Jul 31,2021 00:46 మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి : పెందుర్తి మండలం ఎస్‌ఆర్.పురంలో ల్యాండ్ ఎక్విజేషన్ పేరుతో భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. పెందుర్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో పెందుర్తి నియోజకవర్గంలో ల్యాండ్ పూలింగ్ చేశారా అని ప్రశ్నించారు. ఎస్‌ఆర్.పురంలో ల్యాండ్ పూలింగ్ చేయకుండా ల్యాండ్ ఎక్విజేషన్ చేశారని తెలిపారు. బాధితులకు నష్ట పరిహారం ఇచ్చే పేరుతో భారీ నగదు కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ కుంభకోణంలో స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజు, ఎస్‌ఆర్.పురం వైసిపి నాయకుడు జనాల జయరాజు, పెందుర్తి తహశీల్దార్ పి.రామారావు ప్రమేయం ఉందని, లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చి, వెంటనే కమిషన్ బ్యాంకు ద్వారా పొందినట్టు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రా, జంగాల పాలెం సర్పంచ్ నర్సింగరావు పీలా జితేంద్ర పాల్గొన్నారు.