ట్యాంకు నుంచి నీరు తొడుతున్న చిన్నారులు ప్రజాశక్తి-కనగాన పల్లి : కనగానపల్లి, రామగిరి మండలాల ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. కనగానపల్లి, రామగిరి మండలాలకు చెందిన గ్రామాల ప్రజలకు ఎక్కువ శాతం సత్యసాయి తాగునీటి పథకం ద్వారా వచ్చే నీరే ఆధారం. 12 రోజులుగా సత్యసాయి తాగునీటి పథకం నీరు సరఫరా కాకపోవటంతో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాలకు సత్యసాయి తాగు నీటిని సరఫరా చేసే కార్మికులకు 14 నెలల బకాయి వేతనాలు ఇవ్వకపోవటంతో వారు సమ్మెలోకి వెళ్లారు. దీంతో ఆయా గ్రామాలకు తాగునీటి సరఫరా ఆగిపోయింది. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. అటు కార్మికుల, ఇటు ప్రజల సమస్యల పట్ల పాలకులు, అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజాప్రతినిధుల, అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాగునీటి సరఫరా కార్మికుల సమస్యలు పరిష్కారం కాక వారు సమ్మెలోకి వెళ్లారని దీంతో తాము తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. వ్యవసాయ బోరుబావులవద్దకు, సూదూర ప్రాంతాలకు వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజుల నుంచి తాగునీరు సరఫరా కాకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండలంలోని కొండపల్లివాసులు వాపోయారు. తాము ఉపాధి నిమిత్తం కూలి పనులకు వెళితే ఇంట్లో ఉండే తమ పిల్లలు ప్రాణాలకు తెగించి సత్యసాయిబాబా వాటర్ ట్యాంకులో నిల్వ ఉంచిన నీటిని తోడుకుని వస్తున్నారని చెప్పారు. పంచాయతీ బోరు నుంచి వచ్చే నీరు ఉప్పునీరు కావడం వల్ల తాగునీటికి నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైన అధికారులు, పాలకులు స్పందించి తాగునీటి సరఫరా పథకం కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించి వారు విధుల్లోకి వచ్చేలా చూసి తాగునీటి సమస్య పరిష్కరించాలని మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. తాజా వార్తలు