Jul 29,2021 07:17 ప్రజాశక్తి-అమరావతి : విశాఖ ఉక్కును నూరుశాతం ప్రైవేటీకరించడం ఖాయమని కేంద్రప్రభుత్వం తెలిపింది. హైకోర్టులో బుధవారం దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌లో ఈ విషయం స్పష్టం చేసింది. 'ఇది విధాన నిర్ణయం. కోర్టుల జోక్యానికి వీలు లేదు. పెట్టుబడుల ఉపసంహరణ సరైందో కాదో తేల్చే అధికారం కోర్టులకు లేదు. అదే సమయంలో రిజర్వేషన్లు ప్రాధమిక హక్కు కాదు. రాజ్యాంగబద్దంగా తప్పనిసరి కాదు. ఉద్యోగులు వాటికోసం పట్టుబట్టడానికి వీలులేదు. కొత్త యాజమాన్యం చెప్పినట్టు విధులు నిర్వహించాలి.' అనికేంద్ర ఆర్థికశాఖలో భాగమైన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపం) అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌లో తెలిపారు. విశాఖ స్టీల్స్‌లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర మంత్రివర్గం గత జనవరి 27న సూత్రప్రాయం ఆమోదం తెలిపిందని పేర్కొంది. యాజమాన్యం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా ఉన్నప్పుడు వాటిని ఉద్యోగులు అమలు చేసి తీరాలని కేంద్రం పేర్కొంది. 'పలు దఫాలుగా చర్చలు చేశాకే ప్రణాళికాబద్ధంగానే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కమిటలో ప్రధాని, హౌం, ఉక్కు, ఆర్థిక, సహజ వాయువులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖల మంత్రులు ఉన్నారు. ఇది విధాన నిర్ణయం. దీనిపై కోర్టుల జోక్యానికి ఆస్కారం లేదు. పెట్టుబడుల ఉపసంహరణ సరైనదో కాదో కోర్టులకు తేల్చే అధికారం లేదు. ఇందుకు అనుగుణంగా బాల్కో కేసులో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది.' అని ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. 'ఈ నిర్ణయంలో సంక్లిష్టమైన ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయి. ఆర్థిక అంశాలతో కూడిన విషయంలో కోర్టులకు జోక్యం చేసుకునే పరిధి లేదు. ప్రభుత్వ నిర్ణయం దురుద్దేశపూర్వకంగా, వివక్షాపూరితమైనప్పుడే కోర్టులు జోక్యానికి వీలుంది.' అని రిట్‌లో తెలిపింది. 'ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దాని సిఫార్సుల్ని అమలు చేసే బాధ్యత నీతిఆయోగ్‌పై ఉంది. వ్యూహాత్మక రంగాల కంపెనీలను ఉంచుకుని మిగిలిన వాటిని ప్రైవేటీకరణ, విలీనం, మూసివేయడం వంటి నిర్ణయాలను కేంద్రం తీసుకుంది. న్యూ పబ్లిక్ సెక్టర్ పాలసీ లో ఐరన్, స్టీల్ రంగాలు వ్యూహాత్మక రంగంలోకి రావు. అందుకే అమ్మేయాలని కేంద్రం నిర్ణయించింది.' అని వివరించింది. విశాఖ ఉక్కు కర్మాగారం విశాఖలోనే ఉంటుంది. ప్రైవేటీకరణ చేసినా అక్కడి నుంచే కొత్త యాజమాన్యం పనిచేస్తుంది.అని తెలిపింది. 'ఉక్కు కర్మాగారాన్ని అమ్మేయాలనే కేంద్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిల్ వేసిన సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణకు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే పిల్ వేశారు.. రాజకీయ ఎజెండాతో వేసిన పిల్‌కు విచారణ అర్హత లేదు కాబట్టి కొట్టేయాలి.' అని కౌంటర్‌లో కేంద్రం హైకోర్టును కోరింది. ఈ పిల్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతత్వంలోని డివిజన్ బెంచ్ విచారిస్తోంది. తాజా వార్తలు