పెట్టుబడికి పెద్ద కష్టం : vimarsana.com

పెట్టుబడికి పెద్ద కష్టం


పెట్టుబడికి పెద్ద కష్టం
ఏళ్లుగా పరిష్కారం కాని పాసుపుస్తకాల సమస్య
ధరణిలో నమోదు కోసం రైతుల ఎదురుచూపు
అపరిష్కృతంగా నాలుగున్నర లక్షల ఖాతాలు
యాజమాన్య హక్కులు దక్కని 10 లక్షల ఎకరాలు
ఈనాడు, హైదరాబాద్‌: సమస్య చిన్నదే. పరిష్కారానికి మాత్రం ఏళ్లు పడుతోంది. అదే పాసుపుస్తకం. ధరణి పోర్టల్లో పేరు, భూమి ఖాతా, సర్వే నంబర్‌ లేనిదే పాసుపుస్తకాలు ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు. అందులో చేర్చాలని కోరితే.. జిల్లా కలెక్టర్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. తీరా దరఖాస్తు చేసుకున్నాక దరఖాస్తు అందిందని సెల్‌ఫోన్‌కు ఒక సంక్షిప్త సందేశం వస్తోంది. ఆ తర్వాత ఏ జవాబూ ఉండటం లేదు. వివాదాస్పద జాబితా (పార్ట్‌-బీ)లో ఉన్న అనేక మందికి ఇప్పటికీ పాసుపుస్తకాలు అందలేదు. వీరికి యాజమాన్య హక్కులు కల్పించే అంశం క్షేత్రస్థాయి సర్వేతో ముడిపడి ఉందని కొన్ని జిల్లాల్లో అధికారులు చెబుతున్నారు.  గతంలో తహసీల్దార్లు భూ యాజమాన్య హక్కులు కల్పించేవారు. ఇప్పుడా బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అదనంగా అప్పగించారు. అయినా ఏడు నెలలుగా సమస్య నానుతోంది. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఖాతాలకు సంబంధించిన సమస్యలున్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి తెలుస్తోంది. మొత్తంమీద 10 లక్షల ఎకరాల భూములకు యాజమాన్య హక్కు రావాల్సి ఉంది. ‘భూమిని మేమే సాగు చేస్తున్నాం. పాత దస్త్రాలన్నీ మా పేరుపైనే ఉన్నాయి. పాసుపుస్తకం ఇవ్వండి’ అంటూ రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. పాసుపుస్తకాలు అందనివారు తమ సమస్యలను వాట్సప్‌, మెయిల్‌, పోర్టల్‌ ద్వారా తెలియజేసేందుకు రెవెన్యూశాఖ అవకాశం కల్పించింది. ఎలా దరఖాస్తు చేయాలో తెలియని గ్రామీణ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా గ్రామసభలు ఏర్పాటు చేయాలని రైతు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
ఈయన పేరు నర్సింహా. మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం వాడ్యాల గ్రామంలో రెండెకరాల అసైన్డ్‌ భూమి ఉంది. 2017కు ముందు వరకు గ్రామీణ బ్యాంకులోనో లేదా పట్టా తాకట్టు పెట్టి వ్యాపారి వద్దో పెట్టుబడికి డబ్బులు తెచ్చుకునేవారు. పంట చేతికిరాగానే తీర్చేసేవారు. కొత్త పాసుపుస్తకం అందక ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ‘మా ఊర్లో 22 మంది రైతులకు 44 ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంది. వీరెవరికీ పుస్తకాలు ఇవ్వలేదు. నాలుగేళ్ల నుంచి తిరగని ఆఫీసు లేదు. పాసుపుస్తకం లేదని వ్యాపారులు రూ.3 వడ్డీ తీసుకుంటున్నారు. బ్యాంకువాళ్లు రానివ్వడం లేదు. బీమా, రైతుబంధు అందడం లేదు’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని దృష్టాంతాలు..
* రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో నాగరాజు అనే వ్యక్తి తండ్రి పేరుపై ఎకరన్నర పట్టా, అర ఎకరా అసైన్డ్‌ భూమి ఉంది. 2019లో జారీచేసిన కొత్త పాసుపుస్తకంలో పట్టాభూమి మాత్రమే నమోదైంది. మిగిలిన భూమి వివరాలేవీ ఆన్‌లైన్‌లో లేకపోవడంతో దరఖాస్తు చేసేందుకు వీలుకావడం లేదు.
* మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలంలో రెండు సర్వే నంబర్లలోని 1,100 ఎకరాలను దాదాపు 500 మంది రైతులు సాగు చేస్తున్నారు. వాస్తవ భూమి కన్నా రైతుల దస్త్రాల్లో ఎక్కువ భూమి ఉండటంతో 2017 తరువాత ఎవరికీ పాసుపుస్తకాలు ఇవ్వలేదు. నలుగురు రైతులు మృతి చెందినా వారి కుటుంబాలు బీమాకు నోచుకోలేదు.
* పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలంలో ఒక రైతు భూమిని మరో రైతు పేరుతో బై నంబర్‌తో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ధరణి పోర్టల్లో అసలు రైతు భూమి వివరాలుండగా ఇప్పుడు కనిపించడం లేదు. దీనిపై ఫిర్యాదు చేసినా పరిష్కారం లేదు.
కీలకమైన సమస్యలు..
* పట్టా భూమికి పాసుపుస్తకం జారీ చేసి.. అసైన్డ్‌ భూమిని నమోదు చేయలేదు.
* ఇనాం భూములకు హక్కులు కల్పించలేదు.
* సర్వే నంబరులోని కొంత భూమి భూసేకరణలో పోతే మొత్తం సర్వే నంబర్‌ను పక్కనపెట్టారు.
* దేవాదాయ, వక్ఫ్‌ విస్తీర్ణం ఉన్న సర్వే నంబర్లలోని రైతులందరికీ హక్కులు ఇవ్వడం లేదు.
* చాలా జిల్లాల్లో అసైన్డ్‌ భూములకు పాసుపుస్తకాలు ఇవ్వలేదు.
రాష్ట్రంలో మొత్తం భూముల ఖాతాలు: 71.75 లక్షలు
పోర్టల్‌లో నిక్షిప్తమైన వ్యవసాయ ఖాతాలు: 61.30 లక్షలు
యాజమాన్య హక్కు అందాల్సిన ఖాతాలు: 4.5 లక్షలు (సుమారు)
వ్యవసాయ భూముల విస్తీర్ణం: 1.42 కోట్ల ఎకరాలు
యాజమాన్య హక్కు దక్కనివి: 10 లక్షల ఎకరాలు (సుమారు)
Tags :

Related Keywords

Peddapalli , Andhra Pradesh , India , , Office No , District Collectors , Ranga Reddy , Peddapalli District , Earth Land , பெட்தாபபல்ளி , ஆந்திரா பிரதேஷ் , இந்தியா , அலுவலகம் இல்லை , மாவட்டம் சேகரிப்பாளர்கள் , ரங்கா சிவப்பு , பெட்தாபபல்ளி மாவட்டம் , பூமி நில ,

© 2024 Vimarsana