Updated : 14/06/2021 11:55 IST బాబాయి తిరుగుబాటు.. ఒంటరైన చిరాగ్ సంక్షోభంలో లోక్‌జన శక్తి పార్టీ దిల్లీ: బిహార్‌లో లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) సంక్షోభంలో పడింది. ఈ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాత్రికి రాత్రే తిరుగుబావుటా ఎగురవేశారు. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు, యువనేత చిరాగ్ పాసవాన్ లోక్‌సభలో ఒంటరైనట్లయింది. లోక్‌సభలో ఎల్‌జేపీ పార్టీకి ఆరుగురు ఎంపీలు ఉన్నారు. పార్టీ పక్షనేత చిరాగ్ పాసవాన్ కాగా.. ఆయన బాబాయి పశుపతి కుమార్ పరాస్, మరో బంధువు ప్రిన్స్ రాజ్, పార్టీ ఇతర నేతలు చందన్ సింగ్, వీణా దేవి, మెహబూబ్ అలీ కైసర్ లోక్‌సభ సభ్యులుగా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న పశుపతి సహా ఐదుగురు ఎంపీలు తాజాగా తిరుగుబాటు చేశారు. లోక్‌సభలో తమను వేరే బృందంగా గుర్తించాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తమ బృందానికి పశుపతిని నేతగా ఎన్నుకున్నట్లు ఎల్‌జేపీ ఎంపీలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అటు చిరాగ్ పాసవాన్ గానీ.. ఇటు రెబల్ బృందం గానీ ఇంకా స్పందించలేదు. రామ్‌విలాస్ మరణం తర్వాత నుంచే.. కాగా.. ఎల్‌జేపీ పార్టీలో నెలల క్రితమే అంతర్గత విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబరులో చిరాగ్ తండ్రి, ప్రముఖ దళిత నేత రామ్‌విలాస్ పాసవాన్ హఠాణ్మనరణం చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చిరాగ్, పశుపతి మధ్య విభేదాలు వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. రామ్‌విలాస్ చనిపోయిన నాలుగు రోజుల తర్వాత ఓ ప్రకటన విషయమై పశుపతి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన చిరాగ్.. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తానని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఎన్డీయే నుంచి విడిపోవడం, పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో చిరాగ్ ఏకపక్ష నిర్ణయాలతో విభేదాలు మరింత ముదిరాయి. ఈ పరిణామాలను అవమానంగా భావించిన పశుపతి పార్టీ నుంచి విడిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నితీశ్ అండతోనేనా.. మరోవైపు చిరాగ్‌పై తిరుగుబాటు చేస్తోన్న ఐదుగురు ఎంపీలు త్వరలోనే జేడీయూలో చేరొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. పశుపతికి కేంద్రమంత్రి పదవి ఇప్పిస్తానని నితీశ్ హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అప్పట్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాసవాన్ నిర్ణయం నితీశ్ కుమార్‌కు భారీ నష్టం కలిగించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగి ఎల్‌జేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో జేడీయూ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే నితీశ్.. పశుపతికి సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇవీ చదవండి