Jul 29,2021 08:23
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా విపక్ష నేతలతో సమావేశమౌతున్నారు. బుధవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కూడా సమావేశమయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బిజెపికి వ్యతిరేకంగా విపక్ష కూటమి ఏర్పడితే..ఎవరు నాయకత్వం వహించినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు. సాధారణ కార్యకర్తగా పనిచేసేందుకు కూగా తాను సిద్ధమేనని పేర్కొన్నారు. సోనియా నివాసంలో 45 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో దేశంలో ప్రస్తుత పరిస్థితులు, విపక్షాల ఐక్యతకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ అధ్యక్షురాలితో చర్చించినట్లు దీదీ తెలిపారు. సోనియాతో సమావేశానికి ముందు.. ఎంపిక చేసిన కొంతమంది విలేకర్లతో మమత మాట్లాడారు. 'విపక్ష కూటమికి మీరే నాయకత్వం వహిస్తారా?' అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. 'పిల్ల పుట్టకముందే బారసాల ఏంటనీ' అంటూ చమత్కరించారు. 'పిల్లి మెడలో గంట కట్టే ప్రక్రియలో విపక్ష పార్టీలకు నేను సాయం చేయాలనుకుంటున్నా. నాయకురాలిగానే ఉండాలని కోరుకోవట్లేదు' అన్నారు.
సచ్చేదిన్‌కు సమయం ఆసన్నమైంది
2024 సార్వత్రిక ఎన్నికలను 'మోదీ వర్సెస్ దేశం'గా మమత అభివర్ణించారు. బిజెపి 2014 లోక్‌సభ ఎన్నికల వేళ ఇచ్చిన 'అచ్చే దిన్' నినాదాన్ని మమత ఎద్దేవా చేశారు. ప్రస్తుతం 'అచ్చే దిన్'కు బదులు 'సచ్చే దిన్ (విశ్వసనీయ రోజులు)' సమయం ఆసన్నమైందని అన్నారు. . ఇకపై దేశమంతటా 'ఖేలా హౌబె' నినాదం ప్రతిధ్వనిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం బాగా బలహీనపడిందన్న వార్తలపై స్పందించేందుకు మమత నిరాకరించారు. ఏ పార్టీ అంతర్గత వ్యవహారాల్లోనూ తాను జోక్యం చేసుకోబోనన్నారు. విపక్షాల ఐక్యతను సోనియా కోరుకుంటున్నట్లు చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తర్వాత చర్చలు జరిపి.. ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తామన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాంటే విపక్షాలన్నీ ఏకమవ్వాలని, మాయావతి వంటి వారు ఒంటరిగా పోటీ చేయాలనుకుంటే చేస్తారని, దానికి తానేమీ చేయగలను అంటూ ప్రశ్నించారు. అందరి నిర్ణయాలను తాను గౌరవిస్తానని అన్నారు. పెగాసస్ కలకలంపై దీదీ స్పందిస్తూ.. దేశంలో పరిస్థితులు అత్యయిక స్థితి నాటి కంటే దారుణంగా ఉన్నాయన్నారు. తన ఫోన్ కూడా హ్యాక్ అయిందని చెప్పారు. తాను మోడీ నుంచి హిందీ, అమిత్ షా నుంచి గుజరాతీ నేర్చుకున్నట్లు ఒక ప్రశ్నకు సరదాగా జవాబు చెప్పారు.
మమతను కలిసిన కేజ్రీవాల్
మమతా బెనర్జీతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బుధవారం భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాలపై చర్చించారు. దిల్లీలో తఅణమూల్ ఎంప,ి మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నివాసంలో ఈ సమావేశం జరిగింది. మరోవైపు- ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌తో తాను ఫోన్‌లో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. త్రిపురలో సర్వే నిర్వహించేందుకు వెళ్లిన టిఎంసి ప్రతినిధులు, ఐ-ప్యాక్ సభ్యులను పోలీసులు నిర్బంధించడంపై ఆమె స్పందించారు. ఎంపిలు డెరెక్ ఓబ్రెయిన్, కాకోలీ ఘోష్ దస్తీదార్‌లను ఆ రాష్ట్రానికి గురువారం పంపించనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు