జైలుకు ఉమా : vimarsana.com

జైలుకు ఉమా


జైలుకు ఉమా
మాజీమంత్రి సహా 18 మందిపై కేసులు
నాటకీయ పరిణామాల మధ్య పలు స్టేషన్లకు దేవినేని తరలింపు
వర్చువల్‌ విధానంలో న్యాయమూర్తి ఎదుట హాజరు.. ఆగస్టు 10 వరకు రిమాండు
ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-నందివాడ, హనుమాన్‌ జంక్షన్‌, మైలవరం, రాజమహేంద్రవరం: మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆగస్టు 10 వరకు రిమాండు విధించారు. ఆయనను బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. పోలీసులు ప్రత్యేక వాహనంలో బుధవారం రాత్రి 9.50 గంటల సమయంలో తరలించి, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం అధికారులకు అప్పగించారు. జి.కొండూరు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణకు సంబంధించి ఉమా సహా 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఉమాను ఏ1గా చూపించారు. ఆయన అనుచరులు 17 మందితో పాటు మరికొందరు అని కూడా చేర్చారు. కొండపల్లి రిజర్వు అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి మంగళవారం రాత్రి జి.కొండూరు మండలం గడ్డమణుగు మీదుగా తిరుగు ప్రయాణమైన తెదేపా నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు, ఇతర తెదేపా నాయకులు తమపై దాడి చేశారంటూ వైకాపాకు చెందిన చెందిన దాసరి సురేష్‌ జి.కొండూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.
ఇదీ ఫిర్యాదు..
ఇబ్రహీంపట్నం వైకాపా నాయకుడు పాలడుగు దుర్గాప్రసాద్‌ వద్ద దాసరి సురేష్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తెల్లదేవరపాడు సర్పంచి తల్లి మరణించగా పరామర్శించేందుకు దుర్గాప్రసాద్‌, పులి కల్యాణ్‌, సుధీర్‌, శానంపూడి భరత్‌బాలు, నల్లమోతు సుభాష్‌లతో కలిసి కారులో బయలుదేరారు. వీరు మునగపాడు సమీపానికి చేరుకొనేసరికి తెదేపా నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు, అనుచరులతో కలిసి ఐదు కార్లలో ఎదురొచ్చారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొని డ్రైవర్‌ సురేష్‌ను బయటకు లాగి ఎస్సీ కులం పేరుతో దూషిస్తూ కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కారులో ఉన్న పాలడుగు దుర్గాప్రసాద్‌, పులి కల్యాణ్‌కు కూడా దెబ్బలు తగిలాయి. భయపడి తప్పించుకొని అక్కడ నుంచి జి.కొండూరు పోలీసుస్టేషన్‌కు చేరుకొన్నారు.
దేవినేని ఉమా, ఇతరులపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. సెక్షన్‌ 188, 147, 148, 341, 323, 324, 120బి, 109, 307, 427, 506, 353, 332 రెడ్‌ విత్‌ 149 ఐపీసీ, ఈడీఏ, 3(1) (ఆర్‌), 3(1) (ఎస్‌) (వి), ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదుచేశారు. ఇందులో మూడు కఠినమైన సెక్షన్లున్నాయి. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కులం పేరుతో దూషించినందుకు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు, హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ అభియోగాలు మోపారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి సమావేశం అయ్యారని, కర్రలు, రాళ్లు, రాడ్లతో వచ్చి చంపేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. పోలీసులపైనా దాడి చేశారని, దీనివల్ల పోలీసులకు గాయాలయ్యాయని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.
వైకాపా వర్గీయుల కేసులపై గోప్యత
దేవినేని ఉమా, ఆయన అనుచరులపై దాడి చేసినందుకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ వర్గీయులు ఆరుగురిపై కేసు నమోదుచేశామని పోలీసులు చెబుతున్నారు. అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. పేర్లు తర్వాత చెబుతామని, ఇంకా పలువురిని గుర్తించాలని దాటవేస్తున్నారు. వీరిపై ఏయే సెక్షన్ల కింద కేసులు పెట్టారో కూడా చెప్పలేదు.
ఆద్యంతం హైడ్రామా
అరెస్టు నుంచి రిమాండుకు తరలించే వరకూ ఆద్యంతం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివరాలు బయటకు పొక్కకుండా పోలీసులు గోప్యత పాటించారు. ఎక్కడకు, ఏ మార్గంలో తీసుకెళ్లేదీ బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఇది తెదేపా నాయకులను హైరానాకు గురిచేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు ఉమాను అరెస్టు చేశారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో పెదపారుపూడి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ సరైన వసతులు లేకపోవడం, స్టేషన్‌ రోడ్డు పక్కనే ఉండటం, తెదేపా నాయకులు పెద్దఎత్తున చేరుకోవడంతో నిర్ణయం మార్చుకున్నారు. ఉదయం 5.45 గంటలకు నందివాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అప్పటికే నందివాడ మండలంలో భారీగా పోలీసులు మోహరించి రహదారిని జనార్దనపురం వద్ద బారికేడ్లతో మూసేశారు. విషయం తెలిసి పలు ప్రాంతాల నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలు భారీగా నందివాడ చేరుకున్నారు. పోలీసుస్టేషన్‌కు 200 మీటర్ల దూరంలోనే అందరినీ నిలిపేశారు. స్టేషన్‌లోకి ఎవరినీ అనుమతించలేదు.
* నందివాడ స్టేషను పై అంతస్తులోని ఓ గదిలో ఉమాను ఉంచారు. ఆయనను చూపించాలని పోలీసుస్టేషను సమీపానికి చేరుకుని నాయకులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. గుడివాడ గ్రామీణ సీఐ నబీతో వాగ్వాదానికి దిగారు. కానీ న్యాయవాదిని మాత్రమే అనుమతించారు. స్టేషనులోనే ఉమాకు సాధారణ వైద్యపరీక్షలతో పాటు కొవిడ్‌ పరీక్ష కూడా చేశారు. ఉదయం నుంచి మరో అరగంటలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని చెబుతూ.. సాయంత్రం 4.15 వరకూ స్టేషనులోనే ఉంచారు. తర్వాత స్టేషన్‌ నుంచి బయటకు తీసుకొచ్చి పోలీసు వాహనాల్లో తరలించారు. ఈ సందర్భంగా తెదేపా కార్యకర్తలు నినాదాలు చేస్తూ పోలీసు వాహనం వద్దకు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని చెదరగొట్టి, వాహనాన్ని ముందుకు పోనిచ్చారు.
* ఉమాను ఎక్కడ హాజరుపరుస్తారనే విషయాన్ని పోలీసులు చివరివరకూ గోప్యంగా ఉంచారు. మైలవరం, నూజివీడు కోర్టుల వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు. రెండు ప్రాంతాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు భారీగా గుమిగూడారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చివరకు హనుమాన్‌జంక్షన్‌ సర్కిల్‌ కార్యాలయానికి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తీసుకొచ్చారు. విషయం తెలిసి నేతలు స్టేషను వద్దకు చేరుకున్నారు. పోలీసులు వారిని రహదారిపైనే నిలిపివేశారు. మైలవరం సీఐ శ్రీను.. కేసు రికార్డులను స్థానిక న్యాయస్థానంలో సమర్పించారు. అనంతరం వాటిని మైలవరంలోని న్యాయమూర్తి షిరీన్‌ ఇంటికి తీసుకెళ్లి అందజేశారు. అనంతరం హనుమాన్‌జంక్షన్‌ స్టేషనులో ఉన్న దేవినేనిని న్యాయమూర్తి ఎదుట జూమ్‌ యాప్‌ ద్వారా వర్చువల్‌ విధానంలో హాజరుపర్చారు. విచారణ జరిపిన న్యాయమూర్తి.. ఉమాకు 14 రోజులు (ఆగస్టు 10 వరకు) రిమాండ్‌ విధించారు. అనంతరం భారీ పోలీసు బందోబస్తు మధ్య సాయంత్రం 6.30 గంటల సమయంలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి ఉమాను తరలించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు
వైకాపా, తెదేపా వర్గీయుల ఘర్షణ కేసును నిస్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికే ఇరువర్గాలపై కేసులు నమోదు చేశాం. మునగపాడు సమీపంలో మంగళవారం సాయంత్రం ఘర్షణ విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను పంపేశాం. తెదేపా నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు కొండపల్లి రిజర్వు అటవీ ప్రాంతం నుంచి బయలుదేరి మునగపాడు వద్దకు వచ్చి రెచ్చగొట్టారు. దీనివల్ల రెండువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఆయన జి.కొండూరు పోలీసుస్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. కారు నుంచి దిగలేదు. తన అనుచరుల్ని స్టేషన్‌ వద్దకు పిలిపించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు. ఫిర్యాదు ఇవ్వాలని దాదాపు 4 గంటల పాటు పోలీసులు కోరినా ఆయన స్పందించలేదు. దీంతో చట్టప్రకారం ఆయనను అరెస్టు చేశాం.
- నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు
ఇద్దరు తెదేపా వర్గీయుల అరెస్టు
జి.కొండూరు, న్యూస్‌టుడే: వైకాపా వర్గీయులపై దాడి చేశారని ఇచ్చిన ఫిర్యాదులో ఇద్దరు తెదేపా వర్గీయులను అరెస్టు చేసినట్లు జి.కొండూరు ఎస్‌ఐ ఆర్‌.ధర్మరాజు బుధవారం తెలిపారు. అంకెం సురేష్‌, బొల్లం లీలాశ్రీనివాస్‌లను అరెస్టు చేసి మైలవరం కోర్టుకు తరలించినట్లు చెప్పారు.
Tags :

Related Keywords

Nuzvid , Andhra Pradesh , India , Gudivada , Kondapalli , Uma Maheswara Rao Devineni , , Uma Maheswara Rao Devineni Kondapalli , நுஜ்விட் , ஆந்திரா பிரதேஷ் , இந்தியா , குடிவாடா , கொண்டாபபல்ளி ,

© 2024 Vimarsana