24 గంటల్లో 26 టీఎంసీల నిల్వ
శ్రీశైలానికి 4 లక్షలకుపైగా క్యూసెక్కులు
కృష్ణమ్మకు తోడురానున్న తుంగభద్ర
శాంతించిన గోదావరి
భద్రాచలంలో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
ఈనాడు, హైదరాబాద్: శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఆదివారం సాయంత్రానికి 4 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం వస్తోంది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం మధ్యాహ్నానికి 24 గంటల వ్యవధిలో 26.30 టీఎంసీల నిల్వ, 8.9 అడుగుల మేర నీటి మట్టం పెరిగాయి. ఆదివారం రాత్రి 9 గంటల సమయానికి ప్రాజెక్టు పూర్తి నిల్వ మట్టం 885 అడుగులకు గాను 865.50 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ 124.22 టీఎంసీలకు చేరింది. మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు 46 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. సోమవారం నాటికి ఇవి కృష్ణా ప్రవాహానికి తోడుకానున్నాయి. శ్రీశైలానికి ఎగువన ఉన్న జూరాల జలాశయానికి ఆదివారం 4.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 44 గేట్ల ద్వారా దిగువకు 4.05 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు.
* గోదావరి శాంతించింది. నదిలో వరద ఉద్ధృతి తగ్గింది. ఎగువ నుంచి శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు 23 వేల క్యూసెక్కులే వస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 56 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నాయిగూడెం మండలం సమ్మక్క సాగర్ (తుపాకుల గూడెం) వద్ద నదిలో 9.50 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. భద్రాచలం వద్ద కూడా నీటిమట్టం తగ్గడంతో శనివారం జారీ చేసిన ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి సముద్రంలోకి 3 లక్షలకు పైగా క్యూసెక్కులను వదులుతున్నారు.
ఎల్లుండి అల్పపీడనం
ఈనాడు, హైదరాబాద్: బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో ఈ నెల 28న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. పశ్చిమ భారతం నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు పడ్డాయి. అత్యధికంగా కూనూర్(జనగామ జిల్లా)లో 2, అంగడి కిష్టాపూర్(సిద్దిపేట)లో 1.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
Tags :