TS News: కొత్త రేషన్ కార్డుకు ఆగాల్సిందే! కొలిక్కి రాని క్షేత్రస్థాయి పరిశీలన ఈనాడు, హైదరాబాద్: కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి మరింత సమయం పట్టనుంది. క్షేత్రస్థాయిలో సగం దరఖాస్తుల పరిశీలన కూడా కాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సోమవారం నుంచి కార్డులు జారీ చేయాలని తొలుత అధికారులు భావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని రోజులు ఆగాల్సిందే. కార్డుల కోసం 4,15,901 దరఖాస్తులు అధికారుల వద్ద ఉన్నాయి. క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించిన మీదట అర్హులకు కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ దీనిపై సమీక్షించారు. 15 రోజుల వ్యవధిలో ఆ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఆయా వ్యవహారాలను పరిశీలించేందుకు పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు. దరఖాస్తులను పరిశీలించేందుకు పౌరసరఫరాలు, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు నియమించారు. దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేసేందుకు కనీసం 15 నుంచి 20 రోజుల సమయం పడుతుందని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. Tags :