‘అపోలో హెల్త్‌కో’పై సాఫ్ట్‌బ్యాంక్ ఆసక్తి ? మైనార్టీ వాటా కొనుగోలు చేసే అవకాశం యాజమాన్యంతో సంప్రదింపులు ఈనాడు, హైదరాబాద్: అపోలో హాస్పిటల్స్ నుంచి విడదీసి ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేస్తున్న ఫార్మసీ వ్యాపారంలో వాటా కొనుగోలు చేయటానికి దిగ్గజ సంస్థలు ఆసక్తిగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఫార్మసీ వ్యాపార కార్యకలాపాలతో అపోలో హెల్త్‌కో లిమిటెడ్ అనే నూతన కంపెనీ ఏర్పాటు చేయాలని కొద్దికాలం క్రితం అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం నిర్ణయించిన విషయం విదితమే. అపోలో ఆసుపత్రులలో ఉన్న రిటైల్ ఫార్మసీ స్టోర్లను మినహాయించి, మిగిలిన అపోలో 24/7 స్టోర్లు, అపోలో ఫార్మసీ బ్రాండ్లు, ప్రైవేట్ లేబుల్ బ్రాండ్లను ఈ కొత్త కంపెనీ కిందకు తీసుకువస్తారు. అపోలో హాస్పిటల్స్ వార్షిక వ్యాపారంలో ఈ ఫార్మసీ కార్యకలాపాల వాటా 50 శాతానికి పైగా ఉంది. రూ.1,210 కోట్ల విలువకు, స్లంప్ సేల్ (ఆస్తిని విక్రయించటం) పద్ధతిలో ఫార్మసీ వ్యాపారాన్ని అపోలో హెల్త్‌కో లిమిటెడ్‌కు అపోలో హాస్పిటల్స్ బదిలీ చేసింది. ఈ పునర్‌వ్యవస్థీకరణ వల్ల ఆఫ్‌లైన్ (భౌతిక ఫార్మసీ స్టోర్లు) తో పాటు, ఆన్‌లైన్‌లో ఫార్మసీ వ్యాపార కార్యకలాపాలను పెద్దఎత్తున విస్తరించేందుకు వీలు కలుగుతుందని అపోలో యాజమాన్యం భావిస్తోంది. దీంతో పాటు అపోలో హెల్త్‌కో లిమిటెడ్ వ్యాపారాన్ని విస్తరించటానికి అవసరమైన మూలధనాన్ని, వ్యూహాత్మక పెట్టుబడిదార్లకు వాటా విక్రయించటం ద్వారా సమీకరించే వీలుంటుంది. దీనికి అనుగుణంగా పెట్టుబడిదార్లను గుర్తించే పనిని కూడా అపోలో యాజమాన్యం చేపట్టినట్లు, దీనికి వివిధ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తం అవుతున్నట్లు చెబుతున్నారు. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గత కొంతకాలంగా మనదేశంలో వైద్యసేవల మార్కెట్లో విస్తరించాలనే యత్నాల్లో నిమగ్నమైంది. ఇందులో భాగంగా అపోలో హెల్త్‌కో లిమిటెడ్‌లో వాటా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు, దీనిపై ఈ సంస్థ ప్రతినిధులతో అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం సంప్రదింపులు సాగిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వివరిస్తున్నాయి. అపోలో హెల్త్‌కో లిమిటెడ్‌లో మైనార్టీ వాటా (దాదాపు 25 శాతం వాటా) విక్రయించటానికి యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీనికోసం సాఫ్ట్‌బ్యాంక్‌తో సహా ఇతర ఇన్వెస్టర్లతో చర్చల ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అపోలో హెల్త్‌కో లిమిటెడ్ రూ.6,000 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్‌ను నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేగాక ఏటా 20 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. Tags :