పట్టుబట్టి.. ఎస్సై కొలువు కొట్టి.. మొదటి ప్రయత్నంలోనే విజేతలైన గ్రామీణ యువతులు న్యూస్‌టుడే, కరీంనగర్ నేరవార్తలు అందరిదీ వ్యవసాయ కుటుంబం.. కష్టాలు తెలిసిన వారు.. ఇంజినీరింగ్ చదివి సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడాలని అనుకున్నారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగభద్రతపై సందేహాలు వారిని వెంటాడాయి. ఎంతటి పోటీనైనా తట్టుకొని ప్రభుత్వ రంగంలో ఉద్యోగం సాధించాలని పోలీసు ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. కష్టపడితే విజయం వరిస్తుందని చదివారు. విజేతలుగా నిలిచారు. మొదటి ప్రయత్నంలోనే పోలీసు శాఖలోని ఎస్సైలుగా ఎంపికయ్యారు. ప్రస్తుతం కరీంనగర్ కమిషనరేట్‌లో శిక్షణ పొందుతున్నారు. వారి పరిచయమే ఈ కథనం.. సోదరి సూచన... వరంగల్ అర్బన్ జిల్లా అయినవోలు మండలం సింగారం గ్రామానికి చెందిన కట్కూరి మౌనిక వ్యవసాయ కుటుంబంలో జన్మించింది. మౌనికకు ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు. ఇంటర్ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదువుకుని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అయిన సోదరి సంధ్యారాణి సూచన మేరకు బ్యాంకింగ్, వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శి పోస్టుల కోసం పరీక్షలు రాసి అర్హత సాధించింది. ప్రభుత్వం 2018లో పోలీసు శాఖలోని ఎస్సై పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేయడంతో ఆటుగా ప్రయత్నించింది. శారీరక సామర్థ్య పరీక్షల కోసం 6 గంటలు, రాత పరీక్ష కోసం 15 గంటలు కష్టపడినట్లు తెలిపింది. పరీక్షల్లో అర్హత సాధించింది. ప్రస్తుతం కరీంనగర్ కమిషనరేట్‌లో శిక్షణ పొందుతోంది. మొదటి ప్రయత్నంలోనే ప్రభుత్వ కొలువు సాధించడం ఆనందంగా ఉందని మౌనిక తెలిపింది. అమ్మ కష్టాలను దూరం చేయాలని.. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట గ్రామానికి చెందిన కె.శ్రీలత చిన్నతనం నుంచి చదువులో ముందు వరుసలో నిలిచింది. 10వ తరగతిలో 72, ఇంటర్‌లో 65, ఇంజినీరింగ్‌లో 68 శాతం మార్కులు సాధించింది. శ్రీలత తండ్రి శంకర్ లారీ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించారు. 14 సంవత్సరాల క్రితం శంకర్ గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ బాధ్యతలను తల్లి సులోచన తీసుకుని పిల్లల ఇష్టాలను తెలుసుకుని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసింది. హైదరాబాద్‌లో ఉంటూ ఎం.టెక్ చదువుతుండగా తండ్రి లేకపోవడంతో కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకుంది. ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ పడటంతో శిక్షణ తీసుకుంటూ ముందుకు సాగింది. రాత, శారీరక సామర్థ్య పరీక్షల్లో అర్హత సాధించి అనుకున్న లక్ష్యాన్ని సొంతం చేసుకుంది. అమ్మ కష్టాలను దూరం చేయాలనే లక్ష్యంతో చదివి సాధించాను. నాన్న కోసం పోలీస్ వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన వల్లపురెడ్డి దీపిక. తండ్రి రామచంద్రారెడ్డి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన అందించిన ప్రోత్సాహంతో అనుకున్న లక్ష్యానికి ప్రయత్నించింది. 10వ తరగతి 85, ఇంటర్‌లో 93 , బీటెక్‌లో 73 శాతం మార్కులతో వారి కుటుంబంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంజినీరింగ్ పూర్తి కాగానే సాప్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రయత్నాలు చేసింది. 2018లో పోలీసు శాఖ ఎస్సై నోటిఫికేషన్ విడుదల కావడంతో తొలుత భయపడినా తండ్రి అందించిన ప్రోత్సాహంతో ఎలాగైన పోలీసు అవ్వాలని నిర్ణయించుకుంది. శిక్షణ తీసుకుని అర్హత సాధించింది. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి పోలీసు శాఖలో ఎస్సైగా ఎంపిక కావడం అంతులేని ఆనందాన్నిచ్చిందని తెలిపారు. తండ్రి సూచన మేరకు కష్టపడి సాధించాను. చిన్నారులకు ట్యూషన్ చెబుతూ.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ గ్రామానికి చెందిన కుంట మౌనిక ఎలుగందల్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకుంది. 10 పరీక్షల్లో 91.1 శాతం మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా నిలిచి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంటర్‌లో సైతం 90.2, ఇంజినీరింగ్‌లో 78 శాతం మార్కులు సాధించి అందరి మన్ననలు పొందింది. హైదరాబాద్‌లో చిన్నారులకు ట్యూషన్స్ చెబుతూ ఉద్యోగ ప్రయత్నాలను ప్రారంభించింది. స్నేహితులతో కలిసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ఎస్సై పోస్టుకు అర్హత సాధించేందుకు ప్రత్యేక సమయం కేటాయించుకుని శ్రమించింది. మొదటి ప్రయత్నంలోనే ఎస్సైకి అర్హత సాధించింది. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేయడం సంతోషంగా ఉందని మౌనిక తెలిపింది. Tags :