Jun 26, 2021, 08:59 IST
రాజానగరం: వ్యవసాయం అంటే మనిషికి, మట్టికి మధ్య ఉండే ఒక అందమైన బంధం. ఇది అర్థమయ్యేది ఒక్క రైతుకు.. వారి గురించి ఆలోచించే కొద్దిమందికి మాత్రమే. పండించే వాళ్లు తగ్గిపోయి.. తినేవాళ్లు నానాటికీ పెరిగిపోతున్న కాలంలో.. ఆశలన్నీ కొడిగట్టిపోతున్న రైతుల బతుకులకు ఇం‘ధనం’ అందించి.. వారి కష్టాలను అర్థం చేసుకుని.. అన్నివిధాలా ప్రోత్సహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ‘రైతు అంటే సింపతీ కాదు.. రెస్పెక్ట్’ అని నిరూపిస్తోంది. ఇందుకు అనుగుణంగానే అధికార యంత్రాంగం కూడా కదులుతోంది.
ప్రస్తుతం తొలకరి వర్షాలు కురుస్తూండటంతో అన్నదాతలు ఖరీఫ్ సాగుబడికి సమాయత్తమవుతున్నారు. రాజానగరం మండలం ముక్కినాడలో శుక్రవారం సంప్రదాయబద్ధంగా ఏరువాక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) జి.లక్ష్మీశ.. పొలం దున్నుతున్న రైతులతో చేయి కలిపారు. మేడి పట్టి కాసేపు.. తరువాత ట్రాక్టర్‌తోను మడి దున్నారు. ఆరుగాలం చెమట చిందిస్తూ, ప్రజల ఆకలి తీర్చేందుకు అవసరమైన తిండిగింజలు పండిస్తున్న రైతులే దేశానికి నిజమైన వెన్నెముక అని ఈ సందర్భంగా అన్నారు.