నీలోనే ఆ శక్తి! ఇస్లాం సందేశం అల్లాహ్ ఏ వ్యక్తిపై అతని శక్తికి మించిన భారాన్ని మోపరు అన్నది దివ్య ఖురాన్ సందేశం. మనపై వచ్చిపడే ఆపదలైనా, లభించిన పదవీ బాధ్యతలైనా మన శక్తియుక్తులకు అనుగుణంగానే వస్తాయని గ్రహించాలి. మనకొచ్చే ఆపదను తట్టుకునే శక్తి అల్లాహ్ ఇచ్చారని తెలుసుకోవాలి. కార్యసాధనలో ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించాలని అల్లాహ్‌ను వేడుకోవాలి. * దైవ ప్రవక్తల జీవిత చరిత్రలు చూస్తే వారందరిలో నిండైన ఆత్మవిశ్వాసం, అల్లాహ్‌పై అపార నమ్మకం కనిపిస్తాయి. * ప్రవక్త యూసుఫ్ (అలైహిస్సలామ్)ను చేయని నేరానికి చెరసాలలో బంధించారు. ఆయన కలల జోస్యం చెబుతారని తెలుసుకున్న రాజు తనకు వచ్చిన ‘ఏడు విరగపండిన మొక్కజొన్న పొత్తులు, మరో ఏడు ఎండిన పొత్తుల’ స్వప్నం గురించి చెప్పాడు. ‘రాజ్యంలో ఏడేళ్లు పుష్కలంగా పంటలు పండుతాయి. వాటిని నిల్వ చేసుకోవాలి. మరో ఏడేళ్లు కరువు’ అని కలకు జోస్యం చెప్పారు యూసుఫ్ (అలై). రాజుకి ఆ మాటలు నచ్చాయి. ఆయన విడుదలయ్యారు. యూసుఫ్ (అలై) వినతి మేరకు రాజు ఆయనకి ధాన్యాగారాల నియంత్రణ బాధ్యత అప్పగించారు. కరువు నుంచి దేశాన్ని రక్షించే విధిని నిర్వహించటానికి అల్లాహ్ తనని ఎంచుకున్నారని యూసుఫ్ (అలై)కి తెలుసు. అల్లాహ్ తనకు బాధ్యత ఇచ్చినందువల్ల, దాన్ని నెరవేర్చగల శక్తి కూడా ఇచ్చారని గ్రహించారు. ఇలాగే అల్లాహ్ మనకు ఎలాంటి సామర్థ్యాలు ఇచ్చారు? మన బాధ్యతలను నెరవేర్చటానికి మన ప్రతిభను ఎంత వరకు ఉపయోగిస్తున్నాం? అన్నది అందరూ ఆలోచించాలి. * ప్రవక్త మూసా (అలై) ఫిరౌన్ చక్రవర్తికి శాంతి సందేశం అందించటానికి వెళ్లేముందు, ‘ప్రభూ! నా హృదయాన్ని తెరువు. నా కార్యాన్ని సులభతరం చెయ్యి. ప్రజలు నా మాటలు అర్థం చేసుకోగలగటానికి, నా నాలుక ముడిని విప్పు’ అని అల్లాహ్‌ను వేడుకున్నారు. * జీవితంలో ఎలాంటి విపత్తులు, ప్రమాదాలు విరుచుకుపడినా నిరాశ చెందకూడదన్నది ఖురాన్ ఉద్బోధ. ‘విచారపడకు, అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు’ (దివ్య ఖురాన్ 9:41) అన్న వాక్యం మనలో ఆత్మవిశ్వాసాన్ని నూరిపోస్తుంది. - ఖైరున్నీసాబేగం Tags :