vimarsana.com


Updated : 14/07/2021 05:49 IST
సింగరేణిలో పరిమితికి మించి తవ్వకాలు
నీటి, శబ్ద, వాయు కాలుష్యం లేదు
జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు సంయుక్త కమిటీ నివేదిక
ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర పర్యావరణ శాఖ అనుమతించిన పరిమాణం కంటే సింగరేణిలో ఎక్కువ స్థాయిలో తవ్వకాలు జరుగుతున్నాయని సంయుక్త కమిటీ ధ్రువీకరించింది. కేంద్ర పర్యావరణ శాఖ ఏడాదికి 2.50 మిలియన్‌ టన్నుల వెలికితీతకు అనుమతించగా దానికి విరుద్ధంగా రెట్టింపు తవ్వకాలు జరిపినట్లు తేల్చింది. 2007-08లో 1.917 మిలియన్‌ టన్నులు మినహా 2020 వరకు పరిమితికి మించే తవ్వకాలు జరిపిందని చెప్పింది. సింగరేణి గనుల సమీపంలోని గ్రామాల ప్రజలను మానవీయ కోణంలో ఆదుకోవాలంది. సింగరేణి గనుల్లో అనుమతుల్లేకుండా తవ్వకాలు చేపడుతున్నారని, రక్షణ చర్యలు చేపట్టడం లేదంటూ బానోతు నందు నాయక్‌, ఒగ్గు శ్రీనివాసరెడ్డిలు చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో పిటిషన్‌లు దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఎన్జీటీ ధర్మాసనం అటవీ పర్యావరణ ప్రాంతీయ శాఖ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఎం.టి.కరుప్పయ్య నేతృత్వంలో ఖమ్మం అదనపు కలెక్టర్‌ ఎన్‌.మధుసూదన్‌, రాష్ట్ర పీసీబీకి చెందిన ఇ.కృపానంద్‌, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎన్‌.బాలసుబ్రమణ్యం, ఆర్‌అండ్‌బీ ఈఈ ఎం.బి.హేమలతలతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది, క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు సింగరేణి గనుల తవ్వకాల ప్రాంతంలో పర్యటించి నివేదిక సమర్పించింది.
‘‘పరిమితికి మించి తవ్వకాలు జరిపిన విషయం వాస్తవమే. గత ఉల్లంఘనలకు పరిహారంగా రూ.26.67 కోట్ల బ్యాంకు గ్యారంటీని సింగరేణి పీసీబీకి సమర్పించింది. బొగ్గు రవాణాకు రైల్వే లైన్‌ పూర్తికాకపోవడంతో ఈ ఏడాది డిసెంబరు వరకు రోడ్డు రవాణాకు అనుమతించింది’’ అని నివేదికలో పేర్కొన్నారు.
కమిటీ నివేదికలోని ఇతర వివరాలు 
* జలగం వెంగళరావు ఓపెన్‌ కాస్ట్‌ 1, 2ల మూసివేత చర్యలపై అంచనా వేయాలన్న ఎన్జీటీ ఆదేశాల నేపథ్యంలో దీన్ని పరిశీలిస్తే ఈ గనుల విస్తరణకు కేంద్రం అనుమతి తీసుకోవడంతో మూసివేత ప్రస్తావనే లేదు. ఓపెన్‌కాస్ట్‌-1 మూసివేత చర్యల నిమిత్తం ఇప్పటికే ఎస్క్రో ఖాతాలో రూ.41.91 కోట్లు డిపాజిట్‌లు ఉంచింది.
* పచ్చదనం కోసం సింగరేణి రూ.కోటి ఖర్చు పెట్టింది. పేలుళ్ల వల్ల ఎన్టీఆర్‌నగర్‌లో ఎలాంటి ప్రకంపనలు లేవు. సింగరేణి బాధ్యత లేకపోయినప్పటికీ.. ఇళ్లు దెబ్బతిన్న ఎన్టీఆర్‌నగర్‌, జలగం వెంగళరావునగర్‌, రాజర్ల గ్రామంలోని ప్రజలకు మానవీయ కోణంలో సాయం అందించాలి.
* రాష్ట్ర మినరల్‌ ఫండ్‌కు రూ.161.40 కోట్లు కేటాయించినందున సమీప గ్రామాల్లో మౌలిక వసతుల మెరుగుకు దీన్ని ఉపయోగించాలి.
* మూడేళ్లపాటు ప్రాజెక్ట్‌ అథారిటీ ఎన్టీఆర్‌ నగర్‌ సమీపంలో ఆర్వో ప్లాంటు ఏర్పాటుచేసి తాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలి. సంచార వైద్యశిబిరాలను నిర్వహించాలి.
Tags :

Related Keywords

Khammam ,Andhra Pradesh ,India ,Singareni ,Chennai ,Tamil Nadu ,Jalagam Vengala Rao ,Us Committee ,Green Us Committee ,கம்மம் ,ஆந்திரா பிரதேஷ் ,இந்தியா ,சிங்கறெநீ ,சென்னை ,தமிழ் நாடு ,ஜலகம் வெங்கலா ராவ் ,எங்களுக்கு குழு ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.