తెలంగాణను నిలువరించండి అక్రమంగా నీళ్లు వాడుకోకుండా చూడండి ఆ నీళ్లను వారి వాటా నుంచి మినహాయించాలి ఉమ్మడి జలాశయాల వద్ద కేంద్ర బలగాలను మోహరించాలి ప్రధానికి ముఖ్యమంత్రి జగన్ లేఖ కేంద్ర జల్‌శక్తి మంత్రి షెకావత్‌కూ మరో లేఖ ఈనాడు, అమరావతి: ‘జలవిద్యుత్తు ఉత్పాదన కోసం అక్రమంగా నీటిని వినియోగించుకోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని నిలువరించండి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి లేకుండా వారు నీటిని వాడుకోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ అక్రమంగా వినియోగించుకుంటున్న నీటిని వారి వాటా 299 టీఎంసీల నుంచి మినహాయించాలి. కేంద్రం వెంటనే కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి నోటిఫై చేయాలి. ఉమ్మడి జలాశయాల్లో నీటిని మళ్లించే చోట కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలను మోహరించి ఏపీ ప్రయోజనాలను కాపాడాలి’ అని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ గురువారం రాత్రి లేఖ రాశారు. అలాంటి మరో లేఖను కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కూ పంపారు. ఆ లేఖల ప్రతులను మీడియాకు విడుదల చేశారు. తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదాల నేపథ్యంలో కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాసిన లేఖల ప్రతులను వాటికి జత చేశారు. ‘తెలంగాణ అనధికారికంగా ఇలా నీటిని వాడుకోవడంవల్ల తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన 4 రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు చెన్నైవాసుల తాగునీటి అవసరాలు తీర్చలేని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి’ అని ఆ లేఖల్లో వివరించారు. లేఖలోని ముఖ్యాంశాలు... * 2014 రాష్ట్ర పునర్‌విభజన చట్టం సెక్షన్ 85 ప్రకారం ఏర్పడిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 66:34 నిష్పత్తిలో పంచుకోవాలని చెప్పింది. ఇలాంటి ఏర్పాట్లు, పద్ధతులు ఉన్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం అనధికారికంగా చేపడుతున్న చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయని మీ దృష్టికి తీసుకొస్తున్నా. * కృష్ణా బోర్డుకు చెప్పకుండానే తెలంగాణ ఎడమ వైపున ఉన్న కేంద్రం నుంచి ఏకపక్షంగా జల విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించింది. దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో ఎలాంటి సాగునీటి అవసరమూ లేకుండానే విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించింది. సాగర్‌లో ఖరీఫ్ అవసరాలకు వినియోగించుకునేందుకు వీలుగా +532.90 అడుగుల వద్ద 173.86 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన సాగునీటి అవసరాలకు నీరు తీసుకున్నప్పుడే జల విద్యుత్తు ఉత్పత్తి చేయాలని గుర్తించాలి. * శ్రీశైలం జలాశయంలో జూన్ 30 నాటికి వచ్చి చేరిన 17.36 టీఎంసీల ప్రవాహాల్లో 6.9 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్తు కోసం అనధికారికంగా వినియోగించుకుంది. శ్రీశైలంలో అవసరమైన నీటిమట్టాలు పెరగకుండా నిరోధించేలా ఈ చర్య ఉంది. * రోజూ తెలంగాణ 2 టీఎంసీల నీటిని జల విద్యుత్తు ఉత్పాదనకు వినియోగిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. శ్రీశైలం జలాశయంలో +854 అడుగుల నీటిమట్టం స్థాయికి నీళ్లు చేరితే తప్ప పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి ఆంధ్రప్రదేశ్ తాగునీరు, సాగునీరు తీసుకోలేదు. తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన నాలుగు రాయలసీమ జిల్లాలకు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు చెన్నై తాగునీటికి నీరు పోతిరెడ్డిపాడు నుంచే ఇవ్వాలి. * తెలంగాణ అనధికారికంగా నీటిని వాడుకుంటున్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ అధికారులు కృష్ణా బోర్డు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేయాలని, దానికోసం శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవద్దని తెలంగాణ జెన్‌కో అధికారులకు కృష్ణా బోర్డు సూచించింది. * ఇంకా అప్పటికీ తెలంగాణ జల విద్యుత్తు ఉత్పత్తి కొనసాగించడంతో మరో రెండుసార్లు కృష్ణాబోర్డుకు లేఖలు రాశాం. * కృష్ణా బోర్డుకు చెప్పకుండా, వారి అనుమతి తీసుకోకుండా, నీటిని వినియోగించుకునేందుకు ఉన్న విధివిధానాలను పట్టించుకోకుండా తెలంగాణ నాగార్జునసాగర్‌లోనూ జలవిద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించింది. విద్యుత్తు ఉత్పత్తికి అనధికారికంగా, యథేచ్ఛగా 30,400 క్యూసెక్కుల నీటిని వాడేస్తున్నారు. * తెలంగాణ జూన్ 29 రాత్రి నుంచి పులిచింతల ప్రాజెక్టులో జలవిద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించింది. 4,000 క్యూసెక్కులు ఇందుకోసం వినియోగిస్తోంది. ఇందుకు కృష్ణా బోర్డు నుంచి ఎలాంటి నీటి విడుదల ఉత్తర్వులూ తీసుకోలేదు. విజయవాడ జల వనరులశాఖ ఎస్‌ఈ నీటిని విడుదల చేయాలంటూ ఎలాంటి వినతులూ సమర్పించలేదు. ఈ విషయాన్నీ జూన్ 30న కృష్ణా బోర్డు దృష్టికి తీసుకువెళ్లాం. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి 3.07 టీఎంసీల పూర్తి నీటినిల్వతో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇలా అనధికారికంగా నీటిని విద్యుత్తు ఉత్పత్తికి వినియోగించి దిగువకు వదలడం వల్ల ప్రకాశం బ్యారేజి నుంచి ఎంతో విలువైన నీటిని వృధాగా సముద్రంలోకి వదిలివేయాల్సి ఉంటుంది. * మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్తు ఉత్పాదన ప్రారంభించాలంటూ అక్కడి జెన్‌కో అధికారులను ఆదేశిస్తూ జూన్ 28న జీవో ఆర్‌టీ నంబరు 34ను విడుదల చేసింది. దీని ప్రకారం శ్రీశైలం నుంచి 4 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 3 టీఎంసీలు, పులిచింతల నుంచి 1.80 టీఎంసీలు అనధికారికంగా వినియోగించుకుంటారని అర్థమవుతోంది. జలవిద్యుత్తు ఉత్పాదన నిలిపివేయాలన్న కృష్ణాబోర్డు ఆదేశాలను ఇది పూర్తిగా ఉల్లంఘించడమే. * కృష్ణాబోర్డు జలవిద్యుత్తు ఉత్పత్తి చేయవద్దని ఆదేశించినా తెలంగాణ రాష్ట్రం నీటిని వాడుకోవడం ఒప్పందాలను, జలనిర్వహణకు ఏర్పాటుచేసుకున్న నిర్దిష్ట ప్రామాణిక సూత్రాలను ఉల్లంఘించినట్లే. తెలంగాణ అనుసరిస్తున్న ఈ విధానాలు అంతర్రాష్ట్ర సత్సంబంధాలకు ఏ రకంగానూ తోడ్పడవు. అంతేకాదు.. దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీస్తాయి. * 2014 రాష్ట్ర పునర్‌విభజన చట్టం సెక్షన్ 85 ప్రకారం కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏర్పడింది. కేంద్రం నోటిఫై చేసిన ప్రకారం ఈ నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో జలాల నియంత్రణ, ప్రాజెక్టుల నిర్వహణ, పాలానాపరమైన అంశాలను బోర్డే చూసుకోవాలి. బోర్డు అధికారాలు, విధులను నోటిఫై చేసే కసరత్తును కేంద్రం ఇంకా పూర్తి చేయలేదు. ఈలోపు మధ్యంతర ఏర్పాట్లు జరిగాయి. ఇందులో భాగంగా శ్రీశైలం, పులిచింతల, ప్రకాశం బ్యారేజిలను ఆంధ్రప్రదేశ్.. జూరాల, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను తెలంగాణ పరిధిలోకి తీసుకొచ్చారు. విద్యుత్తు కేంద్రాలు ఆయా రాష్ట్రాల భౌగోళిక ప్రాంతంలోనే ఉన్నందున ఆయా రాష్ట్రాలు వాటి నిర్వహణ బాధ్యతలు చూసుకునేలా ఏర్పాట్లు జరిగాయి. * కేంద్ర జలవనరులశాఖ అదనపు కార్యదర్శి ఛైర్మన్‌గా నిర్వహించిన సమావేశంలో 2015 జూన్ 18, 19 తేదీల్లో దిల్లీలో రెండు రాష్ట్రాల నీటి వాటాల వినియోగానికి ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రైబ్యునల్ 71% విశ్వసనీయతతో కేటాయించిన 811 టీఎంసీలు రెండు రాష్ట్రాలూ ఎలా వినియోగించుకోవాలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ప్రకారం తెలంగాణ 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు వినియోగించుకోవాలి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఆ నీటిని 66:34 నిష్పత్తిలో పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో చిన్ననీటి వనరుల వినియోగం, నీటి ఆవిరి నష్టాలు, గోదావరి నుంచి మళ్లించిన నీటి లెక్కలు పరిగణనలోకి తీసుకోకుండా 811 టీఎంసీలు ఈ నిష్పత్తిలో వినియోగించుకోవాలని ఒప్పందానికి వచ్చాయి. * తదుపరి ఈ నీటి వినియోగానికి వీలుగా నిర్ణయాలు తీసుకునేందుకు అమలు ప్రక్రియకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఉంటారు. రెండు రాష్ట్రాలు తమకు ఎంత నీరు అవసరమో ప్రతిపాదిస్తే (ఇండెంటు పెడితే) నీటి లభ్యతను ఆధారంగా చేసుకుని చర్చించుకుని ఈ త్రిసభ్య కమిటీ కృష్ణా బోర్డుకు సిఫార్సు చేస్తే అక్కడ నిర్ణయం జరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ కృష్ణా బోర్డు నిర్ణయాన్ని ఆయా ప్రాజెక్టుల అధికారులు అమలు చేయాల్సి ఉంటుంది. Tags :