అందరికీ ఆన్‌లైన్ పాఠాలే జులై 1 నుంచి ప్రారంభం జులైలోనే డిగ్రీ, పీజీ చివరి సంవత్సర పరీక్షలు అందరికీ ఆన్‌లైన్ పాఠాలే ఈనాడు, హైదరాబాద్: కరోనా కారణంగా పాఠశాలలను, కళాశాలలను ప్రారంభించే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఒకటో తరగతి నుంచి పీజీ వరకు డిజిటల్, ఆన్‌లైన్ విద్యా బోధనను జులై 1 నుంచి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటి, రెండు తరగతుల పిల్లలకు మాత్రం ఆగస్టు 1 నుంచి డిజిటల్ పాఠాలు మొదలవుతాయి. విద్యాశాఖ అధికారులతో సోమవారం సమీక్షించిన విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యార్థులు టెలివిజన్, స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఈ పాఠాలను వీక్షిస్తారని, ఎవరి ఇళ్లల్లోనైనా టీవీలు లేకుంటే పంచాయతీ కార్యాలయాలు, గ్రంథాలయాల్లోని టీవీలను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించనున్నట్లు మంత్రి తెలిపారు. డిజిటల్, ఆన్‌లైన్ తరగతుల వల్ల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందన్నారు. వారికి అవసరమైన పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు చేరవేసే ప్రక్రియ 90 శాతం పూర్తయిందని తెలిపారు. ఆన్‌లైన్ తరగతులకు సంబంధించి ప్రైవేట్ విద్యాసంస్థలు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు. టీశాట్ యాప్, దూరదర్శన్ యూట్యూబ్‌లలో... ఏదైనా కారణం వల్ల దూరదర్శన్, టీశాట్(మన టీవీ) పాఠాలను వీక్షించలేకపోయిన వారి కోసం వాటిని ప్రత్యేకంగా దూరదర్శన్ యాట్యూబ్, టీశాట్ యాప్‌లోనూ అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. డిజిటల్ తరగతులు, కృత్య పత్రాల(వర్క్ షీట్లు)ను ఎస్‌సీఈఆర్‌టీ (swww.scert.telangana.gov.in) వెబ్‌సైట్లో పొందవచ్చని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అనుసంధానంగా 75వేల వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేశామన్నారు. పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు బోధన సిబ్బంది రోజూ 50 శాతం మంది విధులకు హాజరైతే చాలని మంత్రి పేర్కొన్నారు. * డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా చివరి సంవత్సర పరీక్షలను జులైలో నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. తదనుగుణంగా విశ్వవిద్యాలయాలు కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు లింబాద్రి, వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన పాల్గొన్నారు. Tags :