Published : 17/07/2021 02:16 IST భారత్ × పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్‌లో ఒకే గ్రూప్‌లో దాయాది జట్లు అక్టోబరు 17న మెగా టోర్నీ ఆరంభం దుబాయ్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్‌లో దాయాదుల పోరుకు యూఏఈ వేదికగా నిలవనుంది. పొట్టి కప్పులో భారత్, పాక్‌లు ఒకే గ్రూపులో ఉన్నట్లు శుక్రవారం ఐసీసీ ప్రకటించింది. ర్యాంకింగ్స్ ఆధారంగా జట్లను విభజించినట్లు పేర్కొంది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు యూఏఈ, ఒమన్‌లో మెగా టోర్నీ జరుగనుంది. పూర్తి షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్‌లకు చోటు దక్కింది. గ్రూప్-1లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌లు ఉన్నాయి. సూపర్-12కు ముందు తొలి రౌండ్లో గ్రూప్-ఎ, బిలోని జట్లు తలపడతాయి. ఈ రెండు గ్రూపుల్లోని విజేతలు, రన్నరప్ జట్లు సూపర్-12కు అర్హత సాధిస్తాయి. సూపర్-12లోని రెండు గ్రూపుల్లో ప్రతి జట్టు మిగతా అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ‘‘ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం వేదికల్లో ఒమన్‌ను చేర్చడం మంచి పరిణామం. అక్కడ యువతలో క్రికెట్‌పై ఆసక్తి పెరగడానికి ప్రపంచకప్ ఎంతగానో ఉపయోగపడుతుంది’’ అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. తొలి రౌండ్ గ్రూప్-ఎ: శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా గ్రూప్-బి: బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ సూపర్ 12 గూప్-1: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఎ1, బి2; గ్రూప్-2: భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, ఎ2, బి1 Tags :