Updated : 28/06/2021 06:09 IST ప్రాణం వీడిన స్నేహితులు అలల ఉద్ధృతికి ఇద్దరు బలి మరో ఇరువురు విద్యార్థులు సురక్షితం కొత్తపట్నం, న్యూస్‌టుడే: ఆరు నుంచి పది తరగతుల వరకు కలిసి చదువుకున్నారు. చదువులమ్మ ఒడిలో స్నేహితులుగా మారారు. ఉన్నత విద్యకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లినా.. ఒకరి యోగక్షేమాలను మరొకరు నిత్యం తెలుసుకుంటూ.. సెలవుల్లో కలుసుకుంటూ మిత్రులుగానే కొనసాగుతున్నారు. అలాంటి వారి స్నేహాన్ని సముద్రుడు బలి తీసుకున్నాడు. సముద్రస్నానానికి వెళ్లిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అలల ఉద్ధృతికి విగత జీవులుగా మారారు. ఈ విషాద సంఘటన కొత్తపట్నంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‘సెలవంటూ’.. లోకానికి... ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం గ్రామానికి చెందిన శనగపల్లి శ్రీనివాస్(21), ఒంగోలు నగరంలోని గోపాలనగరం మూడో లైన్‌కు చెందిన ఈర్ల సుజిత్(21), సోనియా గాంధీ నగర్‌కు చెందిన షేక్ ఆరీజ్, పేర్నమిట్టకు చెందిన ఆకుల అనుదీప్ స్నేహితులు. వీరు నలుగురూ ఒంగోలులోని శివానీ పబ్లిక్ పాఠశాలలో 6 నుంచి పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఇతర ప్రాంతాల్లో ఇంటర్, ఇంజినీరింగ్ చదువుతున్నా.. మంచి స్నేహితులుగా మెలుగుతున్నారు. కొవిడ్ రెండో దశ నేపథ్యంలో ప్రస్తుతం కళాశాలలు లేవు. దీంతో అందరూ ఇళ్లకు చేరుకున్నారు. ఆన్‌లైన్ తరగతులకు ఆదివారం సెలవు కావడంతో కొత్తపట్నం సముద్ర స్నానానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ద్విచక్ర వాహనాలపై నలుగురు కలిసి ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో కొత్తపట్నం తీరానికి వెళ్లారు. ఈర్ల సుజిత్, శనగపల్లి శ్రీనివాస్ స్నానానికి సముద్రంలోకి దిగారు. కొద్దిసేపటి తర్వాత అలల ఉద్ధృతికి నీట మునిగారు. ఒడ్డున కూర్చున్న మిగతా ఇద్దరు స్నేహితులు ఈ విషయాన్ని గమనించి ఆందోళనకు గురయ్యారు. సహాయం నిమిత్తం స్థానికులను పిలిచే లోపే.. ఇద్దరు విద్యార్థులు విగతజీవులుగా ఒడ్డుకు కొట్టుకొచ్చారు. సుజిత్ గుంటూరులోని ఆర్‌వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో; ఎస్.శ్రీనివాస్ కాకినాడలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నారు. సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు సముద్ర తీరానికి చేరుకున్నారు. కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్న పిల్లలను కోల్పోయామంటూ గుండెలవిసేలా రోదించారు. శ్రీనివాస్ తండ్రి శేషగిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న కొత్తపట్నం ఎస్సై రామకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను విచారించారు. విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. Tags :