Updated : 29/07/2021 13:20 IST
రూ. 8.4 కోట్ల గంజాయి స్వాధీనం
ఉమ్మడి ఖమ్మం పోలీసుల ఘనత చేపలు, పండ్ల మాటున తరలిస్తుండగా పట్టివేత
ఈటీవీ-ఖమ్మం, చంచుపల్లి, ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: చేపల పెట్టెల మాటున.. పండ్ల రవాణా చాటున సాగుతున్న గంజాయి అక్రమ రవాణా గుట్టును ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒకేరోజు రూ. 8.4 కోట్ల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. భద్రాద్రి ఎస్పీ సునీల్‌దత్, ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు.ఎస్.వారియర్ బుధవారం ఈ వివరాలు వెల్లడించారు. హరియాణాకు చెందిన ఆర్షద్ ఖాన్, ప్రశాంత్ అనే వ్యక్తుల సూచనలతో వారికి సరఫరా చేసేందుకు రంగారెడ్డి జిల్లా జగద్గరిగుట్టకు చెందిన కాస్లే వెంకటేశ్, కర్ణాటకకు చెందిన కాస్లే సుభాష్, రాజస్థాన్‌కు చెందిన కిడ్లే నఫీజ్, హరియాణాకు చెందిన ఇమ్రాన్‌ఖాన్ ఏపీలోని చింతూరులో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొన్నారు. మంగళవారం రాత్రి రెండు లారీల్లో హైదరాబాద్, హరియాణాకు తరలిస్తుండగా భద్రాద్రి జిల్లా చుంచుపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. పైన చేపలు తరలించే థర్మాకోల్ పెట్టెలు పెట్టి అడుగున గంజాయి ఉంచారు. 104 బ్యాగుల్లో తరలిస్తున్న 3,653 కిలోల గంజాయి విలువ రూ. 7.30 కోట్లు ఉంటుందని ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు.
గ్రామీణ మండలంలో ఉంటూ..: విశాఖ జిల్లా చింతపల్లి నుంచి ఖమ్మం జిల్లా ఆరెంపులకు గంజాయి తరలిస్తుండగా ఏదులాపురం వద్ద పోలీసులు పట్టుకున్నారు. వాహనాలను తనిఖీ చేయగా ఫైనాపిల్ పండ్ల రవాణా మాటున గంజాయి పట్టుబడింది. ఆరెంపుల వద్ద గోదాములో నిల్వ ఉంచిన గంజాయితో కలిపి మొత్తం 730 కిలోల సరకు దొరికింది. నిందితులు చిరు వ్యాపారులుగా నమ్మిస్తూ ఖమ్మం గ్రామీణ మండలంలో నివాసం ఉంటున్నారు. సుమారు రూ. 1.09 కోట్ల విలువగల 730 కిలోల గంజాయి, ఆరు వాహనాలతోపాటు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆషుమియా, ఆసీఫ్ ఖురేషి, అనిష్‌ఖాన్, ఆరీఫ్ ఖురేషి, మౌసిన్, యామిన్, భద్రాద్రి జిల్లా సర్వారానికి చెందిన మాలోత్ పవన్‌కుమార్, చింతపల్లికి చెందిన పంగి నారాయణ, శివ నిందితులని ఖమ్మం సీపీ వెల్లడించారు.
Tags :