Updated : 27/06/2021 14:58 IST Bike on rent: అద్దె బైకులు ఎక్కడబ్బా..? కొవిడ్‌తో కోలుకోలేని దెబ్బ నష్టాలతో వాహనాలను అమ్మేసిన అంకుర సంస్థలు ఈనాడు, హైదరాబాద్: నగరంలో అద్దె బైకుల వినియోగం పెరుగుతున్న దశలో కొవిడ్‌తో చెల్లాచెదురైంది. ఇప్పటికీ చాలా వాహనాలు పార్కింగ్ కేంద్రాల్లో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ దుమ్ముపట్టి ఉన్నాయి. కొన్ని బైకులు మాయం కాగా.. ఇంకొన్నింటిని బ్రాండ్ పేరు తొలగించి సంస్థలే చాటుమాటుగా అమ్మేశాయి.రెండు మూడేళ్ల క్రితమే బైక్ షేరింగ్ సేవలు హైదరాబాదీలకు పలు సంస్థలు పరిచయం చేశాయి. ఆదరణ పొందతున్న దశలో కొవిడ్ మహమ్మారితో ఒక్కసారిగా వీటిపై దెబ్బపడింది. హైదరాబాద్‌లో ప్రజారవాణా సదుపాయం ఉన్నా ప్రధాన రహదారుల వరకే వీటి సేవలు పరిమితం. మెట్రో, బస్సులు, ఎంఎంటీఎస్, రైల్వేస్టేషన్ల అనుసంధానం కూడా అంతంతమాత్రమే. హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్‌లో దిగిన తర్వాత ఐటీ కార్యాలయానికి వెళ్లాలంటే సరిపడా బస్సులు ఉండవు. బస్సులున్నా అన్ని ప్రాంతాలకు వెళ్లలేవు. ఇలాంటి చోట ఐటీ ఉద్యోగులు ఎంఎంటీఎస్ దిగగానే అక్కడ ఉన్న అద్దె బైకును తీసుకుని కార్యాలయానికి వెళ్లేవారు. కార్యాలయం నుంచి బయటకొచ్చే మరో ఉద్యోగి అదే బైకును తీసుకుని మెట్రోస్టేషన్‌కు చేరుకునేవారు. ఇలా ఒకటే బైకు రోజు సగటున 9 నుంచి 10 మంది వినియోగించేవారు. యాప్ ద్వారానే బుక్ చేసుకుని సొంతంగా నడుపుకొంటూ తమ గమ్యస్థానం రాగానే అక్కడ రహదారి పక్కన పార్కు చేసి వెళ్లేవారు. సొంత వాహనమైతే ఒక్కరే వినియోగిస్తారు. పార్కింగ్‌కు ఇబ్బంది పడుతున్న దశలో 8 గంటలపాటు ఒకేచోట పార్కింగ్ చేస్తుండటంతో ఇతర వాహనాలకు చోటు దొరకడం లేదు. ఇలాంటి ఎన్నో సమస్యలకు బైక్ షేరింగ్ మొబిలిటీ ఒక పరిష్కారంగా కన్పించింది. ప్రయాణించిన దూరాన్నిబట్టి ఛార్జీ ఉండేది. కొన్ని సంస్థలైతే గంట, రోజువారీ, వారం, నెలరోజులకు అద్దెకి ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చాయి. ఎక్కువగా స్కూటర్లు అందుబాటులో ఉండేది. కొన్ని విద్యుత్తు ద్విచక్రవాహనాలను బైక్ షేరింగ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చాయి. పలు సంస్థలు సైకిళ్లను సైతం తీసుకొచ్చాయి. వీటిని ఎక్కడ పడితే అక్కడ వదిలేయడానికి వీల్లేదు. మీరు వెళ్లే ప్రదేశానికి సమీపంలోని నిర్దిష్ట సైకిల్‌స్టేషన్‌లో పార్కు చేసి వెళ్లాలి. యువతరం, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా వీటి సేవలు ఉపయోగించేవారు. కార్లు సైతం ఉండేవి. మెట్రోస్టేషన్లు, ఐటీ కారిడార్‌లోని వివిధ కార్యాలయాల వద్ద ఇవి అందుబాటులోకి ఉండేది. గత ఏడాది లాక్‌డౌన్‌తో బైకులన్నీ చెల్లాచెదురయ్యాయి. మెట్రో సైతం 6 నెలలకుపైగా మూతపడటం, ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తుండం, కొవిడ్ భయాలతో షేరింగ్ బైకులపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఏడాదిన్నర కావొస్తున్న ఇప్పటికీ ఈ రంగం ఇంకా కొలుకోలేదు అనడానికి పార్కింగ్ స్థలాల్లో వందలాదిగా నిలిపి ఉన్న స్కూటర్లే నిదర్శనం. మున్ముందు విద్యుత్తు బైకులు... బైక్ షేరింగ్ వ్యాపారంలో అంకుర సంస్థలు పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించాయి. విస్తరణపై చాలా ఆశలు పెట్టుకున్నాయి. భారీఎత్తున పెట్రోలు, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసి అందుబాటులోకి తెచ్చాయి. బౌన్స్, వోగ్, డ్రైవ్ ఈజీ, మొబైసీ, రాపీడో, ఎస్ రైడ్, క్విక్‌రైడ్ జూమ్‌కార్, స్మార్ట్‌బైక్స్‌తోపాటు మరిన్ని సంస్థలు సైకిళ్లు, బైకులు, కార్లను షేరింగ్ విధానంలో అద్దెకు ఇచ్చేవి. స్కూటర్లే 3 వేల వరకు అందుబాటులో ఉండేవి. బెంగళూరులో 22 వేల తర్వాత ఎక్కువ అద్దె బైకులు అందుబాటులోకి తీసుకొచ్చిన నగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు ఉండేది. బౌన్స్ బైకులనే తీసుకుంటే అన్ని నగరాల్లో కలిపి నిత్యం 1.20 లక్షల మంది వాడేవారు. ఇదంతా కొవిడ్‌కు ముందు. ఇప్పుడీ సంఖ్య వేలకు పడిపోయంది. హైదరాబాద్‌లో వంద వాహనాలు కూడా అందుబాటులో లేవు. ఉన్నా వాడుతున్నవారు తక్కువే. కొన్ని సంస్థలు ఇప్పటికే వాహనాలను విక్రయించి నష్టాలను తగ్గించుకున్నాయి. మరికొన్ని సంస్థలు కొవిడ్ ప్రభావం తగ్గగానే తిరిగి సేవలను పునఃప్రారంభించాలని చూస్తున్నాయి. పెట్రోలు ధరలు పెరిగిన నేపథ్యంలో విద్యుత్తు వాహనాలు రాబోతున్నాయి. తిరిగి అందుబాటులోకి వస్తే లాస్ట్‌మైల్ కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. ప్రజారవాణాలో ప్రయాణించేవారు పెరుగుతారు. ఇవీ చదవండి