ప్రధానాంశాలు ఏపీతోనే కాదు.. దేవుడితోనైనా కొట్లాడతాం కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదు నారాయణపేట సభలో మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్, ఈనాడు డిజిటల్: కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ఏపీతోనే కాదు.. అవసరమైతే దేవుడితోనైనా కొట్లాడతామని, చట్టప్రకారం రావాల్సిన వాటాను సాధించుకుంటామని చెప్పారు. పాలమూరు ప్రాంతంలోని ప్రతి నియోజకవర్గానికి సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని వెల్లడించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో శనివారం పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన ‘పట్టణ ప్రగతి’ సభలో ఆయన మాట్లాడారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కర్వెన జలాశయం నుంచి నారాయణపేట జిల్లాకు లక్షా 8వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. త్వరలో కాలువ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామని, ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. ఈ పనులు పూర్తయితే రైతులు మూడు పంటలు పండించుకోవచ్చన్నారు. నారాయణపేటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటకలో మన దగ్గర ఉన్న ఏ ఒక్క పథకమైనా అమలవుతోందా అని ప్రశ్నించారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన పెద్దలే ఇక్కడ అనవసరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక ఆహార శుద్ధి జోన్‌లలో నారాయణపేటకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల తరవాత నారాయణపేటలో చేనేతకు ప్రత్యేక స్థానం కల్పిస్తామని తెలిపారు. పంచాయతీలకు నెలకు రూ.338 కోట్లు, పురపాలికలకు రూ.148 కోట్లు కేటాయించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. 15 నెలలుగా కరోనాతో రూ.లక్ష కోట్ల ఆదాయం కోల్పోయినా వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించామని, కేవలం రైతుబంధుకే రూ.7,360 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ తరవాత రాష్ట్రాన్ని సమర్థంగా నడిపే నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. కేటీఆర్ పర్యటనలో ఆందోళనలు మంత్రి కేటీఆర్ నారాయణపేట పర్యటనను ఆందోళనకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల ఐసీయూ వార్డు ప్రారంభించి తిరిగివెళ్తుండగా కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నారాయణపేటలో పీజీ కళాశాల మంజూరు చేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు నియంత్రించాలంటూ నినాదాలు చేశారు. వారిపై పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. ‘పట్టణ ప్రగతి’ సభలో కేటీఆర్ ప్రసంగిస్తుండగా జిల్లాలో పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని, సైనిక పాఠశాలను మంజూరు చేయాలని పీడీఎస్‌యూ నాయకులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఆస్పత్రి గేటు నుంచి మంత్రి కాన్వాయ్ బయటకు రాగానే కొందరు స్థానికులు అడ్డుగా వెళ్లి నినాదాలు చేశారు. Tags :