మేము సైతం సాధించగలం ఒంటికాలితో దేశం చుట్టేసి...! అన్నీ బాగుండి, ఆరోగ్యంగా ఉన్నా... నాలుగడుగులు వేయడానికే మనం ఆలోచిస్తాం. కానీ తాన్యాదాగా అందుకు భిన్నం... ఒంటికాలితోనే 3800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ దేశాన్ని చుట్టేసింది.అదీ తన కోసం కాదు...క్రీడల్లో రాణించాలనుకుంటోన్న దివ్యాంగులకు చేయూతనందించేందుకు...ఆ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఆమె స్ఫూర్తికథ మనమూ చదవాల్సిందే. ‘మార్చలేని గతాన్ని గురించి ఆలోచించే కంటే...చేతిలో ఉన్న భవిష్యత్తు గురించి శ్రమిస్తే విజయం మనదే అని నమ్మా. ఆ నమ్మకమే చావు అంచుల వరకూ వెళ్లిన నన్ను పారాసైక్లిస్ట్‌గా మార్చింది’ అంటోంది పాతికేళ్ల తాన్యా దాగా. ఆమెది మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఉన్న బ్యావరా పట్టణం. 2018లో తాన్యా ఎంబీఏ చదివేందుకు ఊరిని వదిలి దేహ్రాదూన్ వెళ్లింది. చక్కగా చదువుకుంటోంది. ఉన్నత ఉద్యోగం కోసం ప్రణాళికలు వేసుకుంటూ సంతోషంగా సాగిపోతోంది. కానీ జీవితమంటే ఊహించనివి జరగడమే కదా! ఆ ఏడాదే ఓ కారు ప్రమాదంలో తాన్యాకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం తనని ఇండోర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. రెండు శస్త్రచికిత్సలు చేసి ఒక కాలుని తొలగించారు. అయినా సరే ఆమె బతకడం కష్టమని చేతులెత్తేశారు డాక్టర్లు. కానీ తాన్యా తల్లిదండ్రులు...ఆశను వదులుకోలేదు. కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలనుకున్నారు. మెరుగైన చికిత్స కోసం దిల్లీకి తరలించారు. సుమారు ఆరునెలల పాటు చికిత్సలు జరిగాయి. క్రమంగా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది... వారి కథలు విని... తాన్యా ప్రమాదం తాలూకు గాయాల నుంచి బయటపడింది. కానీ కాలు లేదన్న వాస్తవాన్ని జీర్ణించుకోవడం మాత్రం కష్టమైంది. అందరూ చూపించే సానుభూతితో భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంది. దాంతో ఆమెకు ధైర్యం నూరిపోయడానికి తాన్యా సన్నిహితులొకరు ‘ఆదిత్యమెహతా ఫౌండేషన్’ గురించి చెప్పారు. వికలాంగ క్రీడాకారులకు చేయూతనిచ్చే సంస్థ ఇది. అక్కడే తనలాంటివారెందరో నిలదొక్కుకున్న కథల్ని విని స్ఫూర్తి పొందింది. తానూ పారాస్పోర్ట్స్‌లో దేన్నైనా ఎంచుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది. అయితే ఆమె అమ్మానాన్నలు ఒంటికాలు పిల్ల ఇవన్నీ చేయగలదా అని భయపడ్డారు. కానీ తాన్యా మాత్రం నిబ్బరంగా ముందడుగు వేసింది. శిక్షణ తీసుకునేందుకు వారికి నచ్చజెప్పింది. బాధల్ని దిగమింగుకుంటూ... శిక్షణ, సాధన చెప్పినంత సులువేం కాదు...పంటికింద నొప్పిని భరిస్తూ ప్రాక్టీస్ చేసింది. మొదట్లో సైకిల్ ఎక్కడానికి కూడా కష్టపడేది. కానీ అక్కడి కౌన్సెలర్లు క్రమంగా తాన్యాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. దాంతో చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటూ ముందడుగు వేసింది. మొదట 100 కిలోమీటర్ల సైక్లింగ్ పూర్తి చేసింది. తర్వాత వేలకిలోమీటర్లు సైకిల్ తొక్కే సామర్థ్యాన్ని పెంచుకుంది. ‘నాకు చిన్నప్పటి నుంచీ ఆటలంటే ఇష్టం. కానీ ఎప్పుడూ దాని గురించి ప్రణాళిక వేసుకోలేదు. ఇప్పుడు ఇదే నా ఫుల్‌టైమ్ కెరీర్‌గా మారింది’ అని చెబుతోంది తాన్యా. ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఏటా పారా క్రీడాకారుల కోసం నిధులు సేకరిస్తుంది. అందుకోసం ఏర్పాటు చేసిన ‘ఇన్ఫినిటీ రైడ్-2020’కి ఈసారి తాన్యాను ఎంపిక చేసింది. మొత్తం 30 మంది పారా సైక్లిస్టులు ఈ బృందంలో తాన్యా ఒక్కరే అమ్మాయి. తండ్రి చనిపోయినా... ఈ ప్రయాణం కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ... నలభై మూడు రోజుల పాటు సాగింది. ‘వేల మైళ్లదూరం ఒంటికాలితో సైకిల్ తొక్కడం వల్ల కాలి కండరాలు మెలి పెట్టేసేవి. భుజాలు, పాదాలు భరించలేనంత నొప్పిగా ఉండేవి అయినా సరే! ఏ రోజుకారోజు రెట్టించిన ఉత్సాహంతో వెళ్లేదాన్ని. అయినా నన్ను విధి పరీక్షించాలనుకుందేమో! ఓ రోజు నాన్న చనిపోయారనే ఫోన్‌కాల్ విని గుండెలవిసేలా ఏడ్చా. వెంటనే ఊరు వెళ్లిపోయా. అంత్యక్రియలు పూర్తయ్యాక తిరిగి ఎక్కడ ప్రయాణాన్ని ఆపానో అక్కడే తిరిగి మొదలుపెట్టా. నాన్న నా కాళ్లమీద నేను నిలబడాలని కోరుకున్నారు. ఆయన కోసమైనా నేను గెలవాలి’ అని చెబుతోందామె. తాన్యాకి రాజ్‌గఢ్ పోలీసు శాఖ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం కలిసి ‘యూత్ ఐకాన్ ఆఫ్ రాజ్‌గఢ్-2021’, ‘బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్‌మెంట్’ అవార్డులతో సత్కరించాయి. Tags :