారు.
లబ్ధిదారుల నుంచే మరో రూ.4వేల కోట్లు
లబ్ధిదారుల నుంచి నేరుగా, వారి తరఫున బ్యాంకుల నుంచి ఏపీ టిడ్కో ఇప్పటివరకు దాదాపు రూ.160 కోట్లు సేకరించింది. 300 చదరపు గజాల్లోపు ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ కేటగిరీ కింద సేకరించిన రూ.90 కోట్లపై వడ్డీతో కలిపి రూ.100 కోట్లు తిరిగి బ్యాంకులకు, లబ్ధిదారులకు ఏపీ టిడ్కో చెల్లించాలి. 365, 430 చదరపు అడుగుల కేటగిరీల్లో ఇళ్లకు లబ్ధిదారుల నుంచి మరో రూ.4 వేల కోట్లు సమీకరించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
Tags :

Kakinada , Andhra-pradesh , India , Rohini , West-bengal , Srikakulam , Nellore , Nellore-district , East-godavari , East-district , India-general- , West-godavari-district