ఐఐటీ వదిలి... జనహితం కోరి... బాగా చదివితే మంచి ఉద్యోగమొస్తుంది... ఐఐటీలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ అయితే భారీ ప్యాకేజీలందుతాయి... కానీ నా చదువుకు పరమార్థం, సామాజికహితం కావాలని భావించాడు నల్గొండ యువకుడు ధనావత్ అశోక్. అరుదైన అవకాశాన్ని వదులుకున్నాడు... అందుకు ఫలితం దక్కింది. అతడు ఇప్పుడు ప్రఖ్యాత ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రవేశానికి అర్హత సాధించాడు... దానిక్కావాల్సిన రూ.40 లక్షలను కేంద్రప్రభుత్వం స్కాలర్‌షిప్ రూపంలో అందించబోతోంది అతడితో మాట కలిపింది ఈతరం. నల్గొండ జిల్లాలో రహదారి కూడా సరిగా లేని మారుమూల పెద్ద తండా అశోక్ సొంతూరు. ఇంట్లో కటిక పేదరికం. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు సామాజిక వివక్ష. ఎప్పుడూ ఇవే ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేసేవి. పెరిగి పెద్దయ్యాక నేను చదివే చదువు, వేసే ప్రతి అడుగుతో ప్రస్తుత పరిస్థితిని తన పరిధిలో కొంచెమైనా మార్చాలనుకునేవాడు. దానికి తగ్గట్టే నెదర్లాండ్‌లోని అరాస్మస్ విశ్వవిద్యాలయంలో ప్రఖ్యాత ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ (ఐఎస్‌ఎస్)లో చదవడానికి ప్రవేశం పొందడం అశోక్ జీవితంలో అతిపెద్ద విజయం. అంతర్జాతీయ న్యాయకేంద్రమైన హేగ్‌లోనే ఈ యూనివర్సిటీ కొలువై ఉంది. ప్రయోజనం లేదని.. కొద్దిపాటి పొలమే అశోక్ కుటుంబానికి జీవనాధారం. కానీ అతడి తండ్రికి చదువు విలువ తెలుసు. పంట ద్వారా వచ్చే సొమ్మునంతా పిల్లల చదువుకే వెచ్చించేవారు. దానికి తగ్గట్టే అశోక్ కష్టపడుతూ చదువులో ముందుండేవాడు. 2013లో మంచి పేరున్న నిజాం కళాశాలలో డిగ్రీ సీటొచ్చింది. కొన్నాళ్లు వెళ్లాక ఈ సంప్రదాయ చదువులతో సమాజానికి ఏం ప్రయోజనం లేదని భావించి డ్రాపవుట్ అయ్యాడు. 2016లో ప్రతిష్ఠాత్మక సంస్థ టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో అవకాశం దక్కించుకున్నాడు. మూడేళ్లయ్యాక డిగ్రీ పట్టా పుచ్చుకున్న అశోక్ ఆగస్టులో మాస్టర్ డిగ్రీ కోసం గుజరాత్ గాంధీనగర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశం పొందాడు. కానీ అక్కడ ఒక సెమిస్టర్ వరకు మాత్రమే చదివి నచ్చక తిరిగి వచ్చేశాడు. ఐఐటీలో పట్టా అందుకుంటే బహుళజాతి సంస్థలు పిలిచి మరీ ఉద్యోగాలిస్తాయి. అలాంటి అవకాశం ఉన్నా.. అది తన లక్ష్యానికి ఏమాత్రం సహకరించదనే ఉద్దేశంతో ఆ కోర్సును వదులుకున్నాడు. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ భవనం ఒకే ఒక్కడు ఐఐటీ నుంచి తిరిగొచ్చాక తెలుగు రాష్ట్రాల్లో సామాజిక కార్యకర్తగా మారాడు అశోక్. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, చంద్రన్న కానుక పథకాల్లో పని చేశాడు. ప్రభుత్వ కార్యక్రమాలతో పేదలకు జరిగే మేలేంటో పరిశోధన చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాడు. దీనికోసం ఎన్నో మారుమూల పల్లెలు చుట్టొచ్చాడు. లిబ్ టెక్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ సమన్వయకర్తగా అరకులో వివిధ సమస్యలు గుర్తించి ప్రభుత్వానికి నివేదించాడు. నల్లమల అటవీ ప్రాంతంలో చెంచుల జీవన విధానంపైనా అధ్యయనం చేశాడు. తర్వాత గతేడాది ఫిబ్రవరిలో ఐఎస్‌ఎస్‌కి దరఖాస్తు చేసుకున్నాడు అశోక్. నిజానికి ఈ సంస్థలో సీటు సాధించడం చాలా కష్టం. అభ్యర్థికి సామాజిక సమస్యలపై ఉన్న ఆసక్తి, అవగాహన ముందు పరిశీలిస్తారు. నేపథ్యం, చేసిన కార్యక్రమాలు తెలుసుకుంటారు. దీనికితోడు అతడు ఇంతకుముందు చదివిన కాలేజీ నుంచి ఇద్దరు ప్రొఫెసర్ల ఆమోదయోగ్య ధ్రువపత్రాలు తీసుకు రావాల్సి ఉంటుంది. అతడి సామాజిక తపన, సేవా కార్యక్రమాలను ముందు నుంచీ గమనిస్తున్న ప్రొఫెసర్లు సంతోషంగా దరఖాస్తుపై సంతకం పెట్టారు. టాటా ఇనిస్టిట్యూట్‌లో చదవడంతో ఆంగ్లం కోసం ప్రత్యేకంగా ఐఈఎల్టీఎస్ పరీక్ష రాయాల్సిన అవసరం రాలేదు. చివరగా సామాజిక సమస్యలపై పరిశోధన పత్రం సైతం సమర్పించి ప్రపంచంలోనే అత్యున్నత వర్సిటీలో ప్రవేశం సాధించాడు. ఐఎస్‌ఎస్‌కి దేశవ్యాప్తంగా 20మంది ఎంపికైతే, తెలంగాణ నుంచి ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడు అశోక్. ఈ విశ్వవిద్యాలయంలో కోర్సు పూర్తి చేయడానికి దాదాపు రూ.40లక్షలు ఖర్చవుతుంది. అత్యుత్తమ ర్యాంకు సాధించడంతో కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌నకు అశోక్ అర్హత సాధించాడు. కేంద్ర గిరిజనాభివృద్ధి మంత్రిత్వ శాఖ అతడికి ఆఫర్ లెటర్ అందజేసి పూర్తి మొత్తాన్ని భరించబోతోంది. 16 నెలల కోర్సు పూర్తయ్యాక అంతర్జాతీయ, స్వచ్ఛంద సంస్థల్లో పని చేస్తూ.. పేదరికం, ఆర్థిక అసమానతలు, సామాజిక రుగ్మతల్ని రూపు మాపేందుకు తనవంతు కృషి చేస్తానంటున్నాడీ కుర్రాడు. - ఇల్లెందుల జయప్రకాశ్, ఈనాడు డిజిటల్, నల్గొండ Tags :