Published : 04/08/2021 13:01 IST
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
1. Lovlina BORGOHAIN: లవ్లీనా ‘కంచు’ పంచ్.. పతకం గెలిచిన మూడో బాక్సర్‌గా చరిత్ర
లవ్లీనా బొర్గొహెయిన్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా అవతరించింది. ‘మాగ్నిఫిసెంట్ మేరీ’ తర్వాత పతకం ముద్దాడుతున్న రెండో మహిళగా ఘనకీర్తిని అందుకుంది. టోక్యో క్రీడల్లో ఆమెకు దక్కింది కాంస్యమే అయినా అది స్వర్ణంతో సమానమే! ఎందుకంటే భారత బాక్సింగ్‌కు 9 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆమె తొలి పతకం అందిస్తోంది. అంతేకాదు.. అరంగేట్రం మెగా క్రీడల్లోనే పోడియంపై నిలబడిన బాక్సర్‌గా దేశానికి వన్నె తెచ్చింది.
*
2. సమాచారం లీక్.. ఏపీ ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్
ఏపీ ఆర్థికశాఖలోని ముగ్గురు ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇద్దరు సెక్షన్ అధికారులు, సహాయ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆర్థికశాఖలో సెక్షన్ అధికారులుగా పనిచేస్తున్న డి.శ్రీనుబాబు, కె.వరప్రసాద్, సహాయ కార్యదర్శి నాగులపాటి వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి షంషేర్‌సింగ్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థికశాఖలోని సమాచారం లీక్ చేస్తున్నారనే అభియోగంపై ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది.
3. Krishna Water Issue: ఏపీ పిటిషన్ మరో ధర్మాసనానికి బదిలీ
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మరో ధర్మాసనానికి బదిలీ అయింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో న్యాయపరమైన పరిష్కారం కోరుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు తెలిపారు. సీజేఐ ధర్మాసనమే విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు.
*
4. Rahul Gandhi: శ్మశానంలో చిన్నారిపై హత్యాచారం.. న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానన్న రాహుల్
దేశ రాజధానిలో అత్యాచారం, హత్యకు గురైన 9 ఏళ్ల దళిత చిన్నారి కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పరామర్శించారు. ఈ ఘటనలో న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దిల్లీలోని పాత నంగల్ గ్రామంలోని ఓ శ్మశానంలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించిన ఓ బాలికను తల్లిదండ్రుల అనుమతి లేకుండా హడావుడిగా దహనం చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. తమ బిడ్డపై కాటికాపారి అత్యాచారం చేసి చంపారని ఆమె తల్లి ఫిర్యాదు చేసింది.
5. Chithra: ఇళయరాజా అలా అనేసరికి నాకు ఏడుపు ఆగలేదు!
దక్షిణ భారత సంగీత ప్రపంచంలో ఆమె ఓ స్వర శిఖరం. సంగీత ప్రియుల హృదయాలలో ఆమె పాటలు కలకాలం పదిలం. పాడే పాట ఏదైనా, పలికే భావం ఏదైనా సుస్పష్టమైన ఉచ్చారణతో, అత్యద్భుతమైన గాత్ర నైపుణ్యంతో అనేక భాషల్లో 20వేలకు పైగా పాటలపై తన గాత్ర సంతకాన్ని చేశారు. ఆమే లివింగ్ లెజెండ్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ ఆఫ్ పద్మ భూషణ్ కె.ఎస్.చిత్ర. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు.
6. Harpoon missile: భారత్‌కు హార్పూన్ క్షిపణి వ్యవస్థ సరఫరా: అమెరికా సమ్మతి
ప్రపంచంలోనే అత్యుత్తమ నౌకా విధ్వంసక క్షిపణి ‘హార్పూన్’కు సంబంధించిన పూర్తిస్థాయి వ్యవస్థను భారత్‌కు విక్రయించడానికి అమెరికా పచ్చజెండా ఊపింది. దీని విలువ 8.2 కోట్ల డాలర్లు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని అమెరికా రక్షణశాఖ పేర్కొంది. అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రధాన రక్షణ భాగస్వామిగా ఉన్న భారత రక్షణ సామర్థ్యం మెరుగుపడుతుందని వివరించింది.
7. Financial Planning: 30 ఏళ్లు వచ్చేసరికి ఈ ఆర్థిక లక్ష్యాలు సాధించాలి!
వయసు పెరుగుతున్న కొద్దీ జీవన స్థితిగతులు మారుతుంటాయి. కొత్త బాధ్యతలు వచ్చి చేరతాయి. వీటికి అనుగుణంగా మన ఆర్థిక లక్ష్యాలూ మారుతుంటాయి. అయితే, మన పునాదులు బలంగా ఉంటే జీవనం సక్రమంగా సాగిపోతుంది. లేదంటే ఒడుదొడుకులు తప్పవు. ఈ నేపథ్యంలో మనం సంపాదించడం ప్రారంభించగానే సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలి. అందు కోసం 30 ఏళ్లు వచ్చే సరికి కొన్ని ఆర్థిక లక్ష్యాలను సాధించాలి. అవేంటో చూద్దాం..
8. Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్ మంజూరు
మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమకు బెయిల్ మంజూరైంది. కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తనపై కావాలనే అక్రమంగా కేసులు పెట్టారంటూ దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. వాదనలు ముగిసిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
9. PV Sindhu: పీవీ సింధు కోచ్ ఓ హీరో : కేంద్రమంత్రి రిజిజు
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి స్వదేశానికి చేరుకున్న భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది. నిన్న మధ్యాహ్నం దిల్లీ చేరుకున్న సింధు, ఆమె కోచ్ పార్క్‌ను.. పలువురు కేంద్రమంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా కోచ్ పార్క్‌పై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌లో హీరో అయ్యారంటూ కొనియాడారు.
*
10. India Corona: తగ్గినట్టే తగ్గి.. భారీగా పెరిగిన కొత్త కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు మరోసారి భారీగా పెరిగాయి. ముందురోజు తగ్గినట్టే తగ్గి.. ఒక్కసారిగా 40శాతం మేర పెరిగాయి. అంతకుముందు రోజు 30,549 కేసులు నమోదు కాగా.. తాజాగా 42 వేలకుపైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. మృతుల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించింది. నిన్న 500కిపైగా మరణాలు సంభవించాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.