Updated : 18/06/2021 07:02 IST Cyber Crime: నకిలీ ఎస్సై.. హవాలా ఏజెంట్లు పోలీసులు స్తంభింపజేసిన రూ.305 కోట్లపై కన్ను హైదరాబాద్, బెంగుళూరులో కొట్టేసేందుకు ప్రణాళిక! ఈనాడు, హైదరాబాద్ చైనా రుణయాప్‌ల బ్యాంక్ ఖాతాల్లోంచి రూ.1.18 కోట్లు దారిమళ్లింపు వెనుక భారీ ప్రణాళికే ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. కోల్‌కతాలోని ఐసీఐసీఐ బ్యాంక్‌కు ఎస్సైనంటూ వెళ్లిన నిందితుడు నల్లమోతు అనిల్ కుమార్.. ఒక్కడే ఈ పని చేయలేదని గుర్తించారు. రుణాల యాప్‌ల కేసులో హైదరాబాద్ సహా బెంగళూరు.. దిల్లీ నగరాల్లో చైనా సంస్థలకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోని రూ.305 కోట్ల నగదు విడిపించేందుకు తెరవెనుక కొందరు ఇదంతా చేస్తున్నారని అనుమానిస్తున్నారు. వీరికి ఎక్కడ, ఏ బ్యాంక్ ఖాతాలో ఎంత నగదు ఉందన్న వివరాలన్నీ తెలుసుకునేందుకు రంగంలోని దిగారని భావిస్తున్నారు. అనిల్‌కు సహకరించిన మరో నిందితుడు పట్టుబడితే వీరి కుట్ర బయటపడనుంది. రెండు ప్రత్యేక బృందాలు దిల్లీ, బెంగళూరులో పరిశోధిస్తున్నాయి. 1100 ఖాతాలు.. జైల్లో నిందితులు.. పూచీకత్తు అవసరం లేకుండా రుణాలిస్తామంటూ చైనా కంపెనీలు యాప్‌ల ద్వారా రూ.30వేల కోట్ల లావాదేవీలు నిర్వహించాయి. కాల్‌సెంటర్ల ద్వారా రుణాలిచ్చి అధిక వడ్డీలతో రూ.వేల కోట్లు వసూలు చేసుకున్నాయి. అక్రమాల్లో కీలకంగా వ్యవహరించిన చైనీయుడు ల్యాంబో, కర్నూలు జిల్లావాసి నాగరాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ నగరాల్లో చైనా కంపెనీలకు చెందిన 1124 బ్యాంక్ ఖాతాల్లోని రూ.305 కోట్ల నగదును స్తంభింపజేశారు. ల్యాంబో, నాగరాజులు జైల్లో ఉండడంతో వారితో పాటు చైనా కంపెనీలపై వరుసగా కోర్టులో అభియోగపత్రాలను సమర్పిస్తున్నారు. మరోవైపు ఈ ఖాతాల్లోని నగదును విడుదల చేయించుకునేందుకు భారీ పథకం వేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న సైబర్ నేరస్థుడు అనిల్‌తో ఒప్పందం కుదుర్చుకుని రూ.1.18 కోట్లు విడుదల చేయించారు. దిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్‌లలోని బ్యాంక్ ఖాతాల్లో నగదు విడుదల చేయాలంటూ పోలీస్ అధికారులు రాసినట్టు బ్యాంకులకు లేఖలు రాశారు. ఐదు.. ఇరవై.. వంద మంది... కోల్‌కతాలోని ఐసీఐసీఐ బ్యాంక్‌లోని రూ.1.18 కోట్ల నగదు విడుదల చేయించేందుకు తెరవెనుక వ్యక్తులు ఏప్రిల్ నెలలో పథకం వేశారు. పనిపూర్తి చేస్తే అనిల్‌కు రూ.25 లక్షలు ఇస్తామని ఫోన్‌లో చెప్పారు. ఎస్సైగా వెళ్లాలంటూ వారే సూచించారు. కోల్‌కతాకు విమానంలో వెళ్లాలని, పోలీస్ డ్రస్ కుట్టించుకోవాలని చెప్పి రూ.20 వేలు అతడి బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఏప్రిల్ నాలుగో వారంలో కోల్‌కతాకు వెళ్లిన అనిల్.. అక్కడ బ్యాంక్ అధికారులను బెదిరించి రూ.1.18 కోట్లను విడుదల చేయించి బేగంపేటలో ఉంటున్న ఆనంద్.. బ్యాంక్ ఖాతాలో వేయించాడు. ఆనంద్‌కు రూ.1.50 లక్షలు ఇవ్వగానే.. అతడు అనిల్ సూచించిన బ్యాంక్ ఖాతాల్లోకి రూ.1.18 కోట్ల నగదు బదిలీ చేశాడు. వాటిని ఐదు ఖాతాల్లోకి.. వాటి నుంచి ఇరవై.. ఇరవై నుంచి వంద మంది బ్యాంక్ ఖాతాల్లోని నగదు వెళ్లింది. Tags :