ఆటల పండగ నేడే ఆరంభం ఒలింపిక్స్‌కు టోక్యో సిద్ధం భారత్ నుంచి 120 మంది టోక్యో ఒలింపిక్స్ వచ్చేశాయి. జపాన్ జాతీయ స్టేడియంలో శుక్రవారం ఈ విశ్వ క్రీడల ఆరంభోత్సవం జరగనుంది. కరోనా మహమ్మారి కారణంగా ఏడాది పాటు ఆలస్యంగా.. అయిదేళ్ల విరామం తర్వాత అభిమానులను అలరించేందుకు ఈ మెగా క్రీడలు వచ్చేశాయి. 206 దేశాల నుంచి 11,300 మంది అథ్లెట్లు పోటీపడనున్నారు. అది 1964.. జపాన్ జాతీయ స్టేడియం.. 19 ఏళ్ల కుర్రాడు సకాయ్ ఒలింపిక్ జ్యోతి పట్టుకుని స్టేడియంలోకి రాగానే ఒక్కసారిగా పది వేల బెలూన్లు ఆకాశానికి ఎగిరాయి. శాంతి కపోతాలు విహరించాయి. అప్పటివరకూ చరిత్రలోనే కనీవినీ ఎరుగని అత్యధిక వ్యయంతో జపాన్ ఆ క్రీడలను నిర్వహించింది. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు దాడులు మిగిల్చిన చేదు జ్ఞాపకాలను తుడిచేస్తూ.. బలంగా నిలబడ్డ దేశం తాను సాధించిన అభివృద్ధిని, ప్రపంచ శాంతి దిశగా తమ ఉద్దేశాన్ని చాటేలా ఆసియాలోనే తొలిసారి జరిగిన ఆ ఒలింపిక్స్‌ను జపాన్ ఘనంగా ముగించింది. ప్రస్తుతం 2021.. కరోనాతో ప్రపంచం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. మహమ్మారి ధాటికి చీకటి అలుముకుంది. మళ్లీ ఇప్పుడు ఒలింపిక్స్ నిర్వహణతో ప్రపంచానికి సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని అందించడంతో పాటు వైరస్‌పై విజయం సాధించగలమనే వెలుగును నింపేందుకు జపాన్ సిద్ధమైంది. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా.. సొంత ప్రజల నుంచే విమర్శలు వస్తున్నా.. ఇప్పటికే ఏడాది పాటు వాయిదా పడ్డ ఒలింపిక్స్‌ను ఎలాగైనా నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న ఆ దేశం.. శుక్రవారం టోక్యో క్రీడలను ఆరంభించి మరోసారి తన సంకల్ప బలాన్ని చాటేందుకు సిద్ధమైంది. తెలుగు తేజాలు.. ఈ ఒలింపిక్స్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు క్రీడాకారులు ప్రాతినిథ్యం వహించనున్నారు. బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు, సాయి ప్రణీత్, సాత్విక్, టెన్నిస్‌లో సానియా మీర్జా పతకం కోసం పోరాడనున్నారు. గత ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధుపై ఈ సారి భారీ అంచనాలున్నాయి. Tags :