మరియమ్మ మృతదేహానికి రీ పోస్టుమార్టం చింతకాని, న్యూస్‌టుడే: లాకప్‌డెత్‌కు గురైన అంబడిపూడి మరియమ్మ మృతదేహానికి ఆలేరు న్యాయమూర్తి సమక్షంలో శుక్రవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆలేరు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ మణికంఠ పర్యవేక్షణలో వరంగల్ కాకతీయ వైద్య కళాశాలకు చెందిన సీనియర్ వైద్య బృందం, వరంగల్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం రీ పోస్టుమార్టంలో పాల్గొన్నారు. గ్రామ సమీపంలో పూడ్చిపెట్టిన మరియమ్మ మృతదేహాన్ని వెలికితీసి రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్‌ను న్యాయమూర్తి పరామర్శించారు. పోలీసులు మరియమ్మను అదుపులోకి తీసుకున్న తీరు, అనంతర సంఘటనలపై ఉదయ్‌కిరణ్‌తోపాటు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. న్యాయమూర్తితో విచారణ జరిపించాలి.. ఈనాడు, హైదరాబాద్: మరియమ్మ లాకప్‌డెత్ సంఘటనపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) జాతీయ కన్వీనర్ వి.సంధ్య డిమాండ్ చేశారు. శుక్రవారమిక్కడ మహిళా సంఘాల నాయకులు జి.అనురాధ, ఎం.సరళ, బి.విజయ, సీహెచ్ భారతితో కలిసి రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ జి.సునీల్ కుమార్‌బాబును కలిసి సంధ్య వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. లాకప్‌డెత్ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. Tags :