అద్దెసరు.. ఆదర్శం! సొంత భవనాల్లేని సంక్షేమ గురుకులాలు ఇరుకు గదుల్లోనే విద్యార్థులు ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలకు ఉచితంగా కేజీ టూ పీజీ విద్య కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఆదర్శ గురుకులాలు ఆరేళ్లుగా అత్తెసరు వసతులతో, అద్దెభవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రతిఏటా తరగతులు అప్‌గ్రేడ్ అవుతూ జూనియర్ కళాశాలల స్థాయికి చేరినా, ఆయా గురుకులాల్లో ప్రమాణాల మేరకు కనీస మౌలిక సదుపాయాలు కరవయ్యాయి. తరగతి గదిలో పరిమితికి మించి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, డిమాండ్ లేక మూతబడిన ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రైవేటు పాఠశాలల భవనాలన్నీ ఇటీవల గురుకులాలకు అద్దెభవనాలుగా మారాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ సొసైటీ పరిధిలో 298గా ఉన్న గురుకులాల్ని ప్రభుత్వం భారీగా పెంచింది. దాదాపు ఏటా ఐదున్నర లక్షల మంది విద్యార్థులు ఐదో తరగతి నుంచి డిగ్రీ సహా ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్నారు. ప్రతిఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా ఆ మేరకు మౌలిక సదుపాయాలు పెరగడం లేదు. అద్దెభవనాల్లో గదుల సంఖ్య తక్కువగా ఉండటంతో విద్యార్థులు ఒకే గదిలో చదువుకోవడం, అక్కడే భోజనం, బస కొనసాగుతున్నాయి. విద్యార్థుల సంఖ్య మేరకు స్నానపు గదులు, మరుగుదొడ్లు లేవు. ఈ భవనాలకు నెలకు ఒక్కోదానికి సగటున రూ.2-4 లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నారు. గురుకుల విద్య నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి పాఠశాల ఆవరణలో నివాసంతో పాటు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు ఉండాలి. కానీ అవెక్కడా కనిపించడంలేదు. ఒక్కో పాఠశాలకు రూ.20 కోట్లు అవసరం గురుకుల పాఠశాలను ప్రారంభించాలంటే కనీసం 15 ఎకరాల స్థలం అవసరం. తరగతుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ విస్తీర్ణం ఎక్కువ కావాలి. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు 480 మంది విద్యార్థులకు బోధన, వసతి, భోజనం, ఆహ్లాద, క్రీడా అవసరాలకు అనుగుణంగా నిర్మించేందుకు కనీసం రూ.20కోట్ల వరకు ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన గురుకులాల శాశ్వత భవనాలకు కనీసం రూ.15వేల కోట్లు అవసరమని అంచనా. వాస్తవ పరిస్థితి ఇదీ.. * ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని 268 పాఠశాలల్లో ఏటా దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటీవల ప్రొఫెషనల్ డిగ్రీ, పీజీ కళాశాలలు మంజూరయ్యాయి. అవన్నీ అద్దెభవనాల్లోనే కొనసాగుతున్నాయి. * గిరిజన సొసైటీ పరిధిలో 133 పాఠశాలల్లో దాదాపు 80వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ గురుకులాలకు తోడుగా ఏజెన్సీల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మరో లక్ష మందికి విద్యాబోధన జరుగుతోంది. ఆయా పాఠశాలలకు సరైన భవనాల్లేవు. * బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 281 పాఠశాలల్లో 1.5 లక్షల మంది చదువుతున్నారు. పలుచోట్ల అద్దెభవనాలు దొరక్క ఒకే భవనంలో రెండేసి పాఠశాలలు కొనసాగుతున్నాయి. కొత్తగా మంజూరైన పాఠశాలలు, అప్‌గ్రేడ్ అయిన జూనియర్ కళాశాలలకు సొంత భవనాల్లేవు. * మైనార్టీ సొసైటీలో 192 పాఠశాలలు ఇప్పుడు జూనియర్ కళాశాలలుగా మారాయి. మౌలిక వసతులు పెరగలేదు. ఒకేభవనంలో రెండేసి పాఠశాలలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారంతో ప్రస్తుతం 54 గురుకుల పాఠశాలల భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. Tags :