ఉద్యోగ ఖాళీలు 55 వేలకు పైనే! నివేదించిన ప్రభుత్వ శాఖలు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సమీక్ష ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు 55 వేలకుపైనే ఉన్నట్లు ప్రభుత్వ శాఖలు నివేదించాయి. పోలీసు, విద్య, వైద్య ఆరోగ్య, సంక్షేమం, రెవెన్యూ శాఖల్లో అధికంగా పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని పేర్కొన్నాయి. ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఖాళీల వివరాలు తెలుసుకునేందుకు ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ(ఎంసీహెచ్‌ఆర్డీ)లో జరిగిన ఈ సమావేశంలో పశుసంవర్ధక, పౌరసరఫరాలు, అటవీ, నీటిపారుదల, కార్మిక, హోం, న్యాయ, శాసనసభ, పురపాలక, పర్యాటక, సాంస్కృతిక, యువజన వ్యవహారాలు, ప్రభుత్వరంగ సంస్థలు, పరిశ్రమలు, ఐటీ, రెవెన్యూ, రవాణా, రోడ్లు భవనాలు, గృహ నిర్మాణం, సాధారణ పరిపాలన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, స్త్రీశిశు సంక్షేమం, విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు. ఖాళీల్లో జిల్లా, జోన్, బహుళజోన్ల వారీగా పోస్టుల వివరాలను ప్రభుత్వ శాఖలు అందజేశాయి. శాఖలు ఇచ్చిన నివేదికలను ఆర్థిక శాఖ సోమవారం క్రోడీకరించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు అందించనుంది. దీనిని ఆయన సీఎం కేసీఆర్‌కు సమర్పిస్తారు. సీఎం అనుమతితో మంత్రిమండలి ఆమోదానికి ఎజెండాలో చేర్చనున్నారు. వాస్తవానికి గత ఏప్రిల్‌లో ప్రభుత్వం అన్ని శాఖల నుంచి వివరాలు తీసుకోగా 53 వేల వరకు ఖాళీలు వచ్చాయి. ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచడంతో ఆ తర్వాత ఖాళీల సంఖ్యలో తేడా స్వల్పంగా పెరిగింది. స్వచ్ఛంద పదవీ విరమణలు, మరణాలు, రాజీనామాలు, కొత్తగా సృష్టించినవి కలిపి మరో 2 వేల వరకు మాత్రమే పోస్టులు కలిశాయి. మొత్తం ఖాళీల్లో 5 వేల వరకు ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు పనిచేస్తున్నవి ఉన్నాయి. కారుణ్య నియామకాలు విడిగా... ఆకస్మిక మరణాలు, అనారోగ్య కారణాలతో పదవీ విరమణ పొందిన వారి పోస్టులను ఖాళీల జాబితా నుంచి మినహాయించారు. వాటిని కారుణ్య నియామకాల కింద ఆయా ఉద్యోగుల వారసులతో భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. గత ఏప్రిల్‌లో ఖాళీల జాబితాలో ఈ పోస్టులున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ కేటగిరి పోస్టులను ఖాళీల నుంచి తొలగించారు. వారసులకు వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. ఒకదాని తర్వాత మరో నోటిఫికేషన్! నిరుద్యోగులకు వెసులుబాటు కల్పించేలా దశలవారీగా ఉద్యోగాల భర్తీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశలవారీగా ప్రభుత్వం భర్తీ చేయనుంది. నిరుద్యోగులకు వెసులుబాటు కల్పించేలా ఒకశాఖ తర్వాత మరో శాఖ నోటిఫికేషన్లను విడుదల చేయాలని భావిస్తోంది. తెలంగాణ పబ్లిక్‌సర్వీస్ కమిషన్, పోలీసు, గురుకుల విద్యాలయాలు, వైద్యనియామకాల సంస్థతో పాటు కొత్తగా ఏర్పాటు చేయనున్న నీటిపారుదల నియామక సంస్థకు భర్తీ అవకాశం ఇవ్వనుంది. కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ) ద్వారానూ నియామకాలు జరపనున్నట్లు తెలిసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు గ్రూపు-1, 2, 3 పోస్టుల భర్తీ అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. మొత్తంగా 50వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ఈ నెల 13న మంత్రిమండలి ఆమోదం తర్వాత నియామకాల ప్రకటనలు జారీ అవుతాయి. ఒకేసారి అన్ని ఉద్యోగాలకు ప్రకటనలిస్తే అందరూ అన్నింటికి పోటీపడే అవకాశం ఉండదనే భావనతో ఒక నోటిఫికేషన్ తర్వాత మరోటి ఇవ్వాలని యోచిస్తోంది. కేబినెట్ భేటీలో నియామకాల సరళిని ఖరారు చేసే అవకాశం ఉంది. Tags :