బొమ్మల కొలువులు తయారీ పరిశ్రమల కోసం ప్రత్యేక విధానం నిర్మల్, బొంతపల్లిలలో సమూహాలు రాష్ట్ర ప్రభుత్వ సన్నాహాలు తెలంగాణలో వివిధ రంగాలకు ఉన్నట్లే బొమ్మల తయారీ పరిశ్రమకు ప్రత్యేక విధానాన్ని అమలు చేసి నిరుద్యోగ యువత, మహిళలకు పెద్దఎత్తున ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.టెడ్డీబేర్, వివిధ జంతువులు, వస్తువుల ఆకారాలతో కూడిన తేలిక రకం (సాఫ్ట్)బొమ్మలకు పత్తి అవసరం. రాష్ట్రం నాణ్యమైన పత్తిసాగులో అగ్రస్థానంలో ఉంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని పెద్దఎత్తున బొమ్మల తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఈ మేరకు త్వరలో 100 ఎకరాల్లో బొమ్మల తయారీ పార్కును ఏర్పాటు చేయనుంది. ఈ రంగంలో దాదాపు రూ.2 వేల కోట్ల వార్షిక మార్కెట్‌ను సృష్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయాలను వెల్లడించనుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొత్త పారిశ్రామిక విధానం(టీఎస్‌ఐపాస్) చేపట్టగా... ఇందులో పలు సంస్థలు బొమ్మల తయారీకి ముందుకొచ్చాయి. యూనివర్సల్, బట్టర్‌ఫ్లై పరిశ్రమలు ప్రారంభమై ఇప్పటికే ఉత్పత్తులు చేపట్టగా.. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించిన తర్వాత పరిశ్రమల స్థాపనకు టీఎస్‌ఐపాస్‌కు 120కిపైగా సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగం ప్రాధాన్యం గుర్తించి పరిశ్రమల శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, నోడల్ అధికారిని నియమించింది. ఈ విభాగం రాష్ట్రవ్యాప్తంగా బొమ్మల తయారీ అవకాశాలపై సర్వే నిర్వహించింది. నిర్మల్‌లో చిత్రాలతోపాటు చెక్కబొమ్మలు తయారవుతుండగా.. అక్కడ బొమ్మల తయారీని ముమ్మరం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏటికొప్పాక చెక్కబొమ్మల తయారీలో సంగారెడ్డి జిల్లా బొంతపల్లి కళాకారులు పాల్గొనేవారు. రాష్ట్ర విభజన అనంతరం వారు సొంతంగా బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్, బొంతపల్లిలో సమూహాలను ప్రారంభించాలని కసరత్తు చేస్తున్నారు. ఉపాధికి బోలెడు అవకాశాలు ఎలక్ట్రానిక్స్, స్టెమ్ మినహా ఇతర బొమ్మలు చేతులతో తయారుచేసేవే. ఈ నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు, నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. సూక్ష్మ, చిన్న పరిశ్రమల కేటగిరి కింద రాయితీలు, ప్రోత్సాహకాలిస్తుంది. అధునాతన సాంకేతిక నైపుణ్యంతో పాటు పిల్లలను ఆకర్షించే నమూనాలో తయారీ చేయించి, వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని భావిస్తోంది. ప్రస్తుతం గోల్కొండ హస్తకళల దుకాణాలున్నాయి. వాటిలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. బొమ్మల తయారీకి ప్రత్యేకంగా 100 ఎకరాల్లో పార్కును ప్రారంభిస్తారు. అక్కడ షెడ్లు నిర్మించి, తయారీదారులకు కేటాయిస్తారు. ప్రత్యేక మ్యూజియాన్ని ఏర్పాటు చేసి ప్రదర్శనలను కొనసాగిస్తారు. పాఠశాలల్లో విద్యార్థులకు సైతం గంట సేపు బొమ్మల తయారీపై శిక్షణ ఇస్తే ఏలా ఉంటుంది? అనే అంశాన్ని సైతం ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఉజ్వల భవిష్యత్తు - నోడల్ అధికారి శ్రీహారెడ్డి బొమ్మల తయారీ పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. రాష్ట్రంలో పత్తి, ఇతర ముడిసరకుల లభ్యత ఉన్నందున ఈ పరిశ్రమ అభివృద్ధికి మెరుగైన అవకాశాలున్నాయి. ప్రభుత్వం పలు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. పిల్లల అభిరుచులు, విజ్ఞాన, విద్యాభివృద్దికి అనుగుణంగా బొమ్మల తయారీని ప్రోత్సహిస్తాం. మంత్రి కేటీఆర్ సూచనలకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధమవుతోంది. - ఈనాడు, హైదరాబాద్ Tags :