అడయారు అమ్మ! నెల్లూరు నుంచి వచ్చిన లక్ష్మి ఆసుపత్రిలో బెంచిపై కూర్చుంది. క్యాన్సర్ అని చెప్పి డాక్టర్ ఆమెను అక్కడకు పంపించారు. ఇంతలో ఓ వృద్ధురాలు కారిడార్‌లోకి వస్తోంది. అందరూ చేతులు జోడించి లేచి నిలబడ్డారు. లక్ష్మి కూడా నుంచుంది. నవ్వుతూ దేవతలా ఉన్న ఆమె... డాక్టర్ వి శాంత. లక్ష్మి తన అనారోగ్యం గురించి ఆమెకు చెప్పింది. ‘భయపడకు... అంతా తగ్గిపోతుంది. ధైర్యంగా ఉండు. డబ్బుల్లేవని బాధపడకు. చికిత్స అయ్యేవరకు ఇక్కడే ఉండి ఇంటికి వెళుదువుగాని’ అని ఎంతో మృదువుగా చెప్పిన ఆ డాక్టరమ్మ మాటతో లక్ష్మికి మరో జన్మవచ్చినట్లయింది. ఇలాంటి కథలు ఆ ఆసుపత్రి ప్రాంగణంలో ఎన్నెన్నో. తమిళ, కన్నడ, తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ సోకిన ఎందరో పేదలకు అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ దేవాలయం అయితే, దాన్ని ఇంతింతై... అన్నట్లుగా అభివృద్ధి చేసి, అధునాతనంగా మార్చి ఎంతో మంది ఇళ్లలో దీపం పెట్టింది 93ఏళ్ల డాక్టర్ శాంత. ఆమె భౌతికంగా లేకున్నా ఎంతో మంది ముఖాలపై చిరునవ్వుగా మిగిలింది... డాక్టర్ శాంత అవివాహితగానే ఉన్నారు. ఈమె అందించిన సేవలకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, రామన్ మెగసేసె వంటి అత్యున్నత పురస్కారాలు ఆమెను వరించాయి. డెబ్భై ఏళ్ల క్రితంనాటి మాట... 23 ఏళ్ల శాంత మద్రాసు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అప్పట్లో మహిళలు వైద్యవృత్తిలోకి అడుగుపెట్టడమే అరుదు. వచ్చినా గైనకాలజీ వంటి విభాగాలకే పరిమితం. అలాంటి సమయంలో తాను ఆంకాలజీ ఎంచుకున్నారామె. క్యాన్సర్ వ్యాధి వస్తే ఇక బతుకులేదని భావించే కాలమది. వైద్యం చేసేవారూ అరుదు కావడంతో ఆ వ్యాధిపై ఎన్నో అపోహలు. విదేశాల్లో అయితే మెరుగైన వైద్య సౌకర్యాలున్నాయి. కానీ ఆ వ్యాధి ఏంటో కూడా తెలియకుండానే కన్నుమూసే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఇక్కడ ఎంతోమంది, వారికి సేవలందించాలని నిర్ణయించుకున్నారామె. ఆమె నిర్ణయాన్ని మొదట ఇంట్లో వారంతా వ్యతిరేకించారు. శాంత మాత్రం ధైర్యంగా ముందడుగు వేశారు. ఆ రోజుల్లో క్యాన్సర్ స్పెషలిస్టులకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉండేది. శాంతకు కూడా అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. అయినా ఆమె తన నిర్ణయానికే కట్టుబడ్డారు. ఇక్కడే ఉండిపోయారు. చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో విధుల్లో చేరారు. అప్పుడు అది కేవలం వైద్యశాల మాత్రమే. 12 పడకలుండేవి. అక్కడ శాంతతోపాటు మరో డాక్టర్, ఇద్దరు నర్సులు మాత్రమే ఉండేవారు. కానీ అక్కడకు వైద్యం కోసం చాలా మంది వస్తుండేవారు. వారికి ఈ కొద్దిమందే సేవలు అందిస్తుండేవారు. దీంతో డాక్టర్ శాంత ఆసుపత్రి ప్రాంగణంలోని ఓ గదిలోకి మారిపోయారు. ఇరవై నాలుగ్గంటలూ రోగులకు వైద్యం అందించేవారు. అత్యంత నిరాడంబర జీవితాన్ని గడిపేవారామె. ఆ తరువాతే నెలకు 200 రూపాయల జీతాన్ని ఆసుపత్రి ఈమెకు అందించడం మొదలుపెట్టింది. తర్వాత ఆసుపత్రి విస్తరణకు తీవ్రంగా కష్టపడ్డారు. ఈ 70 ఏళ్లలో ఈ ఆసుపత్రి సేవలు, పరిశోధనలు... ఇలా అన్ని రకాలుగా విస్తరించింది. 1982లో ప్రభుత్వపరంగా అనుమతిని పొంది అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో ఆంకలాజిక్ సైన్సెస్‌పై ప్రత్యేక కోర్సును ప్రారంభించి దేశంలోనే తొలి అడుగు వేశారు. ఈ వ్యాధిని గుర్తించడం నుంచి చికిత్సనందించేవరకు పరిశోధనా విధానాలను అభివృద్ధి చేశారు. అలాగే చికిత్సా విధానాలనూ పెంచారు. నోటి, గొంతు, గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్లపై అధ్యయనం, పరిశోధన చేపట్టడానికి అత్యున్నత సౌకర్యాలున్న పరిశోధనాశాలల నిర్మాణం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపడుతూ, ఏయే ప్రాంతాల్లో ఏ రకమైన క్యాన్సర్ వ్యాధులున్నాయో గుర్తించి అక్కడ సేవలందిస్తున్నారు. ఇప్పుడు ఇనిస్టిట్యూట్‌లో 650 పడకలున్నాయి. రోజూ వందలాదిమంది క్యాన్సర్ బాధితులు ఈ ఆసుపత్రి వాకిట్లో అడుగుపెడతారు. అంతేమంది చికిత్స పొంది చిరునవ్వుతో వెనుదిరుగుతారు. ‘‘క్యాన్సర్ వస్తే ఇక మరణమే అనుకోవడం తప్పు. ఇది కూడా ఓ రకమైన అనారోగ్యమే అనేవారీమె. వైద్యంతో పాటు మానసిక ధైర్యం తోడుంటే దీన్ని కచ్చితంగా జయించగలమని చెప్పేవారు. రోగుల్లో తమకేమీ కాదనే నమ్మకాన్ని కలిగించేవారామె. ఆమె ఇచ్చిన ధైర్యంతో, చేసిన వైద్యంతో కోలుకున్నవారు వేలల్లో ఉంటారు. వ్యాధి దశను గుర్తించడంలో ఈమెకు ఈమే సాటి. ఎందరో వైద్యులు ఈమె అనుభవాలను పాఠాలుగా నేర్చుకున్నారు. జీవితం ఎంతో విలువైంది. నిమిషం కూడా వృథా చేయకూడదు. వేకువజామున నాలుగుగంటలకు నా రోజు మొదలవుతుంది. అవసరమైతే అర్ధరాత్రి కూడా విధులకు సిద్ధంగా ఉంటా. వైద్యవృత్తి అంటే అంకితభావంతో చేయాలి. ప్రస్తుతం వచ్చే ఆధునిక చికిత్సా విధానాలతో మరికొంత మంది ప్రాణాలను కాపాడే అవకాశం వైద్యులకు ఉంది. దాన్ని నెరవేర్చితే చాలు.’’ - డాక్టర్ వి. శాంత Tags :