vimarsana.com


ఇసుకెత్తుకెళ్లారు
రాజధాని నిర్మాణానికి నిల్వ చేసిన డంప్‌ నుంచి రాత్రివేళ తరలింపు
గుర్తించిన స్థానికులు
హైకోర్టుకు సమీపంలోని నేలపాడులో ఘటన
ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-తుళ్లూరు గ్రామీణం: రాజధాని అమరావతిలోని రహదారిని తవ్వేసి కంకర తరలించుకుపోయిన ఘటన మరువక ముందే... తాజాగా మరో దందా వెలుగుచూసింది. హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలు, రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో నిల్వచేసిన ఇసుకపై అక్రమార్కుల దృష్టి పడింది. రెండేళ్లుగా నిర్మాణాలు ఆగిపోవడంతో అక్కడున్న ఇసుకను రాత్రికి రాత్రే జేసీబీలతో లారీలు, ట్రాక్టర్లలో నింపి దుండగులు తరలించేశారు. నేలపాడులోని హైకోర్టు భవనానికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. లారీల్లో ఇసుక తరలించుకుపోతున్న విషయాన్ని సోమవారం రాత్రి కొందరు స్థానికులు గుర్తించటంతో ఈ దారుణం వెలుగుచూసింది.
ఇసుక దోపిడీ జరిగిన ప్రాంతానికి అమరావతి దళిత ఐకాస నాయకులు మంగళవారం చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఐకాస కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌, ఇతర నాయకులు ముళ్లముడి రవికుమార్‌, చిలకా బసవయ్య, పులి చిన్నా, పూల రవి, బేతపూడి సుధాకర్‌, రామారావు, రైతులు ఇడుపులపాటి సీతారామయ్య, గాంధీ తదితరులు ఇదంతా వైకాపా నాయకుల పనేనని ఆరోపించారు. ముఖ్యమంత్రి- డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. డంప్‌ నుంచి తరలించుకుపోగా మిగిలిన ఇసుకను... లారీలు, ట్రాక్టర్లు అక్కడ నడిచాయని చెప్పేందుకు వీలుగా ఆయా వాహన చక్రాల గుర్తులను విలేకర్లకు చూపించారు. 50-60 లారీల ఇసుక తరలించారని ఆరోపించారు. ఇసుక దొంగలపై కేసు పెట్టాలని తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రి అనుచరులే దోచేశారు: దళిత ఐకాస నాయకులు
అమరావతిని నాశనం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూల్చివేతలకు పాల్పడుతుంటే... స్థానికంగా ఉండే ఆయన అనుచరులు రాజధానిలోని రోడ్లను తవ్వేసి కంకర దోచుకోవటం, నిర్మాణాల కోసం నిల్వచేసిన ఇసుక తరలించేయటం లాంటివి చేస్తున్నారని దళిత ఐకాస కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌, ఇతర నాయకులు ఆరోపించారు. ఘటనా స్థలం వద్ద వారంతా కలిసి విలేకర్లతో మాట్లాడారు. అమరావతిని నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. అమరావతి కోసం పోరాడుతున్న రైతులపై కేసులు పెడుతున్న పోలీసులు.. ఇసుక దొంగలపై ఎందుకు కేసులు పెట్టట్లేదని ప్రశ్నించారు. హైకోర్టుకు సమీపంలోనే ఇసుక దోచుకెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. రైతులకు ఇచ్చిన ప్లాట్ల హద్దురాళ్లను తొలగించేసి మరీ ఇసుక తరలించారని. ఇది అమరావతిపై విషం చిమ్మటమేనని ఆరోపించారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లను కూడా వైకాపా నాయకులు నరికేస్తున్నారని ఆరోపించారు.
Tags :

Related Keywords

Amravati Dalit ,High Court Building ,High Court ,உயர் நீதிமன்றம் கட்டிடம் ,உயர் நீதிமன்றம் ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.