పోడు భూముల సమస్య.. తీరేదెన్నడు? ఏరువాక ప్రారంభం కాగానే అటవీశాఖ చర్యలు భూముల్లోకి వెళ్లకుండా కందకాలతో కట్టడి ప్రభుత్వం వైపు గిరిజనుల చూపు ఈనాడు, హైదరాబాద్: దున్నేవాడిదే భూమి అని గిరిజనులు.. హక్కులు లేనిదే అడుగు పెట్టనీయమని అటవీశాఖ.. పోడు భూముల్లో అర్హులైన రైతులకు పట్టాలిస్తామని ప్రభుత్వం.. ఇలా అటవీ ప్రాంతాల్లోని భూములకు హక్కుల చిక్కులు తేలకుండా ఏళ్ల తరబడి సమస్య కొనసాగుతోంది. పలు జిల్లాల్లో గిరిజనులకు, అటవీశాఖ అధికారులకు మధ్య ఏటా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. 2006లో నాటి ప్రభుత్వం కొంత మేర పోడు భూములకు అటవీ హక్కుల చట్టం(ఆర్‌ఓఎఫ్‌ఆర్) కింద పట్టాలు జారీ చేసింది. ఇప్పటి వరకు హక్కుల కల్పన అమలు కాలేదు. సీఎం కేసీఆర్ పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించడంతో గిరిజనుల్లో ఆశలు చిగురించాయి. అటవీ ప్రాంతాలు హద్దులుగా ఉన్న గ్రామాల్లో సాగు మొదలైతే చాలు.. ఘర్షణలు ప్రారంభమవుతున్నాయి. సాగు పనులకు భూముల్లోకి వస్తున్న గిరిజనులను అధికారులు అడ్డుకుంటున్నారు. రక్షిత అటవీ ప్రాంతం చుట్టూ కందకాలు తవ్వుతున్నారు. దీన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇటీవల ఈ వివాదాలు ముదిరాయి. బూర్గంపాడు మండలం ఉప్పుసాకలో ఘర్షణ చోటుచేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొందరిని అరెస్టు చేశారు. భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని 30 మండలాల్లో (ములుగు, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో కలిసిన మండలాలు కలుపుకొని) అటవీ హక్కుల చట్టం-2006 కింద 1,04,058.73 ఎకరాల అటవీ భూములకు పట్టాలు ఇచ్చారు. సరిహద్దుల సర్వేకు ఏళ్లు... 2017 భూ దస్త్రాల ప్రక్షాళన సందర్భంగా రాష్ట్రంలో 2.18 లక్షల ఎకరాల హద్దుల్లో స్పష్టత లేదని గుర్తించారు. అటవీ-రెవెన్యూ శాఖలకు సంబంధించి ఎవరికి ఏ మేరకు భూమి ఉందనేది సర్వే చేసి తేల్చాల్సి ఉంది. దీనికోసం రెవెన్యూ, అటవీశాఖ, సర్వే- భూమి కొలతల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొంత మేర సర్వే చేశారు. పలు జిల్లాల్లో కొందరు ఇష్టానుసారం అడవులను నరికివేశారని అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి ప్రాంతాల్లోనే హరితహారం కింద చెట్లు నాటేందుకు ప్రయత్నిస్తుంటే సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. అటవీ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.. ఎఫ్‌సీ చట్టం-1980, సవరణ చట్టం- 1987 ప్రకారం అటవీ ప్రాంతాల్లో పరిమితులకు లోబడి సాగు చేసుకోవాలి. అటవీ హక్కుల చట్టం- 2/2007 కింద గిరిజనుడికి గరిష్ఠంగా పది ఎకరాల వరకు అనుమతి లభిస్తుంది. * రాష్ట్రంలో అటవీ భూముల విస్తీర్ణం: 26.96 లక్షల చదరపు కిలోమీటర్లు * ఆక్రమణకు గురైనట్లు భావిస్తున్న విస్తీర్ణం: 3 లక్షల హెక్టార్లు హక్కు పత్రాలు ఇచ్చిన భూమిపైనా ఒత్తిడి మా ఊర్లో 200 ఎకరాలకుపైగా పోడు భూమి ఉంది. 1995కు ముందు నుంచే సాగులో ఉన్నాం. 2006లో 40 ఎకరాలకు సంబంధించి కొందరికి ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం కింద హక్కు పత్రాలు ఇచ్చింది. మిగిలిన వారికి ఇస్తామని ఇవ్వలేదు. హక్కు పత్రాలు ఇచ్చిన భూమినీ అధికారులు రెండేళ్ల క్రితం తీసుకోవాలని ప్రయత్నించారు. ఇలా చేస్తే మేం ఎలా బతకాలి. - కొర్నెబెల్లి శేషగిరి, కామారం, తాడ్వాయి మండలం Tags : ప్రధానాంశాలు