24 గంటలూ పిల్లలకు వైద్య సేవలు 150 మంది పీడియాట్రీషన్లతో టెలీ సేవలు కరోనా మూడో దశపై ముందస్తు ఏర్పాట్లు కర్ఫ్యూ వేళలను సడలిస్తూ సీఎం నిర్ణయం 8 జిల్లాల్లో రాత్రి 9 గంటల వరకు... 4 జిల్లాల్లో యథాతథంగా సాయంత్రం 6 గంటల వరకే తూర్పుగోదావరిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పొడిగింపు జులై 1 నుంచి 7 వరకు అమలు ఈనాడు, అమరావతి: ‘కరోనా మూడో దశ సమాచారం నేపథ్యంలో రాష్ట్రంలో పిల్లల చికిత్సకు అవసరమైన వసతులు మెరుగుపరచాలి. రోజంతా (24 గంటలూ) పీడియాట్రిక్ సేవలు అందుబాటులో ఉండాలి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని’ సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, మూడో దశకు సంబంధించిన జాగ్రత్తలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కర్ఫ్యూ వేళలను 8 జిల్లాల్లో సడలించాలని, 4 జిల్లాల్లో యథాతథంగా కొనసాగించాలని, ఒక జిల్లాలో పొడిగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రస్తుతం సాయంత్రం ఆరు గంటల వరకే ఉన్న కర్ఫ్యూ వేళలను రాత్రి 9 గంటల వరకూ సడలించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్న పశ్చిమగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నట్లుగానే సాయంత్రం 6 గంటల వరకే సడలింపు ఉంటుంది. ఆయా జిల్లాల్లో ఎటువంటి మార్పు లేదు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం మధ్యాహ్నం 2గంటల వరకూ ఉన్న సమయాన్ని సాయంత్రం ఆరు గంటల వరకూ పొడిగించారు. జులై 1 నుంచి 7వ తేదీ వరకు ఈ నిర్ణయాలు అమలులో ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. అధికారులు ఏం చెప్పారంటే... * ప్రస్తుతం 44,773 క్రియాశీల కరోనా కేసులున్నాయి. ఇందులో 7,998 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 96.95 శాతంగా, పాజిటివిటీ రేటు 4.46శాతంగా ఉంది. * 3,329 బ్లాక్ ఫంగస్ కేసులున్నాయి. 1,441 మంది చికిత్స పొందుతున్నారు. 253 మంది చనిపోయారు. * మూడోదశ దృష్ట్యా ఇప్పటికే మూడు దఫాలుగా నిపుణులతో వెబినార్ నిర్వహించాం. (కొత్తగా తీసుకునే వైద్యులకు కూడా ఈ వెబినార్ అంశాలపై అవగాహన కల్పించాలని సీఎం సూచన.) * కొవిడ్ బాధితులకు మానసిక నిపుణులతో సలహాలు అందిస్తున్నాం. 190 మంది సైకియాట్రిస్టులు, 16 మంది క్లినికల్ సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని)తో పాటు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, ఉన్నతాధికారులు కె.ఎస్.జవహర్‌రెడ్డి, అనిల్ కుమార్ సింఘాల్, ఎం.టి.కృష్ణబాబు, ఎం.రవిచంద్ర, కాటమనేని భాస్కర్, ఎ.బాబు, ఎ.మల్లికార్జున్, వి.విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు. సీఎం ఏమన్నారంటే... * 104 ద్వారా పిల్లలకు చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ఇందుకోసం 150 మంది పీడియాట్రీషన్లతో టెలీ సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. వారందరికీ శిక్షణ ఇప్పించాలి. ఎయిమ్స్ లాంటి అత్యుత్తమ సంస్థల నిపుణుల సేవలను వినియోగించుకోవాలి. జిల్లాల్లో సంబంధిత జేసీలను కూడా 104 సేవల్లో భాగస్వాములను చేయాలి. * అడ్మిషన్లు అవసరమైతే తక్షణమే స్పందించి పడకలు ఇచ్చేలా చూడాలి. ఇందుకనుగుణంగా వ్యవస్థను బలోపేతం చేయాలి. సీజనల్ వ్యాధులకూ 104 ద్వారా సేవలు అందించాలి. విలేజి క్లినిక్కులు, పీహెచ్‌సీలతో పాటు 104 కూడా ఆరోగ్యశ్రీకి రిఫరెల్ పాయింటులా ఉండాలి. * రాష్ట్రంలో మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి ఇద్దరు వైద్యులను నియమించాం. వారు నెలకు రెండు సార్లు గ్రామాల్లో పర్యటించాలి. Tags :