ఆదర్శం అంతంతమాత్రమే? ఈనాడు, హైదరాబాద్: పేరుకు ఆదర్శ పాఠశాలలైనా వసతుల్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. ఆంగ్ల మాధ్యమంలో విద్యనందించే ఈ పాఠశాలలు ప్రతి ఏటా ఫలితాలు, ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉంటున్నా విద్యాశాఖ మాత్రం వాటి అభివృద్ధిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కనీసం అమ్మాయిలకు పూర్తిస్థాయిలో వసతి సౌకర్యం కల్పించలేని దుస్థితి. కేంద్ర ప్రభుత్వం 100 మంది బాలికలకు హాస్టల్ వసతి ఇవ్వాలని మోడల్ పాఠశాలలను ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇంకా 35 చోట్ల ఆ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. భవనాలు, తరగతుల మరమ్మతులు, అసంపూర్తి భవనాల కోసం 2020-21 బడ్జెట్‌లో రూ.2 కోట్లే కేటాయించడం విద్యాశాఖ నిర్లిప్తతకు నిదర్శనంగా కనిపిస్తోంది. రూ.800 కోట్లు అవసరం ప్రతి పాఠశాలలో 700-800 మంది విద్యార్థులున్నారు. వారిలో 400 మంది బాలికలు ఉంటారు. ఇప్పుడు హాస్టల్ ఉన్న చోట 100 మంది అమ్మాయిలకే వసతి కల్పిస్తుండటంతో మిగిలిన వారు ఇళ్ల దగ్గర నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వారికీ వసతి కల్పిస్తే రాష్ట్రవ్యాప్తంగా మరో 58,200 మంది బాలికలకు భద్రత లభిస్తుంది. కనీసం 5 ఎకరాల స్థలం గల ప్రతి మోడల్ పాఠశాలల్లో హాస్టళ్ల భవనాలు నిర్మిస్తే విద్యార్థినులకైనా గురుకుల విద్య అందుతుంది. అందుకు రాష్ట్రవ్యాప్తంగా రూ.600 కోట్ల నుంచి రూ.800 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఇదీ పరిస్థితి మొత్తం పాఠశాలలు: 194 తరగతులు: 6 నుంచి ఇంటర్ వరకు 2020-21లో మొత్తం హాస్టల్ సౌకర్యం: 159 చోట్ల మాత్రమే Tags :