Jun 14,2021 08:55 బందరు పోర్టు రోడ్డు, రైల్వే కనెక్టవిటీకి భూ సేకరణకు సన్నాహాలు 'ప్రకాశం' దిగువన మరో రెండు బ్యారేజీలకు భూ నాణ్యతా పరీక్షలు ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కృష్ణా జిల్లాలోని కీలక ప్రాజెక్టుల్లో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తర్వాత కదలిక వచ్చింది. బందరు పోర్టుకు అవసరమైన భూ సేకరణకు రెవెన్యూ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. కృష్ణా నదిపై ప్రకాశం దిగువన మరో రెండు బ్యారేజీల నిర్మాణానికి డిపిఆర్‌కు భూ నాణ్యతా పరీక్షలు (సాయిల్ టెస్టింగ్) జరుగుతోంది. జిల్లా పారిశ్రామిక వెనుకబాటును అధిగమించేందుకు మచిలీపట్నం పోర్టు నిర్మాణం కీలకమని ప్రభుత్వాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అడుగు ముందుకు పడలేదు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి ఎనిమిదో తేదీన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పోర్టు నిర్మాణ భాగస్వామ్య సంస్థ నవయుగతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. రెండేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పోర్టుకు రూ.152 కోట్లు కేటాయించింది. దీంతో, తాజాగా పోర్టు పనుల్లో కదలిక వచ్చింది. దీనిలో భాగంగా పోర్టుకు అవసరమైన 530 ఎకరాల అసైన్డ్ భూములు, రోడ్డు, రైల్వే కనెక్టవిటీకి అవసరమైన మరో 170 ఎకరాల భూముల సేకరణకు మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీ (ముడా) సిద్ధమైంది. దీనిలో భాగంగా సాగుదారుల నుంచి అసైన్డ్ భూములను వెనక్కి తీసుకోవాల్సిన భూములు, ప్రయివేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సిన భూముల వివరాలు రికార్డు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మరోపక్క ఎపి మారిటైం బోర్డు టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది. కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ దిగువన మరో రెండు చెక్ డ్యాముల నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో రూ.1,800 కోట్లతో నివేదికలు సిద్ధం చేశారు. వైసిపి ప్రభుత్వం ఈ డ్యాముల ప్రతిపాదనల్లో మార్పు చేసి బ్యారేజీల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డిపిఆర్)కు కన్సల్టెన్సీ సంస్థ సర్వే నిర్వహిస్తోంది. మోపిదేవి మండలం బండికోళ్లలంక, పెనమలూరు మండలం చోరగుడి వద్ద భూమి నాణ్యతా పరీక్షలు (సాయిల్ టెస్టింగ్) నిర్వహిస్తోంది. తాజా వార్తలు