జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విచారకరం. ఇది పారదర్శకతకు పాతర వేయడమే! ఈ నిర్ణయంతో ప్రభుత్వం ప్రజల నుండి ఏదో దాచడానికి ప్రయత్నిస్తోందన్న అనుమానాలు బలపడతాయి. సమాచార సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత సమయంలో సాధికారిక సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడమే అన్ని విధాల శ్రేయస్కరం. జీవో లను ఆన్‌లైన్‌లో ఉంచడమన్నది గత పుష్కరకాలం పైగా వ్యవస్థీకృతమైన ప్రక్రియ! దీనివల్ల ప్రభుత్వ ఉత్తర్వులను ఎప్పటికప్పుడు తెలుసుకునే సౌలభ్యం ప్రజలకు లభించింది. సెల్‌ఫోన్ల వాడకం పెరిగిన తరువాత అరచేతిలోనే జీవోలు ప్రత్యక్షమవుతున్నాయి.