ఇంటి దొంగ&#x

ఇంటి దొంగల పనిపడ్తాం


ప్రధానాంశాలు
ఇంటి దొంగల పనిపడ్తాం
 కాంగ్రెస్‌కు నష్టం చేసేవారు పార్టీని వదిలివెళ్లాలి
మోదీ పాలనలో 100 దాటిన పెట్రోలు ధర
నిర్మల్‌ ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌
 పెట్రో ధరల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
ఈటీవీ, ఆదిలాబాద్‌- న్యూస్‌టుడే, నిర్మల్‌, గాంధీభవన్‌, మెదక్‌ అర్బన్‌: కాంగ్రెస్‌లో ఇంటి దొంగల పని పడతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత తొలిసారిగా నిర్మల్‌కు వచ్చిన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం చేపట్టిన నిరసన ర్యాలీలో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డితో కలసి పాల్గొన్నారు. అక్కడి అంబేద్కర్‌ చౌరస్తాలో, అనంతరం విలేకరుల సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఆయన తెరాసపై విమర్శలు గుప్పిస్తూనే, సొంత పార్టీలో ద్వంద్వ ప్రమాణాలు పాటించే వారికి హెచ్చరికలు జారీ చేశారు. 2023లో తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాను జానారెడ్డి అంత సీనియర్‌ని కాదని.. ఆయనంత మంచివాడినీ కాదని వ్యాఖ్యానించారు. పార్టీలో ఇంటి దొంగలుంటే వదిలిపెట్టం... అలాగే కష్టపడి పనిచేసే వారిని వదులుకోబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు నష్టం చేసేవారు నెలరోజుల్లో పార్టీని వదిలిపోవాలని సూచించారు. లేకుంటే తరిమికొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ‘‘నా లక్కీ నంబరు తొమ్మిది.. నిర్మల్‌ నియోజకవర్గం నంబరు తొమ్మిది, కేసీఆర్‌ లక్కీ నంబరు ఆరు.. ఆరును తిరగేస్తే తొమ్మిది వస్తుంది.. అందుకే శుభసూచకంగా రాష్ట్రానికి తూర్పున ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి పోరాటాన్ని ప్రారంభించాం’’ అని రేవంత్‌ పేర్కొన్నారు. హుజురాబాద్‌కు పార్టీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ దామోదర రాజనర్సింహా ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. జీఎంఆర్‌ లాంటి పారిశ్రామిక సంస్థతో కుమ్మక్కై విమానాల ఇంధనానికి ఒక శాతం పన్ను విధించి.. ప్రజలకు నిత్యావసరమైన పెట్రోలుపై మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.65 పన్ను వసూలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ హయాంలో గ్యాస్‌ ధర రూ.410 ఉంటే.. భాజపా పాలనలో రూ.860 దాటిందని తెలిపారు. 65 ఏళ్ల కాంగ్రెస్‌ హయాంలో పెరిగిన ధరలు మోదీ, కేసీఆర్‌ల ఏడేళ్ల పాలనలో 120 శాతం ఎగబాకాయని విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో సామాన్యులకు ఒరిగిందేమీ లేదంటూ రెండు పడకల ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ ఉచిత విద్య, మైనార్టీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు వచ్చాయా? అని రేవంత్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు.
రాష్ట్రమంతా కాంగ్రెస్‌ ర్యాలీలు
ఏఐసీసీ పిలుపు మేరకు పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఎడ్ల బండ్లు, సైకిల్‌ ర్యాలీలు చేపట్టారు. పెరిగిన పెట్రో ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే తగ్గించాలని పార్టీ నేతలు డిమాండ్‌ చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టినా.. ఇంధన ధరలు పెరుగుతుండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పలుచోట్ల పోలీసులు ర్యాలీలను అడ్డుకొని నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు.
మెదక్‌లో అపశ్రుతి
మెదక్‌ ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకుంది. పీసీసీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహా పట్టణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం నుంచి చేపట్టిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. చేగుంట క్రాస్‌ రోడ్డు వద్ద దామోదర ప్రసంగిస్తుండగా.. ఎడ్లు అదుపు తప్పడంతో దామోదర కింద పడ్డారు. ఆయన కుడి మోకాలికి గాయం కావడంతో వైద్యులు కట్టుకట్టి చికిత్స చేశారు. ఖమ్మంలో జరిగిన ఎడ్ల బండి ర్యాలీలో కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత భట్టి విక్రమార్క మాట్లాడారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఖండించారు. పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌ రంగారెడ్డి జిల్లా కందుకూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షులు గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌ హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద ఎడ్ల బండి ర్యాలీ నిర్వహించ తలపెట్టగా పోలీసులు వారిని అడ్డుకుని చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునితారావును బేగంబజార్‌ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎడ్ల బండిని లాగి నిరసన తెలియచేశారు. కరీంనగర్‌ నిరసనలో పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. సంగారెడ్డి, మేడ్చల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో పార్టీ నాయకులు పాల్గొని నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
Tags :

Related Keywords

Nalgonda District , Andhra Pradesh , India , Khammam , Suryapet , Bhatti Vikramarka , Ponnala Lakshmaiah , Committee Damodara , Advertising Committee , President Petro , His Central , Run Committee , நல்கொண்டா மாவட்டம் , ஆந்திரா பிரதேஷ் , இந்தியா , கம்மம் , சூர்யாபேட்டை , பொன்னாள லக்ஷ்மையா , ப்ரெஸிடெஂட் பெட்ரோ , ஓடு குழு ,

© 2025 Vimarsana