836 అడుగులకు శ్రీశైలం నీటిమట్టం ఈనాడు హైదరాబాద్: ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయం కనీస నీటిమట్టానికి చేరుకొంది. అయినా ఇప్పటికీ కృష్ణా బేసిన్‌లో అతి తక్కువగా 26 శాతమే నీటి నిల్వలున్న ప్రాజెక్టు ఇదే. శ్రీశైలం కనీస నీటిమట్టం 834 అడుగులు కాగా మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 836 అడుగులుగా ఉంది. లక్షా 40 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా విద్యుదుత్పత్తి ద్వారా తెలంగాణ 28252 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తోంది. కృష్ణాలో ఎగువన ఆలమట్టి పూర్తి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా 97.23 టీఎంసీలు నిల్వ ఉంది. 40 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా కిందకు వదులుతున్నారు. నారాయణపూర్ నుంచి 56 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా దిగువన లభ్యమయ్యే నీటితో కలిపి జూరాలకు ఉదయం 1.48 లక్షల క్యూసెక్కుల వరద నమోదవగా సాయంత్రానికి తగ్గి 1.17లక్షలకు చేరింది. మొత్తం 1.15లక్షల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్‌కు 18880క్యూసెక్కులు రాగా 500 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇక్కడ విద్యుదుత్పత్తి చేయడం లేదు. దిగువన ఉన్న పులిచింతలలో 43.55 టీఎంసీల నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టుకు 5600 క్యూసెక్కులు వస్తుండగా ఈ నీటిని విద్యుదుత్పత్తి ద్వారా దిగువన ప్రకాశం బ్యారేజీకి, అక్కడి నుంచి సముద్రానికి విడుదల చేస్తున్నారు. గోదావరిలోని ప్రాజెక్టులకు వరద తగ్గింది. 80శాతం నీటి నిల్వలున్న శ్రీరామసాగర్‌లోకి 7407 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 680 క్యూసెక్కులను కాలువలకు వదులుతున్నారు. సింగూరు, కడెం ప్రాజెక్టుల్లోకి రెండు వేల క్యూసెక్కులలోపే వస్తుండగా, ఎల్లంపల్లిలోకి 10900 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. కాగా వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలారు. గోదావరిలో దిగువన ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 67 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. Tags :