ఇంటి లోపల మెట్లు ఉండొచ్చా?
ఈనాడు, హైదరాబాద్
ఇళ్ల స్థలాల ధరలు పైపైకి ఎగబాకడంతో తక్కువ విస్తీర్ణంలోనే సొంతింటి నిర్మాణానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. వంద అంతకంటే తక్కువ చదరపు గజాల్లోనే ఇంటి నిర్మాణమంటే ఒకింత సవాలే. మెట్ల నిర్మాణంలోనే ఎక్కువమంది సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇవి ఏ దిక్కున ఉండాలి? మెట్లు ఎక్కడం, దిగడంలోనూ నియమాలు ఉన్నాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది.. అని వివరిస్తున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు పెంటపాటి.
సాధారణంగా మనకు ఎక్కువగా మూడు రకాల మెట్ల నిర్మాణాలు కనిపిస్తుంటాయి. స్థల లభ్యతను బట్టి ఇంజినీర్లు నిర్మాణ ప్రణాళిక రూపొందిస్తారు.
* ఇంటి వెడల్పు తక్కువగా, పొడవు ఎక్కువగా ఉన్నప్పుడు కింది నుంచి పైఅంతస్తు వరకు నిలువుగా మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కేటప్పుడు కాస్త ఆయాసం వస్తుంది. కాస్తంత అసౌకర్యంగానూ ఉంటుంది. మధ్యలో ల్యాండింగ్ ఉండేలా చూసుకోవాలి.
* సగం మెట్లు ఒకవైపు..రెండోసగం మరోవైపు ఉండే మెట్లలో మధ్యలో ల్యాండింగ్ ఉంటుంది. ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అలసట లేకుండా సౌకర్యంగా ఉంటాయి. ఎక్కువ మంది వీటినే ఇష్టపడతారు.
* మరోరకం గుండ్రంగా తిరుగుతూ పై అంతస్తుకు వెళ్లడం. ఇలాంటి మెట్లు చాలా తక్కువ స్థలం ఉన్నప్పుడు మాత్రమే నిర్మించుకోవాలి. స్థల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి.
ఏ దిశలో ?
ఇంటి దిక్కును బట్టి మెట్లు ఏర్పాటు చేసుకోవాలి.
* తూర్పు దిశకు ఇల్లు ఉంటే మెట్లు తూర్పు ఆగ్నేయ మూలలో ఉండాలి.
* ఇల్లు పడమరలో ఉంటే పడమర నైరుతిలోనూ.. ఉత్తరంలో ఉంటే ఉత్తర వాయువ్యంలో ఉండాలి.
* దక్షిణం దిక్కున ఇల్లు ఉంటే దక్షిణ నైరుతిలో మెట్లు ఉండాలి.
* ఎలాంటి పరిస్థితుల్లోనూ తూర్పు ఈశాన్యంలో, ఉత్తర ఈశాన్యంలో మెట్లు కట్టడం శాస్త్రపరంగానూ, ఇతర అవసరాల దృష్ట్యా సమ్మతం కాదు.
డ్యూప్లెక్స్‌లో ఎలా?
వాస్తు ప్రకారం డ్యూప్లెక్స్ ఇంటిలో మెట్ల నిర్మాణం సాధ్యమే. హాలు నుంచి పైఅంతస్తుకు వెళ్లేందుకు వీలుగా వీటి ఏర్పాటుతో ఎలాంటి దోషం లేదు. వాస్తవానికి ఇంటికి సంబంధించిన ప్రతీ అంశం వివరంగా ఉండదు. శాస్త్రంలో చెప్పిన మూల సూత్రాలను విస్మరించకుండా అందుబాటులో ఉన్న స్థల అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు. సొంతిల్లు అనగానే బంధువులు, అతిథులు, స్నేహితుల రాకపోకలు ఉంటాయి. ఇలా ఎందరో ఇంటికి వచ్చేవారి అవసరాలు తీరేలా ఉండాలి. అందంగానూ, ఇదొక అదనపు అకర్షణగా ఉండేలా మెట్ల భాగాన్ని తీర్చిదిద్దుకుంటే సరే.
ఎక్కడం, దిగడంలోనూ నియమాలా?
మెట్ల మార్గంలో కింది నుంచి పైఅంతస్తుకు... తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు నడవాలి. దిగేటప్పుడు తూర్పు, ఉత్తరం వైపు అడుగులు వేయాలి. ఇది శుభప్రదంగా జయప్రదంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కచ్చితంగా ఇలా అని చెప్పలేం కానీ ఉన్నంత వరకు ఇది ఆచరణీయం.
సౌకర్యం ప్రధానం..
శాస్త్ర ప్రకారం మెట్లు ఇంటి బయట ఏర్పాటు చేసుకున్నా.. లోపల ఏర్పాటు చేసుకున్నా ఎలాంటి అభ్యంతరం ఉండదు. సౌకర్యం, భద్రత ప్రధానం.
* పెద్ద ఇల్లయితే కింద ఉన్నవారికి పైఅంతస్తుకు వెళ్లేవారితో ఎలాంటి అసౌకర్యం కలగకూడదు. మెట్ల నిర్మాణంలో ఇదే ప్రధానమైంది.
* ఇంటి లోపల నుంచి, బయటి నుంచి పైఅంతస్తులకు వెళ్లేలా మెట్ల ఏర్పాటు మరింత సౌకర్యంగా ఉంటుంది.
Tags :