vimarsana.com


సహకారమా.. రాజకీయమా!
కేంద్రంలో సహకార మంత్రిత్వశాఖ ఏర్పాటుపై సందేహాలెన్నో
అమిత్‌షాకు అప్పగించడంతోనే ఈ చర్చ
అసలు ఉద్దేశాలు తెలియడానికి మరికొంత కాలం పడుతుంది
‘ఈనాడు’ ముఖాముఖిలో బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్‌ శ్రీరాం
ఎం.ఎల్‌.నరసింహారెడ్డి
ఈనాడు - హైదరాబాద్‌
కేంద్రంలో ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ఆర్థికంగా పరిపుష్టం చేయడానికా.. లేక చెరకు, ఇతర సహకార సంఘాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందడానికా అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ శాఖను అమిత్‌షాకు అప్పగించారు కాబట్టి ప్రత్యేకంగా ఆలోచించాల్సి వస్తోందని బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ పాలసీ విభాగం ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.ఎస్‌.శ్రీరాం అభిప్రాయపడ్డారు. సహకార రంగం రాష్ట్రాల పరిధిలోనిదే అయినా ఇటీవలి కాలంలో పలు అంశాలను కేంద్రం తమ గుప్పిట్లోకి తీసుకోవడం పెరిగింది కాబట్టి ఆ కోణంలో కూడా చూడాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రిజర్వ్‌బ్యాంకు పట్టణ సహకార బ్యాంకుల రెగ్యులేషన్‌పై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో సభ్యునిగా, కేరళ ప్రభుత్వం కో ఆపరేటివ్‌ బ్యాంకు ఏర్పాటుపై నియమించిన నిపుణుల కమిటీకి ఛైర్మన్‌గా కూడా వ్యవహరించిన శ్రీరాం ‘ఈనాడు ప్రత్యేక ప్రతినిధి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రంలో కొత్తగా సహకార మంత్రిత్వశాఖ ఏర్పాటుకు సంబంధించిన పలు అంశాలను వెల్లడించారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
* సహకార రంగం రాష్ట్రాల పరిధిలోని అంశం. కేంద్రం ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడానికి కారణమేంటి? దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి?
కేంద్రం నిర్ణయం వెనక ఉన్న ఉద్దేశమేంటో తెలియడానికి మరికొంత కాలం పడుతుంది. అయితే ఇందులో రెండు మూడు అంశాలున్నాయి. రాష్ట్రాలకు సంబంధించిన అంశాల కేంద్రీకరణ స్వభావం పెరిగింది. సహకార సంఘం రాష్ట్రాల పరిధిలోని అంశమైనా గత కొన్ని సంవత్సరాలుగా పెరిగిన కేంద్రీకరణ కోణం నుంచి చూడాల్సి ఉంటుంది. పది వేల రైతు ఉత్పత్తి సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్‌లో ప్రకటించారు. ఇవి సహకార సంఘాలైనా ఉత్పత్తి కంపెనీల కింద ఉన్నాయి. సహకార రంగం రాష్ట్ర పరిధిలోనిది. వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు సహకార రంగం విధానంలో పని చేస్తాయి. అయితే ఉత్పత్తి కంపెనీలుగా కేంద్ర చట్టంలో చేర్చారు. ఆర్థికమంత్రి ప్రకటనను, కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలకు కొనసాగింపుగా కూడా వీటిని చూడాల్సి ఉంటుంది. వ్యవసాయ చట్టాలకు అనుగుణంగా ఇక్కడ ఏం చేస్తారు, జాతీయ స్థాయిలో కమోడిటీస్‌ సహకార సంఘాన్ని ఏర్పాటు చేస్తారా, పాల సహకార సంఘాలన్నింటిని కలిపి ఒక గొడుగు కిందకు తెస్తారా, చెరకు సహకార సంఘాలన్నింటినీ కేంద్రీకృతం చేస్తారా అనేది చూడాలి. గత కొంతకాలంగా కేంద్రం పలు అంశాలను తన చేతుల్లోకి తీసుకోవడం పెరిగిందన్న కోణం నుంచే దీనిని పరిశీలించాలి. వ్యవసాయ మార్కెట్ల (ఎపీఎంసీ) విషయంలో తీసుకొన్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో సహకార సంఘాలను పటిష్ఠం చేసి వాటి ద్వారానే మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. గతంలో ఆయిల్‌ సీడ్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీల్లాంటివి ఉన్నాయి. రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాల ద్వారా అంటే ఒక రకంగా కేంద్రం ఆధీనంలోకి తీసుకోవడమే.
* కేంద్రం ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడం వల్ల ప్రతికూల అంశాలేంటి? సానుకూల అంశాలేంటి?
ఇందులో నాలుగు రకాల అంశాలున్నాయి. కొత్తగా సహకార మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయడానికి అంతర్గతంగా ఉన్న కొన్ని అంశాలను అర్థం చేసుకోవచ్చు. మొదటిది గత కొన్నేళ్లుగా గ్రామీణ సహకార రుణ వ్యవస్థ ప్రాధాన్యం తగ్గుతూ వస్తుంది. చివరి ప్రయత్నంగా 15 సంవత్సరాల క్రితం కేంద్రం వైద్యనాథన్‌ కమిటీని నియమించడంతో పాటు, ఆ కమిటీ గుర్తించిన అంశాలను, సిఫార్సులను ఆమోదించింది. రూ. 15,000 కోట్లు సహకార సంఘాల పటిష్ఠతకు కేటాయించింది. ఏమేం చేయాలో రాష్ట్రాలతో ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకొని అమలు చేసేలా నష్టాలకు కారణాలను తెలుసుకోవడం, మరింత ప్రజాస్వామికంగా నడపటం మొదలైనవి ఇందులో ఉన్నాయి. అయితే 2008లో ప్రకటించిన రుణమాఫీతో వైద్యనాథన్‌ కమిటీ సిఫార్సుల అమలుకు కొంత అడ్డుకట్ట పడింది. ఆ తర్వాత కేరళ ప్రభుత్వం ఓ ప్రయత్నం చేసి జిల్లా స్థాయిలో ఉన్న సహకార సంస్థలను కేరళ బ్యాంకుతో ఏకీకృతం (ఇంటిగ్రేట్‌) చేసింది. ఇతర రాష్ట్రాలు ఏమీ చేయలేదు. తాజాగా కేరళ మోడల్‌ను అనుసరించాలని రిజర్వ్‌బ్యాంకు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే విధానపరంగా ఎలాంటి నిర్ణయం లేదు. 97వ రాజ్యాంగ సవరణ సహకార సంఘాల పాత్రను మరింత పెంచడంతోపాటు, నేరుగా ఈ సంస్థలను నియంత్రణలోకి తెచ్చుకోవడానికి అవకాశం లేకుండా చేసింది. అయితే ప్రస్తుత నిర్ణయం వల్ల ఇందులో కొత్త మంత్రి ఏమైనా చేయగలరేమో చూడాలి. గ్రామీణ సహకార సంఘాల నిర్వహణ సరిగా లేదు. తెలంగాణలోని ముల్కనూరు సహకార సంఘం లాంటివి కొన్ని తప్ప. రెండో ప్రాధాన్యత అంశం పట్టణ సహకార బ్యాంకులకు సంబంధించింది. బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టానికి తాజాగా సవరణలు చేయడంతోపాటు ఆర్‌బీఐ నియంత్రణ పాత్రను పెంచింది. ఈ నేపథ్యంలో కేంద్రం నేరుగా చేయగలిగింది చాలా తక్కువే. మూడోది వాణిజ్యపరంగా ఉన్న సహకార సంఘాలు. ఇందులో చర్యలు తీసుకోవడానికి అవకాశాలున్నాయి. దీని వ్యవసాయానికి కూడా దగ్గరగా సంబంధం ఉంది. ఈ రంగంలో పని చేస్తున్న సహకార సంఘాలను చూస్తే కోకో, అరేక (పోక), నూనె గింజలు, చేనేత సంఘాలు. ఇతర వ్యవసాయ ఉత్పత్తులలో ప్రత్యేకించి రెండు ప్రాధాన్యమైనవి ఉన్నాయి. మహారాష్ట్రలో చెరకు గుజరాత్‌, కర్ణాటకలో పాల సహకార సంఘాలు. నాలుగోది వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పిఓ). ఇవి సహకార సూత్రాల ఆధారంగా పని చేస్తాయి. కానీ కంపెనీ చట్టం పరిధిలో చేర్చారు. దీనివల్ల ఇవి రాష్ట్రం నుంచి కేంద్రం చేతిలోకి వెళ్లాయి. గత కొంతకాలంగా కేంద్రం చేపట్టిన చర్యలకు కొనసాగింపుగానే తాజాగా తీసుకొన్న నిర్ణయాన్ని చూడాల్సి ఉంటుంది.
* రాష్ట్రాల హక్కులను క్రమంగా కేంద్రం హరిస్తుందని, అందులో భాగంగానే ఈ నిర్ణయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీరేమంటారు.?
రాష్ట్రాల పరిధిలోని అంశాలు ఇటీవల కాలంలో ఎక్కువగా కేంద్రం చేతిలో కేంద్రీకృతమవుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే హోం, ఆరోగ్యరంగం, వ్యవసాయం, విద్య మొదలైనవన్నీ కేంద్రీకృతమయ్యాయి (యూనియనైజేషన్‌). కాబట్టి తాజా నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేయలేదు. ప్రస్తుతం కొన్ని సంస్థల స్వరూపం మారే అవకాశం ఉంది. అమూల్‌ గుజరాత్‌ కేంద్రంగా గల సహకార సంస్థ. దీని వాల్యూ చైన్‌ జాతీయ స్థాయిలో ఉంది. ఇది జాతీయ సహకార సంస్థ కావొచ్చు. అలాగే స్థానిక సహకార సంస్థలుగా ఉండి గుర్తింపు పొందిన నందిని, సారస్‌ బ్రాండ్లు. చెరకు రంగానికి సంబంధించి కూడా ఇదే జరగవచ్చు. రాష్ట్రాల నుంచి కేంద్రం వైపు తీసుకెళ్లేలా. ప్రస్తుత ప్రభుత్వం నేషనలైజేషన్‌, సెంట్రలైజేషన్‌కు సంబంధించిన కొత్త విధానాన్ని గమనిస్తూ ఉండాలి, ప్రతిఘటిస్తూ ఉండాలి. సహకార రంగంలోకి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు మార్కెట్‌ వైపు ప్రోత్సహిస్తున్నారు. సహకారరంగంలోకి ప్రైవేటు పెట్టుబడులు వస్తే వాటి కాళ్లమీద అవి స్వతంత్రంగా నిలబడాలనే లక్ష్యం నెరవేరదు. ప్రైవేటు పెట్టుబడులు మంచివి కాదని కాదు, వెనక నుంచి వీటిలో జోక్యం చేసుకొని వీటిని బలహీనపరచడం లేదా ధ్వంసం చేసే పరిస్థితి రాకూడదు.
* కేంద్రం ప్రత్యేకంగా సహకార మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడం అమిత్‌షాకు దీనిని అప్పగించడంతో కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తంచేశాయి. దీన్ని ఎలా చూడాలంటారు?
మోదీ మంత్రివర్గ విస్తరణకు ఒకరోజు ముందుగా కొత్తగా సహకార మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. సాధారణ పరిస్థితుల్లోనైతే పరిపాలనా సంస్కరణలో భాగంగా సహజంగా జరిగిన పరిణామంగానే చూడాలి. అయితే ఒకరోజు తర్వాత ఈ శాఖకు మంత్రి పేరును ప్రకటించడంతో చర్చ ఒక్కసారిగా వేడెక్కింది. కొందరి ప్రవేశం వల్ల కొన్ని సాధారణ అంశాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తుంది. ఈ పేరుతో పాటు కొన్ని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో పాటు ఈ రంగంలో ఏమైనా మార్పు జరగవచ్చేమో అన్న అభిప్రాయం కూడా. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో సహకార రంగానికి మంత్రిగా అమిత్‌షాను నియమించడం ఎక్కువ చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయం కొత్త ఆకాంక్షలను కాకుండా ఆందోళనను పెంచింది. దీనికి కారణం ప్రస్తుత రాజకీయ పరిస్థితులే. ప్రస్తుత విధానాలు మనల్ని అవకాశం వైపు కాకుండా కుట్ర వైపు చూసే పరిస్థితులను కల్పించాయి. ఇది దురదృష్టకరం. అయితే దీనిని ఆర్థికపరమైన అంశంగా భావించి ఆరోగ్యకరమైన చర్చకు దారి తీస్తే ఫలితం ఉంటుంది.
Tags :

Related Keywords

Bangalore ,Karnataka ,India ,United States ,Telangana ,Andhra Pradesh ,Kerala , ,Commission As ,Center Committee ,Expert Committee ,Commission United States ,Ministry Department ,Central Finance ,Farm Product ,States Guidelines ,New Minister ,பெங்களூர் ,கர்நாடகா ,இந்தியா ,ஒன்றுபட்டது மாநிலங்களில் ,தெலுங்கானா ,ஆந்திரா பிரதேஷ் ,கேரள ,தரகு என ,மையம் குழு ,நிபுணர் குழு ,தரகு ஒன்றுபட்டது மாநிலங்களில் ,அமைச்சகம் துறை ,மைய நிதி ,பண்ணை ப்ராடக்ட் ,மாநிலங்களில் வழிகாட்டுதல்கள் ,புதியது அமைச்சர் ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.