...ప్రతి అడుగూ కష్టమైంది! అది ఫిబ్రవరి ఏడోతేదీ అర్ధరాత్రి. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా జోషిమఠ్ ప్రాంతం. కొన్ని గంటల క్రితం అక్కడ మరణమృదంగం మోగించిన ధౌలీగంగ నది ఏమీ ఎరగనట్టు ప్రశాంతంగా ఉంది. పక్కనే జలవిద్యుత్తుకేంద్రం సొరంగం వద్ద ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) దళాలు ముమ్మరంగా సహాయచర్యలు చేపడుతున్నాయి. ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించారు డీఐజీ అపర్ణాకుమార్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతశిఖరాలను అధిరోహించిన తొలి మహిళా పోలీసుగా నిలిచారు. ప్రకృతి విపత్తుల్లో పలు కష్టతరమైన ఆపరేషన్స్‌కు సారథ్యం వహించారు. ఈ అనుభవంతో ఉత్తరాఖండ్ ఆపరేషన్‌లో ఎందరినో కాపాడిన అపర్ణ తన అనుభవాలను ‘వసుంధర’తో పంచుకున్నారు. ఈ నెల ఏడోతేదీ ఉత్తరాఖండ్‌లో జరిగిన జల విలయం గురించి ఉదయం 10 గంటల తర్వాత వెలుగులోకి వచ్చింది. గంటలోపే సహాయక చర్యల్లో పాల్గొనాలని మాకు సమాచారం అందింది. వెంటనే చమోలీ జిల్లాకు రెండు బెటాలియన్స్‌ను రెస్క్యూ ఆపరేషన్ కోసం రుషిగంగ, తపోవన్ ప్రాంతాలకు పంపించా. అరగంటలోపే వారంతా హెలీకాప్టర్ ద్వారా అక్కడికి చేరుకున్నారు. అతి తక్కువ సమయంలోనే అక్కడివారికి చేయూతనందించడానికి మా బృందం సిద్ధమైంది. దెెహ్రాదూన్ నుంచి బయలుదేరి నేనూ అక్కడికి చేరుకున్నా. 12 మంది... మా మౌంటెనీరింగ్ టీం జోషిమఠ్ నదీ తీరప్రాంతంలో ప్రాణాపాయంలో ఉన్న కొందరిని గుర్తించి రక్షించగలిగింది. రుషిగంగ హైడ్రోప్రాజెక్టు వద్ద స్థానికులతో మాట్లాడి, ఏ ప్రాంతంలో బాధితులు చిక్కుకుని ఉంటారని అడిగా. సిల్ట్ ఫ్లషింగ్ టన్నెల్ (ఎస్‌ఎఫ్‌టీ) వద్ద అని అన్నారంతా. అక్కడ పెద్దపెద్ద బండరాళ్లు, మధ్యలో బురద, మంచు అన్నీ కలిసి కూరుకుపోయి ఉన్నాయి. మా టీమ్ సాయంతో మౌంటెనీరింగ్ ఎక్విప్‌మెంట్‌ను తెప్పించి ఆ రాళ్లను పగలగొట్టించా. అక్కడ ప్రాణాలతో ఎవరైనా ఉంటే వారిని రక్షించాలనేదే మా లక్ష్యం. అలా 20 మీటర్ల లోతు వరకు మట్టిని తొలగించాక లోపల ఎవరో ఉన్నట్లు గుర్తించాం. తాళ్లు వేసి మట్టి అడుగుభాగాన ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్న 12 మందిని బయటకు లాగాం. వారిని జోషిమఠ్ ఆసుపత్రికి తరలించాం. వీరిలో శ్రీశైలానికి చెందిన 45 ఏళ్ల జియాలజిస్ట్ కూడా ఉన్నారు. మరోవైపు..: తపోవన్ ఎన్‌టీపీసీ టన్నెల్ సమీపంలోని గ్యారేజ్ దగ్గర 30 మీటర్ల దూరం బురద, మట్టి, మంచు పేరుకుపోయాయి. రెండున్నర కిలోమీటర్ల పొడవుండే ఆ టన్నెల్‌లో 39 మంది చిక్కుకున్నట్లు సమాచారం అందింది. అక్కడ చిక్కుకున్న వారిని రక్షించడం అత్యంత సవాల్‌గా మారింది. గంటల సమయం పట్టింది. ప్రతి అడుగూ కష్టమైంది. కనీసం నిలబడలేని ఆ ప్రాంతంలో ఎలాగో మా టీం సభ్యులు కొంతదూరం మాత్రమే వెళ్లగలిగారు. అందులో చిక్కుకున్నవారిని ప్రాణాలతో కాపాడటానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. మాతోపాటు బాధితుల కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా నిరంతరం పనిచేశారు. ఇప్పటికీ సైంటిస్ట్‌లు, ఇంజినీర్లు, ప్రాజెక్టు మేనేజర్లు, కార్మికులందరూ మట్టిని తొలగించడానికి సాయపడుతున్నారు. ధౌలీగంగ ప్రవాహానికి ఓ వంతెన కూలిపోవడంతో అక్కడ 13 గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వారందరికీ ఆహారం, తాగునీరు, నిత్యావసర వస్తువులను హెలీకాప్టర్ ద్వారా మా దళాలు అందించాయి. ఇంత విషాదాన్ని ఎప్పుడూ చూడలేదు. నా కెరీర్‌లో అత్యంత వేదన కలిగించిన ఆపరేషన్ ఇది. Tags :