విత్తన బంతులకు ‘గిన్నిస్’
2.08 కోట్ల తయారీ, 73,918తో పదాల రూపకల్పన
మహబూబ్‌నగర్ గ్రామీణం, న్యూస్‌టుడే : స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన విత్తన బంతులు గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కించుకొన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యుల ద్వారా తయారు చేసిన విత్తన బంతులు గతేడాది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కాయి. ఈసారి రెండు వారాల్లో రెండు కోట్ల ఎనిమిది లక్షల బంతులను తయారు చేయడం ఒక రికార్డు అయితే.. నాలుగు గంటల్లో 73,918 విత్తన బంతులతో అక్షర రూపం ఇవ్వడం మరో రికార్డుగా గిన్నిస్‌బుక్‌లో స్థానం లభించింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పురపాలిక కమ్యూనిటీ భవనంలో సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, గ్రీన్ ఛాలెంజ్ రూపకర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. మహిళా సంఘాలు తయారు చేసిన విత్తన బంతులతో ‘టూ క్రోర్ సీడ్ బాల్స్ ప్రిపేర్డ్ అండ్ ప్లాంటెడ్ బై ఎస్‌హెచ్‌జీ ఉమెన్స్ ట్రాన్స్‌ఫామ్ మహబూబ్‌నగర్ ఇన్ టు హెటిరో గ్రీన్ బెల్ట్’ పదాలుగా పేర్చారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్‌బుక్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ఆన్‌లైన్ లైవ్‌లో స్వయంగా చూశారు. విత్తన బంతులు తయారు చేసి, వాటిని అక్షరరూపంలో తీర్చిదిద్దిన మహిళలను గిన్నిస్ బుక్ ప్రతినిధి రిషినాథ్ అభినందించారు. త్వరలోనే జిల్లాకు గిన్నిస్‌బుక్ రికార్డు ధ్రువపత్రాన్ని పంపుతామని చెప్పారు.