ప్రధానాంశాలు కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాల పెంపు కొత్త పీఆర్‌సీ ప్రకారం మూలవేతనం ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు కొత్త పీఆర్‌సీ ప్రకారం మూల వేతనం (బేసిక్ పే) ఇవ్వాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెగ్యులర్ లెక్చరర్లు పొందుతున్న మూలవేతనాన్ని వీరు పొందుతారు. తొమ్మిది, పది పీఆర్‌సీల ప్రకారం మూలవేతనాన్ని మినిమం టైం స్కేల్‌గా పొందుతున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 3600 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు గతంలో నెలకు రూ.37,100 వేతనం పొందుతుండగా తాజా ఉత్తర్వుల మేరకు ఇది రూ.54,220కు పెరిగింది. డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న సుమారు 850 మంది గతంలో నెలకు రూ.40,270 వేతనం పొందుతుండగా రూ.58,850కి పెరిగింది. పాలిటెక్నిక్ కాలేజీల్లోని 450 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనం రూ.40,270 నుంచి రూ.58,850కు పెరిగింది. గౌరవ వేతనం 30 శాతం పెంపు ఉన్నత విద్యాశాఖ పరిధిలోని కళాశాలల్లో గంటల ప్రకారం విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచుతూ రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పార్ట్‌టైం జూనియర్ లెక్చరర్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న లెక్చరర్లకు ఇచ్చే గౌరవ వేతనంలో 30 శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. Tags :