కర్ణాటకలో గత కొన్ని రోజులుగా పరస్పర విరుద్ధ ప్రకటనలతో సృష్టించిన అయోమయ రాజకీయ పరిస్థితికి యెడియూరప్ప రాజీనామాతో...కాదు.. కాదు..ఉద్వాసనతో తాత్కాలికంగా తెర పడింది. దక్షిణాదిలో బిజెపి పాలన కింద ఉన్న ఈ ఏకైక రాష్ట్రంలో అందునా జిత్తులమారి రాజకీయ ఎత్తుగడల్లో రాటుదేలిన యెడియూరప్పను అర్ధాంతరంగా సాగనంపడానికి బిజెపి చూపుతున్న కారణానికి, ఆయన చేసిన ప్రకటనలకు ఎక్కడా పొంతనే లేదు. 2011లో ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినందుకు ఆనాడు పార్టీపై తిరుగుబాటు చేసి అవినీతి కేసులో జైలుకు కూడా వెళ్లిన యెడియూరప్ప పదేళ్ల తరువాత మళ్లీ అదే పరిస్థితి ఎదురైతే కన్నీళ్లు పెట్టుకుని, తలొంచి తప్పుకున్నారు. అదే సమయంలో క్రియాశీల రాజకీయాల్లో మరో 15 ఏళ్లపాటు కొనసాగుతానని ప్రకటించారు. తన వారసుడిగా తాను ఎంపిక చేసిన వ్యక్తినే నియమించాలని, తన ఇద్దరు పుత్ర రత్నాలకు ప్రభుత్వంలోను, పార్టీలోను సముచిత పాత్ర కల్పించాలని కేంద్ర నాయకత్వానికి షరతులు పెట్టారని, స్పష్టమైన హామీ లభించిన తరువాతే పదవి వీడారన్న వాదనలు వినిపిస్తున్నాయి. యెడియూరప్ప సూచించిన బసవరాజ్ బొమ్మైనే ముఖ్యమంత్రిగా నియమించడం ఈ వాదనకు మరింత బలం చేకూర్చుతోంది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లాది రూపాయల నల్ల ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసినా, మోడీ, అమిత్‌షా ద్వయం ఎంతగా మత విద్వేషాలు రెచ్చగొట్టినా 225 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో బిజెపి కి 105 స్థానాలకు మించి రాలేదు. బిజెపి కి మెజార్టీ ఇచ్చేందుకు కర్ణాటక ప్రజలు తిరస్కరించడంతో కాంగ్రెస్, జె.డి(ఎస్) కలసి కుమారస్వామి ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఏడాదికే దానిని కూల్చివేసింది. డబ్బు, మంత్రి పదవులు ఎరగా వేసి కాంగ్రెస్, జె.డి(ఎస్)కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలను బిజెపి తమవైపు లాగేసుకుంది. వారితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో బిజెపి టికెట్లపై వారిని నిల్చోబెట్టి, గెలిచినవారికి మంత్రి పదవులు ఇచ్చింది. ఇలా అడ్డదారిలో గద్దెనెక్కిన యెడియూరప్ప గత రెండేళ్లలో అవినీతి, బంధుప్రీతి, అసమర్థతకు మారుపేరుగా మారారు. వరదలు, కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో యెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్పొరేట్ అనుకూల చట్టాల తరహాలోనే కర్ణాటకలో భూ సంస్కరణల ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. యెడియూరప్ప కుమారుడు విజయేంద్ర రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పోటెత్తాయి. అయితే ఈ కారణంగానే యెడియూరప్పపై బిజెపి అధినాయకత్వం వేటు వేసిందని అనుకోలేము. ముఖ్యమంత్రి మార్పునకు అదే ప్రాతిపదిక అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వంపై మొదట వేటు పడాలి. యు.పి లో అన్నిటా విఫలమైన యోగి ఆదిత్యనాథ్‌ను తొలగించాలి. బిజెపి భ్రష్టాచార రాజకీయాల గురించి తెలిసిన వారెవరూ బిజెపి అధినాయకత్వం చెబుతున్న ఈ కారణాన్ని నమ్మరు. జార్ఖండ్‌లో కర్ణాటక తరహాలోనే దొడ్డి దారిన అధికారం చేజిక్కించుకున్న బిజెపి నాలుగు మాసాల వ్యవధిలోనే ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చింది. యెడియూరప్ప కర్ణాటకలో బిజెపి విస్తరణకు పాటుపడుతున్నట్టు కనిపిస్తూనే, మరో వైపు కుల సమీకరణలతో తన సొంత బలాన్ని పెంచుకునేందుకు యత్నం చేశారు. ప్రాంతీయ నాయకులు బలపడితే తమకు ఎక్కడ ఎదురు తిరుగుతారోనన్న అభద్రత మోడీ, షా ద్వయాన్ని వెంటాడుతోంది. బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తరువాత ఈ అభద్రత మరింత పెరిగినట్టుంది. రాష్ట్రాల్లో నాయకులు కేంద్రానికి అణగిమణగి ఉండాలే తప్ప, సొంతంగా బలపడేందుకు యత్నిస్తే సహించేది లేదని దీని ద్వారా సంకేతం పంపింది. అందులోనూ వచ్చే ఏడాది యు.పి ఎన్నికలు, మరో 20 మాసాల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత పార్లమెంటు ఎన్నికలు ఒకదాని తరువాత ఒకటి వరుసగా వస్తుండడంతో బిజెపి అధినాయకత్వం ముందుగానే జాగ్రత్తపడుతున్నట్లుగా ఉంది. కుమార స్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఉపయోగించిన పెగాసస్ స్పైవేర్ నే జిత్తులమారి యెడియూరప్ప పై ప్రయోగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. యెడ్డీ గుట్టు ఏదో కేంద్రం వద్ద వుండబట్టే ఆయన గట్టిగా ఎదురు తిరగలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. యెడియూరప్ప చివరి వరకు పదవిని కాపాడుకోవడానికి యత్నించారు. మరోవైపు బిజెపి అధినాయకత్వం యెడియూరప్పను తప్పుకోమని ఆదేశించడానికి ముందు రోజు లింగాయత్ కమ్యూనిటీకి చెందిన వందలాది మంది సాధువులను కూడబెట్టి తనకు మద్దతుగా తీర్మానం చేయించుకోవడం, అధినాయకత్వం నుంచి వచ్చే డైరక్షన్ బట్టి తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పడం, ఆ తరువాత కొద్దిసేపటికే 'రాజీనామా చేసి పోతా' అనడం ఇవన్నీ అధికారాన్ని కాపాడుకునే ఎత్తుగడల్లో భాగమే. యెడ్డీ నిష్క్రమణ నేపథ్యంలో బిజెపి కుల సమీకరణలకు మళ్లీ తెరలేపుతోంది. సి.ఎం కుర్చీలో బొమ్మ మారినా బిజెపి మత విద్వేష రాజకీయాలు కొనసాగుతూనే ఉంటాయి. కర్ణాటకకు హాని కలిగించే ఇటువంటి కుత్సిత రాజకీయాలను తిప్పికొట్టాల్సిన అవసరముంది.
తాజా వార్తలు