నాకు ఇద్దరు పిల్లలు. వారిలో బాబుకి ఆటిజం ఉంది. అమ్మాయికి పెళ్లయ్యింది. మా వారు ఐదేళ్ల క్రితం చనిపోయారు. ‘ఎలాగూ ఆస్తి మాకే చెందుతుంది కదా! నీ తదనంతరం వరకూ ఎందుకు ఇప్పుడే ఇచ్చేయమంటూ’ కూతురూ, అల్లుడూ అడగడంతో పదెకరాల పొలాన్ని వారికి రాసిచ్చేశా. దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ మధ్య ఇంటి అవసరాలకు వాళ్లనే డబ్బులు అడగాల్సి రావడం ఇబ్బందిగా ఉంది. పైగా ప్రతి రూపాయీ లెక్క చెప్పమని అడుగుతున్నారు. చట్టం నాకేమైనా సాయం చేస్తుందా? - ఓ సోదరి మీరు ఆస్తి రాసిచ్చి చాలా పెద్ద పొరపాటు చేశారనిపిస్తోంది. మానసిక ఎదుగుదల లేని మీ అబ్బాయి పోషణ భారం వాళ్లు భరించేలా ముందే ఒప్పందం చేసుకుని ఉండాల్సింది. లేదా ఆస్తి బాబు పేరు మీద ఉంచి అతడి తదనంతరం వాళ్లకు చెందేలా రాసినా బాగుండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సీనియర్ సిటిజన్ యాక్ట్- 2007లోని సెక్షన్ 23(1) ప్రకారం బిడ్డలు తమ పేరు మీద ఆస్తులు రాయించుకున్న తర్వాత తల్లిదండ్రులను సరిగా చూడకపోయినా, పోషణకు అవసరమైన సాయం చేయకపోయినా ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు ఇమ్మని కోర్టుని/ట్రిబ్యునల్‌ని కోరవచ్చు. అలానే సెక్షన్ 23(2) ద్వారా ఆస్తి మీద వచ్చే ఆదాయం నుంచి జీవన భత్యం అడగవచ్చు. ట్రిబ్యునల్ మీ అమ్మాయి, అల్లుడికి నోటీసులు ఇచ్చి వారిని పిలిపించి విచారిస్తుంది. తర్వాత మీకు జీవనభత్యం ఇప్పించడమో లేదా ఆస్తిని తిరిగి తీసుకునే అధికారమో కల్పిస్తుంది. అందుకోసం ముందు మీరు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేయండి. దీన్ని స్వయంగానే కాకుండా పోస్ట్ ద్వారానూ పంపించొచ్చు. ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోండి. Tags :